సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేతల హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే కేసీఆర్‌ను విమర్శిస్తూ కాషాయ నేతలు, మోదీ బైబై అంటూ కారు పార్టీ నేతలు ఫ్లెక్సీలతో భాగ్యనగరంలో హోరెత్తిస్తున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో కమళం పార్టీ నేతలను మించినవారు లేరని ఎద్దేవా చేశారు.
‘2018, ఏప్రిల్‌లో ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు. మరోవైపు ఎన్‌పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి జూన్ 25న కరెంట్ వచ్చింది. ఇంకా ఎన్నిసార్లు దేశ ప్రజలను మోసం చేస్తారు మోదీ జీ!’ అని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి👉మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్‌నాథ్ షిండే ప్లాన్ ఇదే!
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ద్రౌపది ముర్ము సొంతూరు ఒడిశాలోని మయూర్‌బంజ్ జిల్లా, ఉపర్‌బెడా. అక్కడి ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక ఇప్పటికీ కిరోసిన్ దీపాలనే వినియోగిస్తున్నారని, ఎట్టకేలకు ఆ ఊరికి కరెంట్ వచ్చిందని జూన్ 25న పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. ఉపర్‌బెడాలో విద్యుదీకరణ పనులు మొదలు పెట్టామని ఒడిశా ప్రభుత్వం సైత ప్రకటించింది. అయితే, చాలా ఏళ్ల క్రితమే ఉపర్‌బెడా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌రంగపూర్‌కు ముర్ము కుటుంబం మకాం మార్చింది.
ఇదిలాఉండగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశాల్లో పాల్గొంటారు.
చదవండి👉2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment