కొత్త చెలిమికి వెదుకులాడటం, పాత చెలిమిని పటిష్టం చేసుకోవడం దౌత్య సంబంధాల్లో నిత్యా వసరం. జమ్మూ–కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో మనకు అది మరింత కీలకం. కనుకనే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకెళ్లి అక్కడి తూర్పు ప్రాంత రాజధాని అయిన వ్లాడివోస్టోక్ నగరంలో జరిగిన తూర్పు ఆర్థిక వేదిక(ఈఈఎఫ్) సదస్సులో పాల్గొన్నారు. ఆ ప్రాంత పర్యటనకెళ్లిన తొలి ప్రధాని మోదీయే. అలాగే కేవలం వెనకబడిన ఆఫ్రికా దేశాలకు సాయం చేయడం కోసం ఉద్దేశించిన రుణ సదుపాయ పథకాన్ని రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశానికి వర్తింపజేయడం కూడా కీలక నిర్ణయం. ఆ పథకం కింద అక్కడి తూర్పు ప్రాంతానికి రూ. 7,200 కోట్ల రుణాన్ని ఇవ్వబోతున్నట్టు మోదీ ప్రకటించారు. వ్లాడివోస్టోక్ నగరం ఆ దేశ రాజధాని మాస్కోకు దాదాపు 6,500 కిలోమీటర్ల దూరం. ఆ నగరం అటు ఉత్తర కొరియాకు, ఇటు చైనాకు ఇంతకన్నా బాగా దగ్గర.
సోవియెట్ యూనియన్ పతనమై ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడుతున్న దశలో ఇతర దేశాల తరహాలోనే మన దేశం కూడా క్రమేపీ అమెరికాకు దగ్గరైంది. ఆర్థికంగా బాగా దెబ్బతిన్న పూర్వపు సోవియెట్ దేశాలన్నీ కూడదీసుకుని రష్యా నేతృత్వంలో కూటమిగా ఏర్పడ్డాక పాత మిత్రులకు మళ్లీ సన్నిహితం కావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఒకసారంటూ పొరపొచ్చాలు వస్తే సంబంధాలు మళ్లీ యధాస్థితికి చేరడం అంత సులభం కాదు. ఏటా ఇరు దేశాలూ శిఖరాగ్ర సద స్సులు జరుపుకోవాలని 2000 సంవత్సరంలో నిర్ణయించినా, అవి క్రమం తప్పకుండా సాగుతూనే ఉన్నా భారత్–రష్యాలు మునుపటిలా దగ్గర కాలేకపోయాయి. మన రక్షణ పరికరాల కొనుగోళ్లలో సింహభాగం ఇప్పటికీ రష్యాదే అయినా, అనేక కారణాల వల్ల ఇటీవలికాలంలో వేరే దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం.
రష్యాకు చెందిన ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ(ఏడీఎంఎస్)కొనుగోలుకు నిరుడు మనకు ఒప్పందం కుదిరినా దానికి పలు మార్లు అమెరికా మోకాలడ్డింది. తాము రష్యాపై ఆంక్షలు విధించినందున ఆ దేశంతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందం కుదుర్చుకోరాదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. చివరకు దాన్ని ఒప్పించాకే ఒప్పందం కుదిరింది. గత నెల 16న భద్రతామండలి కశ్మీర్‌పై రహస్య సమావేశాన్ని నిర్వహిం చినప్పుడు ఆ సమస్య భారత్–పాక్‌ల ద్వైపాక్షిక అంశమని చెప్పి రష్యా మనల్నే సమర్థించినా... ఐక్యరాజ్యసమితి తీర్మానాలను కూడా పరిగణనలోకి తీసుకుని రెండు దేశాలూ చర్చించుకుని పరి ష్కారం సాధించాలని సూచించింది. అంతక్రితం కశ్మీర్ విషయంలో రష్యా మనల్ని ఏకపక్షంగా సమర్థించేది. భారత్ వ్యతిరేక తీర్మానాలను వీటో చేసేది. కానీ ఇప్పుడు దాని స్వరంలో మార్పు రావడం పొరపొచ్చాల ఫలితమే.
వర్తమాన ప్రపంచంలోని పలు సమస్యల విషయంలో భారత్, రష్యాల వైఖరులు భిన్నంగా ఉంటున్నాయి. అఫ్ఘానిస్తాన్‌లో శాంతి స్థాపన అంశమే ఇందుకు ఉదాహరణ. అక్కడ తాలిబన్‌లతో చర్చలు జరిపి, దాన్ని ప్రధాన స్రవంతికి తీసుకురావాలన్న పాకిస్తాన్, చైనా వాదనకు రష్యా మద్ద తిస్తోంది. కానీ తిరిగి తాలిబన్‌లు పుంజుకుంటే ఈ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నది మన దేశం వైఖరి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తదితర దేశాలతో భారత్ జత కట్టడం చైనాను అదుపు చేసేందుకేనని, అంతిమంగా అది తన ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని రష్యా భావిస్తోంది. వ్లాడివోస్టోక్ కూడా పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉంది. మన ప్రయోజనాలకు అడుగడుగునా గండికొట్టే చైనాకు రష్యా క్రమేపీ దగ్గరవుతున్నదని భారత్ భావన.
తమ ఇతరత్రా సంబంధాలు రష్యాకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి కావని చెప్పడం మోదీ పర్యటన ప్రధాన ఉద్దేశం. దానికితోడు ఇరు దేశాల మధ్యా ఇటీవల వాణిజ్య సంబంధాల్లో స్తబ్దత ఏర్పడింది. వీటిని తిరిగి పట్టాలెక్కించడమే మోదీ పర్యటన ఆంతర్యం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ జరిపిన చర్చల్లో ఇరు దేశాల వార్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న 1,100 కోట్ల డాలర్ల స్థాయి నుంచి 2025కల్లా 3,000 కోట్ల డాలర్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఇంధనం, రక్షణ, వైమానిక, నావికా రంగాలకు సంబంధించి 15 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
మన సైన్యం వినియోగించే రక్షణ రంగ పరికరాల్లో అత్యధికం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. వాటికి విడిభాగాల కొరత బాగా ఉంది. తాజా చర్చల పర్యవసానంగా రెండు దేశాల భాగస్వామ్యంతో మన దేశంలోనే విడిభాగాల ఉత్పత్తి మొదలవుతుంది. చెన్నై–వ్లాడివోస్టోక్‌ల మధ్య సాగర మార్గాన్ని అభివృద్ధి చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మరో మూడేళ్లలో చంద్రుడిపైకి ముగ్గురు వ్యోమగాముల్ని పంపే ‘గగనయాన్’ను మన దేశం చేపట్టబోతున్న నేపథ్యంలో ఆ ముగ్గురికీ తమ దగ్గర శిక్షణ ఇవ్వడానికి పుతిన్ అంగీకరించారు. పుతిన్‌తో కలిసి జరిపిన మీడియా సమావేశంలో కశ్మీర్ తమ ఆంతరంగిక సమస్యని మోదీ స్పష్టం చేశారు.
దేన్నయినా వ్యంగ్యభరితం చేసే సామాజిక మాధ్యమాల్లో కష్టకాలంలో ఉన్న మనం రష్యాకు రూ. 7,200 కోట్ల రుణం ఇవ్వడంపై కూడా విమర్శలొచ్చాయి. అయితే ఈ రుణంతో చేపట్టే ప్రాజెక్టుల్లో 75 శాతం సామగ్రిని, సేవలను భారత్ నుంచే దిగుమతి చేసుకోవాలన్న నిబంధన ఉంది. అలాగే ఆ ప్రాజెక్టుల్ని మన సంస్థలు మాత్రమే చేపడతాయి. ఈ రెండు నిబంధనల వల్లా మన ప్రైవేటు, పబ్లిక్ రంగ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయి. కనుక దీనివల్ల అంతిమంగా మన దేశానికి లబ్ధి చేకూరుతుంది. నిలకడలేని అమెరికా వ్యవహార శైలి కారణంగా దానిపైనే సంపూర్ణంగా ఆధారపడటం మన దేశానికి సాధ్యం కాదు. అందువల్లే రష్యాతోనైనా, మరే దేశంతోనైనా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, లోటుపాట్లను చక్కదిద్దుకోవడం అత్యవసరం.
Comments
Please login to add a commentAdd a comment