ఊరూ పేరులేని...తమకంటూ ఎలాంటి గుర్తింపూ లేని నిర్భాగ్యులు గత పక్షం రోజులుగా మేఘా లయలోని జయంతియా కొండల్లో తవ్వుతున్న అక్రమ గనిలో చిక్కుకున్న తీరు మన ప్రభుత్వాల సమర్థతను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఆ అక్రమ గనిలో ప్రమాదం ముంచుకొచ్చే సమయానికి ఎందరు న్నారో, వారిలో ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ గని నిర్వాహకుడు చెబుతున్న ప్రకారమైతే 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు. 15మంది చిక్కుకు పోయారు.
అక్రమ గనికి సమీపంలో ప్రవహించే లీతీన్ నది ఉప్పొంగి ఆ నీరంతా అందులోకి చేరిం దని అంటున్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, మైనింగ్ పనిలో పాల్గొనేవారికి అవసరమైన రక్షణ ఉపకరణాలేవీ ఇవ్వకుండా అధికారుల అండతో సాగిస్తున్న ఈ దుర్మార్గం గురించి పర్యావరణవా దులు ఎన్నో ఏళ్లనుంచి పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే పోయాయి. కనీసం వారి పిటిషన్లలో ఏముందో చదివి ఉన్నా ఇప్పుడు జరిగిన ప్రమాద తీవ్రత తెలిసేది. నీళ్లు తోడటానికి పక్షం రోజులుగా వినియోగిస్తున్న పంప్‌సెట్లు పనికిరావని ఇన్నాళ్లకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి, ప్రభుత్వానికి జ్ఞానోదయమైంది. ఆపరేషనంతా పూర్తయ్యేసరికి ప్రమా దంలో చిక్కుకున్నవారు ప్రాణాలతో ఉంటారా అన్నది అనుమానమే.
మేఘాలయలో ఉన్న బొగ్గు నిక్షేపాల పరిమాణం 64 కోట్ల టన్నులకు మించి ఉంటుందని చెబుతున్నారు. జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఆ రాష్ట్రం వాటా పది శాతం. మొన్నటి వరకూ మేఘా లయ ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ మైనింగ్ ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అక్రమ మైనింగ్ యధావిధిగా సాగుతోంది. మేఘాలయలో బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగును పోలి ఉండేలా నిలువుగా తవ్వుతారు. బొగ్గు తారసపడ్డాక అక్కడినుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు.
ఈ విధానం అశాస్త్రీయమైనదని, దీనివల్ల బొగ్గు వెలికి తీసేవారి ప్రాణాలకు ముప్పు కలగడంతోపాటు పర్యావరణం కూడా నాశనమవుతుందని పర్యావ రణవాదులు వాదిస్తున్నారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల వరద ముంచెత్తినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. 2007–14 మధ్య వీటిలో దాదాపు 15,000మంది మరణించి ఉంటారని ఇంపల్స్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. జయంతియా కొండలపై కురిసే వర్షాల వల్ల ఏర్పడ్డ నదులు క్షీణదశకు చేరుకుంటున్నాయి. ఎక్కడి కక్కడ గనుల్లో నీరు నిల్వ ఉండిపోవడమే ఇందుకు కారణం. పైగా వెలికి తీసిన బొగ్గును బయటే వదిలేయడం వల్ల నదీ జలాల్లో ఆమ్లాలు అధికమై అవి తాగడానికి, పంటలకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. జనం ఆరోగ్యం దెబ్బతింటోంది.
ఇన్ని ప్రమాదాలు ఇమిడి ఉన్న మైనింగ్ చుట్టూ రాజకీయాలు పరిభ్రమించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్‌పీపీ–బీజేపీ కూటమిలోని పార్టీలు, గతంలో రాష్ట్రాన్నేలిన కాంగ్రెస్ కూడా మైనింగ్ యజమానులకు మద్దతుగానే నిలబడ్డాయి. మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినవారిలో 30శాతంమంది గనుల యజమానులే. ఎన్‌జీటీ ఉత్తర్వుల వల్ల తమ జీవనాధారం దెబ్బతిన్నదని, వీటిని వెనక్కు తీసుకోవాలని మైనింగ్ యజమానులు ఉద్యమిస్తే అన్ని పార్టీలు వత్తాసు పలికాయి. పర్యావరణానికి మేం ఒక్కరమే హాని కలిగిస్తున్నామా అన్నది మైనింగ్ యజమానుల ప్రధాన ప్రశ్న! ఎన్‌జీటీ నిషేధాన్ని ఎత్తేయించడానికి మొన్న ఫిబ్రవరి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. అప్పటి ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం వల్లే కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైం దని చెబుతారు. తాము అధికారంలోకొస్తే 8 నెలల్లో దీన్ని పరిష్కరిస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
ఆతర్వాత ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంత్రులతో ఒక కమిటీని కూడా నియమిం చారు. అదెంతవరకూ వచ్చిందోగానీ ఈలోగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వెలికి తీసిన బొగ్గు నిల్వల్ని అమ్మడానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనుమతుల్ని వచ్చే జనవరి నెలాఖరు వరకూ పొడిగించింది. కానీ మైనింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా సాగిపోతూనే ఉన్నాయి. వాటి జోలికి పోతే రాజకీయంగా ముప్పు కలుగుతుందని పార్టీలన్నీ భయపడటంతో అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. బొగ్గు మాఫియా ఎంత బలంగా పనిచేస్తున్నదో చెప్పడానికి 2015 లో జరిగిన ఎస్‌ఐ హత్యే ఉదాహరణ. చట్టవిరుద్ధంగా తరలుతున్న 32 బొగ్గు లారీలను పట్టుకున్నం దుకు మర్బనియాంగ్ అనే ఎస్‌ఐని మాఫియా కొట్టి చంపితే ఈనాటికీ అతీగతీ లేదు. ఆయన్ను హత్య చేశారని ఒక పోస్టుమార్టం నివేదిక చెప్పగా, మరో నివేదిక దాన్ని ఆత్మహత్యగా తేల్చింది.
అక్రమ మైనింగ్ యాజమాన్యాల దుశ్చర్యలు అన్నీ ఇన్నీ కాదు. మైనింగ్ కలుగులన్నీ కేవలం ఒక మనిషి ప్రవేశించడానికి సరిపోయేంత ఇరుగ్గా ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే లోపలికి పంపడానికి వీలుంటుంది. పైగా దృఢకాయులు పనికిరారు గనుక మైనర్ బాలల్ని ఎక్కు వగా ఇందుకోసం వినియోగిస్తారు. వీరు వందల అడుగుల లోతులకు వెళ్లి అక్కడ అడ్డంగా సొరంగం చేస్తూ బొగ్గు సేకరించాలి. ఈ పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 ఇస్తారు. ఇదంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరించిన పార్టీలు, ప్రభుత్వమూ కూడా ఈ పాపంలో భాగస్వాములు. చట్టవిరుద్ధమైన మైనింగ్‌ను ఆపలేకపోవడమే కాదు...కనీసం ప్రమా దంలో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలన్న అవగాహన కూడా లేకుండా విలువైన సమయాన్ని వృధా చేసిన పాలకుల తీరు క్షమార్హం కాదు. ఇప్పటికైనా మృత్యు కుహరాలను శాశ్వతంగా మూసేందుకు చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment