
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా అంధకారంతో సావాసం చేయక తప్పని స్థితిలోనే ఉంటున్న నాలుగు కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘సౌభాగ్య’(ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) పథకాన్ని సోమవారం ప్రారంభించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి... అంటే మరో 15 నెలలకు ఈ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం అందించాలన్నది పథకం లక్ష్యం. దేశ ప్రగతి గురించి మనం ఎంతగా మాట్లాడుకుంటున్నా, కొన్ని రంగాలకు సంబం ధించి కళ్లు చెదిరే గణాంకాలు కనబడుతున్నా వెలుగుకు నోచని నిరుపేద కుటుం బాల స్థితిగతులు ప్రభుత్వాల పనితీరును వెక్కిరిస్తూనే ఉన్నాయి. విద్యుత్ స్థాపక సామర్ధ్యం, విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. థర్మల్ విద్యుత్, జల విద్యుత్‌లతోపాటు పవన, సౌర, బయోమాస్ విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు కూడా బాగా పెరిగాయి. వీటన్నిటి పర్యవసానంగా మిగులు విద్యుత్ ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కానీ చిత్రమేమంటే వేలాది గ్రామాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సౌకర్యం ఉన్న పట్టణాల్లో, గ్రామాల్లో సైతం కోట్లాదిమంది ప్రజలు కిరోసిన్ దీపాలతోనే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షలకు మించిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితి ఉంటే తెలంగాణలో వీటి సంఖ్య 11లక్షలు. ‘అందరికీ విద్యుత్’ కార్య క్రమంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలూ చేరాయి గనుక ఎక్కడినుంచి ఎక్క డికైనా విద్యుత్ సరఫరా చేయడానికి వీలుంది. కొరత ఉన్న రాష్ట్రాలు దాన్ని విని యోగించుకుంటున్నాయి కూడా. అయినా విద్యుత్ అందని గ్రామాలూ, ఇళ్లూ ఉండటం ఒక వైచిత్రి. ఈ పరిస్థితిని సరిచేయాలని ఇంతకుముందున్న యూపీఏ ప్రభుత్వం ప్రయ త్నించింది. రాజీవ్‌గాంధీ గ్రామీణ్ విద్యుదీకరణ్ యోజన(ఆర్‌జీజీబీవై) ప్రారం భించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డీడీయూజీజేవై) మొదలుపెట్టింది. తమ పథకానికే ఎన్‌డీఏ సర్కారు పేరు మార్చిందన్న కాంగ్రెస్ నేతలు అప్పట్లో విమర్శించారు. డీడీయూజీజేవైకి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘సౌభాగ్య’ను అమల్లోకి తెచ్చింది.
ఈ మూడు పథకాలకూ మధ్య పెద్ద తేడా ఏం లేదు. మూడింటి ఉద్దేశమూ నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించడమే. తేడా అల్లా వాటికి సంబంధించిన ప్రాతి పదికల్లోనే ఉంది.
ఆర్‌జీజీబీవై, డీడీయూజీజేవైలకు దారిద్య్రరేఖకు దిగువునున్న (బీపీఎల్) కుటుంబాల గణాంకాలు తీసుకుంటే... ‘సౌభాగ్య’కు సాంఘికార్ధిక, కుల సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకొచ్చిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానన్నప్పుడు దానికి వ్యతిరేకంగా సాగిన ప్రచారాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అలా ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పట్లో చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌ను ఆర్ధికవేత్త కూడా అయిన ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ గట్టిగా వ్యతిరేకించారు. కానీ దాన్ని జయప్రదంగా అమలు చేయడమే కాదు... తన పాలనాకాలంలో వైఎస్ ఇతరత్రా విద్యుత్ చార్జీలను సైతం పెంచలేదు.
ఇప్పుడు ప్రారంభించిన ‘సౌభాగ్య’ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. మధ్య ఆదాయం ఉన్న కుటుంబాలు కనెక్షన్‌కు రూ. 500 చెల్లించాలి. అయితే దాన్ని పది వాయిదాల్లో చెల్లించే సౌకర్యాన్ని కల్పించారు. అయితే ఇలాంటి పథకాలు జయప్రదం కావాలంటే కనెక్షన్ల వరకూ రాయితీలిచ్చి ఊరుకుంటే సరిపోదు. విద్యుత్ చార్జీల వసూలు విషయంలోనూ ఉదారంగా ఉండాలి. ఈ పథకం కింద విద్యుత్ సౌకర్యం పొందినవారి నుంచి నిర్దిష్ట మొత్తం వసూలు చేస్తామన్న హామీ ఉంటే అలాంటివారు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడానికి సిద్ధపడతారు. మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లు కట్టాలంటే ఆ నిరుపేద కుటుంబాలు సిద్ధపడవు. తమకొచ్చే అంతంతమాత్రం ఆదాయంతో ఏ నెల ఎంత బిల్లు వస్తుందో తెలియని విద్యుత్‌ను వినియోగించడం వారికి తలకుమించిన భారమవుతుంది.
పైగా మీటర్ల నాణ్యతపైన కూడా వారికి నమ్మకం లేదు. తాము వాడిన కరెంటుకు మించి బిల్లు వస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందన్న భయం వారిని పీడిస్తుంది. నిజానికి గతంలో ప్రవేశపెట్టిన రెండు పథకాలూ ఆశించినంతమేర విజయవంతం కాకపోవడానికి కారణమిదే. ఈ అంశాన్ని పరి గణనలోకి తీసుకోనట్టయితే ‘సౌభాగ్య’ కూడా అదే ఫలితాన్నిస్తుంది. అసలు విద్యుదీకరణ ప్రాతిపదికలే మన దేశంలో సక్రమంగా లేవు. ఒక గ్రామంలో పంచాయతీ కార్యాలయం, ఆరోగ్యకేంద్రం, సామాజిక కేంద్రం, పాఠశాల వగైరా ప్రజోపయోగ సంస్థలకు విద్యుత్ సౌకర్యం ఉండి, కనీసం 10 శాతం ఇళ్లకైనా విద్యుత్ అందుతుంటే ప్రభుత్వం దృష్టిలో ఆ గ్రామ విద్యుదీకరణ పూర్తయినట్టు లెక్క. గ్రామంలోని ఇళ్లన్నిటికీ విద్యుత్ సౌకర్యం లేనప్పుడు ఆ విద్యుదీకరణ వల్ల ప్రయోజనం ఏమిటి?
దేశంలో ఒకపక్క ఎంతో కొంత విద్యుత్ మిగులు ఉంటుంటే అసలు ఆ సౌకర్యమే లేని ఊళ్లూ, ఇళ్లూ ఇప్పటికీ ఉండటం నిరాశ కలిగిస్తుంది. పౌరుల వార్షిక సగటు విద్యుత్ వినియోగం (కిలోవాట్ అవర్) ఎంతన్న అంశంపై మూడేళ్లక్రితం ప్రపంచబ్యాంకు విడుదల చేసిన గణాంకాలు దిగ్భ్రమ కలిగిస్తాయి. మనకంటే ఎంతో చిన్నవనుకునే దేశాలూ, అభివృద్ధిలో అంతంతమాత్రంగా ఉన్న దేశాలూ సగటు వినియోగంలో మనకంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. మన దేశంలో వార్షిక తలసరి వినియోగం 806 ఉంటే అల్జీరియాలో అది 1,356, లిథువేనియాలో 3,821. గత పథకాల్లోని లోటుపాట్లను అధ్యయనంచేసి అవి పునరావృతం కాకుండా చూస్తేనే రూ. 16,320 కోట్లు వ్యయం కాగల ‘సౌభాగ్య’ విజయవంతమవుతుంది. సంకల్పం ఒక్కటే సరిపోదు... అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళిక కూడా ముఖ్యం.