దొరికినా దొరేనంటారా? | devulapalli amar writes on note for vote issue | Sakshi
Sakshi News home page

దొరికినా దొరేనంటారా?

Published Wed, Jun 10 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

దొరికినా దొరేనంటారా?

దొరికినా దొరేనంటారా?

రాజకీయాలలో అవకాశం దొరికితే ‘తొండి’ చెయ్యడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కంటే తక్కువేమీ తినలేదని ఇదే కాలమ్‌లో రెండు వారాల క్రితం తెలంగాణ శాసన మండలి ఎన్నికల గురించి రాస్తూ అన్నాను.

డేట్‌లైన్ హైదరాబాద్

రాజకీయాలలో అవకాశం దొరికితే ‘తొండి’ చెయ్యడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కంటే తక్కువేమీ తినలేదని ఇదే కాలమ్‌లో రెండు వారాల క్రితం తెలంగాణ శాసన మండలి ఎన్నికల గురించి రాస్తూ అన్నాను. నా మాటను నిజం చెయ్యాలనుకున్నారో ఏమో చంద్రబాబు అవకాశం లేకున్నా తొండి చేసి అడ్డంగా దొరికి పోయారు.

జూన్ 1న జరిగిన మండలి ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకోడానికి 18 మంది శాసన సభ్యుల బలం అవసరం. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలసి తెలుగుదేశం సాధించుకున్నవి 20 సీట్లు. కానీ ఐదుగురు శాసన సభ్యులను తెలంగాణలోని అధికార పార్టీ తన వైపు లాక్కుంది. దీంతో బీజేపీతో కలసి టీడీపీ బలం 15కు తగ్గిపోయింది. వాటితో ఒక స్థానం గెలవడం అసాధ్యం. కాబట్టి తొండి చేసైనా ఒక స్థానం గెలవా ల్సిందేనని మహానాడు వేదిక మీదనే పథక రచన జరిగింది.

ఒక స్థానం గెలవాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం. ఎందుకయినా మంచిది పడి ఉంటారని ఓ ఎనిమిది మందిని కొనెయ్యండని పురమాయించి టీడీపీ అధినేత మహానాడు వేదికపై నుంచి రాజకీయాలలో నీతిని గురించిన తన ప్రసంగాన్ని కొనసాగించడానికి వెళ్లారట. అక్కడాయన  తెలంగాణలో అధికార పార్టీ తమ శాసన సభ్యులను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నదంటూ రాజకీయాలలో నీతి, విలువల గురించి ప్రబోధిస్తున్న సమ యంలోనే టీడీపీ ఎల్‌పీ ఉప నాయకుడు రేవంత్ రెడ్డి శాసన సభ్యుల కొనుగోళ్ల కార్యక్రమానికి స్కెచ్ వెయ్యడం మొదలెట్టారు.

మనో దౌర్బల్యం గల కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గుర్తించి, ఎర వేశారు. చేపలు వలలో పడతాయనుకుంటున్న తరుణంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావుకు ఈ సమాచారం అందింది. వెంటనే ఆయన టీఆర్‌ఎస్ ఎల్‌పీ సమావేశంలో మండలి ఎన్నికల్లో తేడా వస్తే శాసన సభను రద్ద్దు చెయ్యడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. అంతేకాదు టీడీపీ ప్రలోభాన్ని బయట పెట్టాలని నామినేటెడ్ శాసన సభ్యుడు స్టీఫెన్‌సన్‌ను సిద్ధం చేశారు. రాజకీ యాల్లో ఎవరు మాత్రం పోనీలే అని ఎందుకు ఊరుకుంటారు? రేవంత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిచ్చారు.

సిగ్గుతో తలలు వంచుకోక...!
కొద్ది మాసాల క్రితం జరిగిన పట్టభద్రుల స్థానం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడి పోయింది. కాబట్టి ఈ ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని తాము ఎలాగోలా నెగ్గితే టీఆర్‌ఎస్‌కు వరుసగా రెండవ పరాజయం అవుతుంది. అది చూపి, ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిరస్కరిస్తున్నారు అని తేల్చేయొచ్చనే టీడీపీ ఈ ఘన కార్యానికి దిగింది. పైగా మాటి మాటికీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా మాదే అధికారమని చంద్రబాబు చెపుతున్న జోస్యాన్ని శాంపిల్‌గా రుజువు చేసినట్టూ అవుతుంది.

దీన్ని ఘనకార్యమనడానికీ కారణం ఉంది. సిగ్గుతో తలలు దించుకుని మీడియాకు దొరక్కుండా దాక్కోవాల్సిన సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలూ, మంత్రులూ, చిన్నా చితకా నాయకులంతా టీవీ చానళ్ళ ముందుకొచ్చి శాసన సభ్యుడి కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు, రేవంత్‌లను తెగ వెనకేసుకొస్తున్నారు! ఈ వీరంగం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. శాసనసభ్యుడికి డబ్బు ఇస్తూ కెమెరాలకు దొరికిపోయిన రేవంత్‌ను ఆయన నాయకుడు చంద్రబాబు వెనకేసుకొస్తుండగా... ‘నువ్వు రా, మాకు అమ్ముడు పో, నీకు ఏ ఇబ్బందీ లేకుండా నేను చూసుకుంటా’నని ఫోన్‌లో ధైర్యం నూరిపోసిన చంద్ర బాబును ఆయన పార్టీ యావత్తూ అవినీతి అంతుచూసే మరో అన్నా హజారేగా కీర్తిస్తోంది.

శాసన సభ్యుల కొనుగోళ్ల వ్యవహారంతో మాకు ఎటు వంటి సంబంధం లేదని ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా టీడీపీ నుంచి గానీ, దాని అధినేత నుంచి గానీ రాకపోవడం దిగ్భ్రాంతికరం. ఎంత సేపూ, టీఆర్‌ఎస్ తమ శాసన సభ్యులను కొనుగోలు చేసిందని ఎదురుదాడికి ప్రయ త్నించడమే తప్ప, తమ వల్ల తప్పు జరిగిందని వినమ్రంగా అంగీకరిం చేందుకు టీడీపీ సిద్ధపడటం లేదు. ఒక తప్పును ఎత్తిచూపడం వల్ల ఇంకో తప్పు ఒప్పు అయిపోదని సదరు నేతలకు తెలియకనేనా!

విచారణకు సిద్ధపడాలి
రేవంత్ వ్యవహారంలో తన ప్రమేయం లేకపోతే చంద్రబాబు ఇంత అప్రతి ష్టను ఎందుకు మోస్తున్నట్టు? ఆయన దర్శకత్వంలోనే ఇది జరగకపోయి ఉంటే రేవంత్‌ను వెంటనే పార్టీ నుండి బహిష్కరించాల్సింది. గతంలో ఆయన ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుద్దాల దేవయ్య, కోడెల శివప్రసాద్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ యాదవ్ వంటి వారిని మంత్రి వర్గం నుండి తొలగించడమో, పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడమో చేశారు.

మరి ఇప్పుడెందుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు? పైగా తానే స్వయంగా ఫోన్లో మాట్లాడిన మాటల టేపు మీడియాలో బయటికొస్తే పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఒక వైపు అది తన గొంతు కాదంటారు, మరో వైపు మా ఫోన్‌లు ట్యాప్ చేస్తారా? అని మహా సంకల్ప సభా ప్రాంగణం నుండి ఉక్రోషంతో పెద్దగా అరుస్తారు. అంతేకాదు, ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై రేవంత్ కుటుంబానికి బాసటగా నిలవాలని నిర్ణయించినట్టు కూడా వార్తలొచ్చాయి. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు పరోక్షంగానైనా తప్పు జరిగిందని అంగీకరిస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్ చేసిన దానికి ప్రతీకారంగా చేసినదే కాబట్టి తప్పు కాదని సమర్థించుకోజూస్తున్నారు.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం యోచి స్తున్నదో తెలియదు. కానీ ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్ర పార్టీ తరఫున తాము చంద్రబాబుకు అం డగా ఉంటామని ప్రకటించేశారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ అధికారికంగా ఏమీ మాట్లాడుతున్నట్టు లేదు. ఇప్పటికే కుటిల రాజకీయాలతో విసుగెత్తి పోయి ఉన్న ప్రజలు... రాజకీయాలు మరీ ఇంత దరిద్రంగా తయార య్యాయా? అని చీదరించుకుంటున్నారు.

రాజకీయాల మీదా, నాయకుల మీదా వాళ్లకు మళ్లీ కాసింతైనా విశ్వాసం కలగాలంటే కుంటిసాకులు చెప్పక చంద్రబాబు విచారణను ఎదుర్కోడానికి సిద్ధపడాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే మరీ మంచిది. కానీ ఆయన తాత్కాలికంగానే అయినా అధి కారాన్ని మరొకరి చేతిలో పెట్టడానికి సిద్ధపడకపోవచ్చు. రేవంత్  విషయంలో ఇప్ప టికే చట్టం తన పని తాను చేస్తున్నది. దాన్ని ఆ పని చెయ్యనివ్వాలి.

దుర్మార్గం, ప్రమాదకరం
దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఏపీ ముఖ్య మంత్రి... తనకూ తెలంగాణ ముఖ్యమంత్రికీ మధ్య సాగుతున్న అహాల సంఘర్షణను, టీఆర్‌ఎస్, టీడీపీల మధ్య జరుగుతున్న బలాబలాల నిర్ధారణ తగాదాను ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చిత్రించే ప్రయత్నం చెయ్యడం దుర్మార్గం, ప్రమాదకరం కూడా. రెండు రాష్ట్రాల మధ్య వాటి ప్రజల మధ్య ఘర్షణను ప్రోత్సహించే విధంగా ఆయన ప్రసంగం సాగడం దురదృష్టకరం.

తెలంగాణలో కేసీఆర్ తన వాళ్ళను ఎత్తుకుపోతున్నారని మొత్తుకుంటున్న చంద్రబాబు ఏపీలో చేసిందే మిటి? కాళ్ళ పారాణి ఆరక ముందే అన్నట్లు... ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్లమెంట్‌కు గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన పత్రం మీద సంతకం తడి ఆరకముందే ఇద్దరు ఎంపీలను టీడీపీలోకి ఆహ్వానించి, పచ్చ కండువా కప్పడం ఏ నీతికి, ఏ విలువలకు నిదర్శనం? ఇంత జరుగుతుంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని జనసేన పెట్టిన పవన్ కల్యాణ్ ఏమైనట్టు? ఆయన ఎందుకు నోరు విప్పడం లేదు? ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు.

ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇతర పార్టీల నుండి తాము ఏదో ఒక రూపంలో కొనుగోలు చేసిన లేదా తమ పార్టీలోకి వలస వచ్చిన శాసనసభ్యుల స్థానాలకు వారి చేత రాజీనామాలు చేయించి, స్పీకర్ చేత ఆమోదింపజేసుకుని వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధపడాలి. అంతే కానీ తన స్థాయి మరిచి బహిరంగ సభలలో అభ్యంతరకరమైన భాషలో రెచ్చిపోవడం మంచిది కాదు.

నీతి అందరికీ ఒకటిగానే ఉంటుంది. బంగారు తెలంగాణకు ఒక నీతి, స్వర్ణాంధ్రప్రదేశ్‌కు మరో నీతి, మిగతా సమాజానికి అంతటికీ ఇంకో నీతి ఉండదు. అవినీతి రహిత భారత్ నిర్మాణమే మా ధ్యేయం అని ప్రకటించుకున్న మోదీ ప్రభుత్వం  రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ అవినీతి బాగోతం విషయంలో ఎట్లా వ్యవహరిస్తుం దో వేచి చూడాల్సిందే.

- దేవులపల్లి అమర్
(datelinehyderabad@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement