హద్దు మీరిన అగ్రరాజ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యమైన రీతిలో సిరియాపై విరుచుకు పడి హఠాత్తుగా ప్రపంచాన్ని ప్రచ్ఛన్న యుద్ధ కాలపుటంచులకు చేర్చారు. అమెరికా మరోసారి ఇలా సిరియాపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని, ప్రతీకార దాడులు తప్పవని రష్యా, ఇరాన్‌లు తీవ్రంగా ప్రతిస్పందించాయి. సిరియా సమ స్యపై ప్రత్యక్ష çసంఘర్షణ నివారణ కోసం అమెరికాతో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సమాచార సంబంధాల వ్యవస్థను రష్యా స్తంభింపజేసింది. సిరియా కేంద్రంగా అమెరికా, రష్యాల మధ్య రాజుకుంటున్న ఈ ఉద్రిక్తతల ప్రకంపనలు మధ్య ప్రాచ్యానికే పరిమితం కావు, ప్రపంచ శాంతికే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
సిరియాలో ఏప్రిల్ 4న ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదార్ల ఆధీనంలోని ఖాన్ షిఖాన్ పట్టణంపై రసాయనిక ఆయుధ దాడులకు పాల్పడి 80 మంది అమా యకపౌరుల మృతికి కారణమైనది బషర్ అల్ అసద్ ప్రభుత్వమేనని అమెరికా ఏక పక్షంగా నిర్ధారించింది. అది చాలదని ఐక్యరాజ్య సమితిని విస్మరించి దోషిని తక్ష ణమే శిక్షించే బాధ్యతను తనకు తానే కట్టబెట్టేసుకుంది. సిరియాలో జరిగిన రసా యనిక ఆయుధ దాడి ‘అమెరికా జాతీయ ప్రయోజనాలతో’ ముడిపడినది కాబట్టి, తమ దేశంపై రసాయనిక ఆయుధ ప్రయోగం జరగకుండా నివారించడానికి క్షిపణి దాడులు అవసరమయ్యాయని అమెరికా అధ్యక్షుడు తన చర్యను సమర్థించుకున్నారు.
అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఈ దాడికి ఆదేశించి తన రాజ్యాంగబద్ధ అధికారాల పరిధిని అతిక్రమించారనే విమర్శలు వినవస్తున్నాయి. అంతకు మించి ఐరాస భద్రతా మండలి అనుమతి లేకుండా మరో దేశంపై దాడులకు పాల్పడి అమెరికా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిం దనేది స్పష్టమే. సిరియాపై దాడి యుద్ధ నేరం కిందికి వస్తుందనే దుమారం రేగుతోంది. అన్నిటికి మించి ట్రంప్ ఎన్నికల ప్రచారం నుంచి ఇటీవలి వరకు సిరియా వ్యవహారంలో తలదూర్చడం అమెరికా చేసిన ఘోర తప్పిదంగా ప్రచారం చేశారు. పైగా రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో అధ్యక్షుడు కాకముందు నుంచీ ట్రంప్ సత్సంబంధాలను నెరపారు.
ఏది ఏమైనా అమెరికా–రష్యా సత్సంబం ధాలు సిరియా సమస్య శాంతియుత పరిష్కారానికి దారితీస్తాయనే ఆశనూ రేకెత్తించాయి. అలాంటì ది సిరియా, రష్యాల పట్ల ట్రంప్ వైఖరి హఠాత్తుగా ఇలా తలకిందులు కావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నిజానికి ఈ నెల రెండవ వారంలో అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ మాస్కోలో రష్యా అధ్యక్షునితో చర్చలు జరపాల్సి ఉంది. సిరియా సమస్యపై రష్యా చొరవతో సాగు తున్న శాంతి ప్రక్రియ సైతం ఆ సందర్భంగా ప్రస్తావనకు వస్తుందన్నారు.
ట్రంప్ వైఖరిలోని ఈ పెను మార్పు అనూహ్యమైనదే కానీ అసాధారణమైనది కాదు. 2009లో బరాక్ ఒబామా అధ్యక్షునిగా ఎన్నికయ్యేనాటికి ఆయన హయాంలో అమెరికా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుందని, సిరియా కొలిమిని రాజేయడంలో ఒక కీలక పాత్రధారి అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రపంచంలో అమెరికా స్థానం అద్వితీయమైనది, ప్రపంచ రాజకీయ, అర్థిక వ్యవ స్థలను నియంత్రించే బాధ్యత తమదే అనే భావన ఆ దేశ అధికార వ్యవస్థ నరన రాన జీర్ణించుకుపోయింది. బలీయమైన దాని ప్రభావం వల్లనే ఒబామా చివరకు అఫ్ఘానిస్థాన్‌లో అమాయక పౌరులను బలిగొనే ద్రోన్ యుద్ధాన్ని ముమ్మరం చేయడంతో ప్రారంభించి, 2011లో సిరియా యుద్ధం మొదలయ్యే నాటికి ‘ఏది ఏమైనా అసద్ గద్దె దిగాల్సిందే’ అనే మొండిపట్టు పట్టేవారుగా మారారు.
ఆ క్రమంలో ఆయనలోని శాంతి ప్రవక్త తెరమరుగయ్యారు. కాబట్టే అసద్‌ను కూల దోసే లక్ష్యంతో అల్‌కాయిదా గ్రూపులకు సకల హంగులూ చేకూర్చి, వాటితో పాటూ ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదానికీ పురుడు పోసినవారయ్యారు. పూర్వ అధ్యక్షులం దరికీ భిన్నంగా ‘ప్రథమ ప్రాధాన్యం అమెరికాకే’ అంటూ కరడుగట్టిన జాతీయవాద అధ్యక్షునిగా గద్దెనెక్కిన ట్రంప్.. చైనా దూకుడుకు అడ్డుకట్టవేయడంతోపాటూ, సువిశాలమైన ట్రాన్స్–పసిఫిక్ భాగస్వామ్య(టీపీపీ) కూటమిని నిర్మించడానికి ఒబామా హయాంలో జరిగిన కృషినంతటినీ ఒక్క కలం పోటుతో కాలదన్నారు. టీపీపీ రక్షణ భారాన్ని భరించరాదన్న జాతీయవాద వైఖరే అందుకు ప్రేరణ. నాటో రక్షణ భారాన్ని ఇక అమెరికా మోయబోదని తేల్చేశారు. తమ దేశానికి అతిథిగా వచ్చిన జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మర్కెల్‌నూ ఆ విషయమై నిలదీశారు.
ముస్లింలు, వలస వచ్చిన ప్రజలపై బాహాటంగా వివక్షను ప్రదర్శిస్తున్న కరడు గట్టిన జాతీయవాది ట్రంప్ క్రమంగా అమెరికా అధికార వ్యవస్థ ప్రాబల్యానికి లోబడుతూ అగ్రరాజ్యవాదిగా కూడా పరివర్తన చెందుతున్నారని అనడానికి సిరియాపై జరిపిన క్షిపణి దాడులు సంకేతం కావచ్చు. ఐరాసలోని అమెరికా రాయ బారి నిక్కీ హేలీ ‘ఏది ఏమైనా అసద్ గద్దె దిగాల్సిందే’ అంటూ సిరియాపై అమెరికా ‘కొత్త వైఖరి’ని ప్రకటించారు. ఇది 2015లో ఒబామా విడనాడిన వైఖరి! సిరియాపై పది కోట్ల డాలర్ల ఖరీదైన 59 టామ్‌హాక్ క్షిపణులను ప్రయోగించి అమెరికా సాధిం చినదేమిటి?.
దాదాపు ఐదు లక్షల మందిని బలిగొని, కోటీ ఇరవై లక్షల మందిని క్షతగాత్రులనో, శాశ్వత వికలాంగులనో చేసి, సగం దేశ జనాభాను శరణార్థులుగా మార్చిన మారణ హోమం ఏదో ఒకలా చివరకు శాంతించబోతోందని ఆశలు రేగు తున్న సమయంలో.. సిరియా సంక్షోభాన్ని తిరిగి 2012 నాటికి తేవాలన్న దుస్సాహ సిక ప్రకటనను చేయడం మాత్రమే కాదా? 2013లో రసాయనిక ఆయుధ ప్రయోగం జరిగినప్పుడు ఐరాస అంతర్జాతీయ నిపుణులను పంపింది. అలా జర గక ముందే అమెరికా ఈసారి ఇలా బల ప్రదర్శనకు ఎందుకు దిగినట్టు? పాడుబడ్డ వైమానిక స్థావరమైన షాయరత్ ఎయిర్ బేస్ నుంచి సిరియా విమానాలు ఖాన్ షిఖాన్‌పై రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడ్డాయంటూ క్షిపణులు కురి పిస్తారా? అధ్యక్షుడు ట్రంప్‌కు నిలకడలేని వారుగా పేరుంది. అందులో ఎంత నిజ ముందోగానీ, ఆయనలోని ఈ కదన కుతూహలం ఆ నిలకడ లేనితనం ఫలమే అయితే అంతకన్నా కావాల్సింది లేదు.