ఎన్‌కౌంటర్లో ఎన్నో చిక్కుముళ్లు | Editorial About Uttar Pradesh Gangster Vikas Dubey Encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లో ఎన్నో చిక్కుముళ్లు

Published Sat, Jul 11 2020 1:48 AM | Last Updated on Sat, Jul 11 2020 1:48 AM

Editorial About Uttar Pradesh Gangster Vikas Dubey Encounter - Sakshi

పోలీసులకు చిక్కి 24 గంటలు గడవకుండానే ఉత్తరప్రదేశ్‌ డాన్‌ వికాస్‌ దుబే శుక్రవారం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతన్ని మధ్యప్రదేశ్‌ నుంచి స్వస్థలానికి తరలిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగిందని, ఇదే అదునుగా అతను తమ దగ్గర నుంచి పిస్తోలు గుంజుకుని పరారయ్యేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని యూపీ పోలీసుల కథనం. దుబే వంటి కరడుగట్టిన నేరగాడు అయిదు రాష్ట్రాలు దాటి, 1,500 కిలోమీటర్లు ప్రయాణించి సుదూరంగా వున్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికొచ్చి అక్కడ ఎలాంటి ప్రతిఘటనా లేకుండా సులభంగా చిక్కాడంటేనే ఎవరూ నమ్మలేదు. దాన్నుంచి అందరూ తేరుకునేలోగానే అతని అంతం కూడా పూర్తయిపోయింది.

అన్ని ఎన్‌కౌంటర్‌ కథల్లాగే దుబే ఎన్‌కౌంటర్‌ కూడా జవాబులేని ప్రశ్నలెన్నో మిగిల్చింది. దుబే ఇన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నవాడు కాదు. ఎప్పుడూ అజ్ఞా తంలో లేడు. అధికారంలో ఎవరున్నా దశాబ్దాలుగా తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నవాడు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రిని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే కాల్చిచంపినా నిర్దోషిగా బయటికొచ్చినవాడు. ఆ తర్వాత కూడా తన నేరాల్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నవాడు. సరిగ్గా ఈ కారణాల వల్లనే వికాస్‌ దుబే అంతమైన తీరును అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్నవారికి అతనిపై సానుభూతి లేదు.

ఇన్ని దశాబ్దాలుగా అతను ఎవరి అండదండలతో ఎదిగి ఈ స్థితికి చేరుకున్నాడో నిగ్గుతేలితే భవిష్యత్తులో ఇలాంటివారు తలెత్తకుండా అరికట్టడానికి అస్కారం వుంటుందన్నదే వారి వాదన. దుబే నోరు విప్పితే వివిధ పార్టీలకు చెందిన అనేకమంది రాజకీయ నాయకులతోపాటు పలువురు పోలీస్‌ అధికారుల జాతకాలు కూడా బయటపడతాయన్న భయం తోనే ఎన్‌కౌంటర్‌ పేరుతో అతని కథ ముగించారన్న సందేహం అనేకమందిలో వుంది. దుబే ఎన్‌కౌంటరైన తీరు నాలుగేళ్లక్రితం తెలంగాణలో ముగిసిపోయిన నయీముద్దీన్‌ అనే నేరగాడి ఉదంతాన్ని గుర్తుకుతెస్తుంది. 

ఈ ఎన్‌కౌంటర్‌ కథనంలో ఆద్యంతమూ ఎన్నో కంతలున్నాయి. ఉజ్జయినిలో అతన్ని అదుపు లోకి తీసుకున్నాక బయల్దేరిన వాహనం వేరు... ప్రమాద సమయంలో అతను ప్రయాణిస్తున్న వాహనం వేరు. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రంలో పట్టుబడినవారిని ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నాక మాత్రమే తరలిస్తారు. దుబే విషయంలో అదేమీ పాటించలేదు. ఎనిమిదిమంది పోలీసులను ఉచ్చులోకి లాగి కాల్చిచంపిన నేరగాడు పట్టుబడితే అతనికి సంకెళ్లు వేయకుండా తరలించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.

కరడుగట్టిన నేరగాడు తమ వద్ద ఆయుధం గుంజుకుని, ఎదురుతిరిగే ప్రమాదం వుంటుందని పోలీసులకు తట్టలేదంటే నమ్మశక్యంగా తోచదు. అతన్ని తరలిస్తున్నవారు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పోలీసులు. వారికి ఈ మాత్రం కనీస పరిజ్ఞానం లేదంటే ఎవరూ నమ్మలేరు. అలాగే ఎన్‌కౌంటర్‌ జరగడానికి అరగంట ముందు ఆ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారని స్థానికులు చెబుతున్నారు. దుబే అనుచరులెవరైనా కారుపై దాడి చేసి అతన్ని విడిపించుకుపోయే ప్రయత్నం చేస్తారన్న శంక వుండటం వల్ల ఇలా చేశారనుకున్నా... మరి సంకెళ్లు వేయాలన్న ఆలోచన వారికి ఎందుకు రాలేదన్న సంశయం ఏర్పడుతుంది. అతన్ని తీసుకెళ్తున్న వాహనం బోల్తాపడటంలోనూ బోలెడు అనుమానాలున్నాయి.

పోనీ అదే జరిగింద నుకున్నా... దాన్నుంచి దుబే వంటి స్థూలకాయుడు సులభంగా బయటకు రావడం, పోలీసులనుంచి పిస్తోలు గుంజుకుని తప్పించుకుపోవడానికి ప్రయత్నించడం సాధ్యమా అన్న సందేహం కలుగు తుంది. అలా పారిపోవాలన్న ఉద్దేశమే అతనికుంటే ఉజ్జయిని ఆలయంలో నిరాయుధంగా వున్న గార్డు తన ఉనికిని పోలీసులకు వెల్లడిస్తున్నప్పుడే ఆ పని చేసేవాడు. ఆ సమయంలో పోలీసులు వచ్చేవరకూ వేచిచూసి దొరికిపోయినవాడు మరికొన్ని గంటలకు అంతమంది సాయుధ పోలీసుల వలయం నుంచి పారిపోదామని ప్రయత్నించాడంటే నమ్మశక్యం కాదు.

దుబే కాలుకి స్టీల్‌ రాడ్‌ వుండటం వల్ల పారిపోవడం సులభమేమీ కాదు. ఉజ్జయిని నుంచి దుబేను తీసుకెళ్లే వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా ప్రతినిధుల వాహనాలను ఆపి, దూరంగా వుండాలని పోలీసులు కోరడం, ఆ తర్వాత అతన్ని వేరే వాహనంలోకి తరలించి తీసుకెళ్లడం... కొద్దిసేపటికే ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. తమ సహచరులను అత్యంత క్రూరంగా మట్టు బెట్టాడన్న ఆగ్రహం పోలీసుల్లో సహజంగానే వుంటుంది. కానీ సొంత చొరవతో, ఎవరి ఆదేశాలూ లేకుండా వారు దుబేను కాల్చిచంపివుంటారని నమ్మడం అసాధ్యం. 

అమానుషమైన నేరాలకు పాల్పడేవారి విషయంలో సాధారణ జనంలో సహజంగానే ఆగ్ర హావేశాలుంటాయి. దుబే ఉదంతం వెల్లడైనప్పటినుంచి అతన్ని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నవారే అధికం. కానీ అందువల్ల ఒక నేరగాడు మరణిస్తాడు తప్ప, నేరం సమసిపోదు. దుబే ఎవరి ప్రాపకమూ, ప్రోద్బలమూ లేకుండా తన నేర సామ్రాజ్యాన్ని నడిపాడంటే విశ్వసించలేం. అతని చుట్టూ అల్లుకుని వున్న కీలక వ్యక్తులెవరో, అతన్ని ఇన్ని దశాబ్దాలుగా కాపాడే క్రమంలో అటువంటివారు వ్యవస్థల్ని ఎలా ధ్వంసం చేశారో, అందుకు వారిని పురిగొల్పిన అంశాలేమిటో బట్టబయలైతే రాజకీయ నాయకులుగా, పోలీసు అధికారులుగా చలామణి అవుతున్నవారెందరో జైలుపాలవుతారు.

నేర సామ్రాజ్యాలు బద్దలై, ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రక్షాళన అవుతాయి. ప్రజా నీకం భద్రతకు గ్యారెంటీ ఏర్పడుతుంది. ఇప్పుడు దుబేను మట్టుబెట్టడంతో ఆ ప్రక్రియకు గండి పడింది. ఇన్నేళ్లూ దుబేను పెంచిపోషించినవారు మారతారునుకోవడానికి లేదు. వారు ఎప్పటిలాగే తమ చీకటి కార్యకలాపాలను దర్జాగా కొనసాగిస్తారు. అందుకు ఇతర నేరగాళ్లను వినియో గించుకుంటారు. ఇదే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement