పారదర్శకతకు పాతరేసి, నల్లడబ్బు పెరగడానికి దోహదపడుతున్న ‘స్విస్ చాలెంజ్’ విధానానికి స్వస్తి చెప్పాలంటూ గత కొన్నాళ్లుగా సామాజిక ఉద్యమకారులు చేస్తున్న డిమాండుకు ఇప్పుడు మరింత ఊతం వచ్చింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల టెండర్లలో ఈ విధానాన్ని ప్రోత్సహించవద్దని కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నిర్మొహమాటంగా చెప్పింది. దేశంలో దాదాపు అర డజను రాష్ట్రాలు ఈ విధానం ద్వారా వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల్ని వివిధ కంపెనీలకు అప్పజెప్పాయి.
దేశంలో 400 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు గత జూలైలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక ప్రాజెక్టును గుర్తించడం, దాని నిర్మాణానికయ్యే వ్యయాన్ని మదింపు వేయడం, అనంతరం టెండర్లు పిలవడం అనే ప్రక్రియ ఉంటుంది. పేరెన్నికగన్న సంస్థలన్నీ అందులో పోటీపడతాయి. ఆ ప్రాజెక్టును తక్కువ వ్యయంతో పూర్తి చేస్తామని ముందుకొచ్చిన సంస్థకు ఆ టెండరు దక్కుతుంది. అయితే ప్రాజెక్టును గుర్తించి టెండర్లు పిలవడం దగ్గర్నుంచి దాన్ని అప్పజెప్పేవరకూ ఉండే ప్రక్రియకు సహజంగానే సుదీర్ఘ సమయం పడుతుంది.
‘స్విస్ చాలెంజ్’ విధానం దీనికి భిన్నమైనది. దీనికింద ప్రభుత్వ అవగాహనకు రాని ప్రాజెక్టును సైతం ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు తమంత తాము ప్రతిపాదించవచ్చు. దాన్ని నిర్ణీత వ్యయంతో పూర్తి చేస్తామని చెప్పవచ్చు. అలాంటి ప్రతిపాదనను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచి దాన్ని మరింత మెరుగుపరిచేందుకు లేదా ఆ ప్రతిపాదనకు దీటైన ప్రతిపాదన అందజేయడానికి అందరికీ అవకాశం ఇస్తుంది. అలా వచ్చే ప్రతిపాదనల్ని నిపుణుల కమిటీ పరిశీలించి, అందులో అత్యుత్తమమని భావించినదానిని అంగీకరించవచ్చు. అలా అంగీకరించిన ప్రతిపాదనను మొదటి సంస్థ ఒప్పుకుంటే ఆ కాంట్రాక్టును దానికే అప్పగిస్తారు. ఆ మార్పులతో చేయడం తమకు సాధ్యపడదని ఆ సంస్థ చేతులెత్తేస్తే కొత్తగా రంగంలోకొచ్చినవారికి దాన్ని కట్టబెడతారు.
కొత్త కొత్త ప్రాజెక్టుల్ని ప్రతిపాదించడంలో ప్రైవేటు రంగం చొరవను ప్రోత్సహించడానికి ఈ విధానం తోడ్పడుతుందని దీని సమర్ధకులు చెబుతారు. పైకి చూడటానికి ఇదంతా బాగానే కనబడుతుంది. సంప్రదాయ విధానం కంటే ఇందులో సృజనాత్మకత ఉన్నదనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధానంలో చేపట్టిన ప్రాజెక్టు సక్రమమైనదేనని సుప్రీంకోర్టు 2009లో తీర్పునిచ్చాక చాలా రాష్ట్రాలు దీనిపై మొగ్గు చూపాయి. అయితే ఆ కేసులో సర్వోన్నత న్యాయస్థానం నిర్దిష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ముఖ్యంగా ఆ తరహా ప్రాజెక్టుల పర్యవేక్షణకు నియంత్రణ వ్యవస్థ ఉండాలని సూచించింది.
కానీ అధికారంలో ఉన్నవారు తమకు నచ్చినవారికి కాంట్రాక్టులు ఇచ్చుకునేందుకూ, ఆ క్రమంలో అక్రమార్జనకూ ఇదొక సులువైన మార్గంగా మారింది. పారదర్శకతే కరువైంది. కాంట్రాక్టు ఒప్పుకున్న సంస్థ సకాలంలో దాన్ని పూర్తి చేయలేకపోయినా, మొదట్లో అంగీకరించిన ధరకు పూర్తి చేయడం సాధ్యంకాదని మధ్యలో మొండికేసినా ప్రభుత్వాలు ఇరకాటంలోపడతాయి. అందుకే ‘స్విస్ చాలెంజ్’ విధానంపై 2011లో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శ కాలను ఏర్పర్చుకుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ తోవ ఎంచు కోవాలని నిర్ణయించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకూ, నిరుపేద వర్గాలవారి సముద్ధరణకు తోడ్పడే ప్రాజెక్టులకూ మాత్రమే ఈ ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని అనుసరించాలని భావించింది.
వాస్తవానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేసి ఉంటే ‘స్విస్ చాలెంజ్’ విధానంపై ఇన్ని విమర్శలూ, ఆరోపణలూ వచ్చి ఉండేవి కాదు. రాష్ట్ర స్థాయిలో గానీ, కేంద్ర స్థాయిలోగాని ఇప్పటికీ ఈ విధానం అమలుకు అవసరమైన నియంత్రణా వ్యవస్థలు అమల్లోకి రాలేదు. పర్యవసానంగా ఈ మాదిరి ప్రాజెక్టుల్లో లొసుగులు ఉన్నా, పారదర్శకత లోపించినా, దాపరికాన్ని ప్రదర్శిస్తున్నా సవాల్ చేయడానికి అనువైన వేదిక లేకుండా పోయింది. సాధార ణంగా పాలకుల అభీష్టం మేరకే ఇలాంటి ప్రాజెక్టులు అమలవుతున్నా ప్రభు త్వాల తరఫున సంతకాలు చేయాల్సివచ్చేది మాత్రం సీనియర్ అధికారులే. ఇన్ని లోపాలుండే ప్రాజెక్టులకు పూచీపడి ఆనక అవినీతి మరకలతో కేసులు ఎదుర్కొనడానికి అధికారులు సిద్ధపడటం లేదు.
ఈ విధానం ఎంత లోపభూయిష్టమైనదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం అనుసరిస్తున్న పద్ధతులే చెబుతాయి. రాజధాని కోసమని కేంద్రం నిధులిచ్చినా పైసా ఖర్చుచేయని ప్రభుత్వం...ఆ పనుల్ని సింగపూర్‌కు చెందిన కంపెనీలకు కట్టబెట్టాలని తహతహలాడుతుండటం అందరికీ ఎరుకే. తొలుత రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ ప్రభు త్వం సంతకం చేసింది. తీరా ఆ పనులు ఒక ప్రైవేటు సంస్థ చేతికి పోయాయి.
మాస్టర్ ప్లాన్ ఒప్పందంపై ఆ ప్రభుత్వం తరఫున సంతకం చేసిన వ్యక్తే తన పదవికి రాజీనామా చేసి ఆ ప్రైవేటు సంస్థకు అధిపతి కావడం...అది మరో సంస్థతో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఇప్పుడు మాస్టర్ డెవలపర్‌గా అవతారం ఎత్తడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. రేపో మాపో ‘స్విస్ చాలెంజ్’ విధానం కింద నిర్మాణ పనులు దానికే అప్పగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు కేల్కర్ కమిటీ సమర్పించిన తాజా నివేదిక ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని నిరుత్సాహపరచాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో దానిపై పునరాలోచించాలి. రాజధాని నిర్మాణంవంటి బృహత్తర పనులను పారదర్శకమైన పద్ధతుల్లో, ఆరోపణలకు తావులేని విధానంలో చేపట్టాలి.