ఎర్డోగాన్‌కే టర్కీ పట్టం
టర్కీకి సర్వంసహాధికారి కావాలనుకున్న ఆ దేశాధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ కోరిక ఈడేరింది. కేవలం ఆర్నెల్లక్రితం జరిగిన ఎన్నికల్లో భంగపడ్డ ఎర్డోగాన్ చాలా స్వల్పకాలంలోనే పుంజుకుని తాజా ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించారు. దేశ ప్రజల్ని సమ్మోహనపరచడంలో తనకెవరూ సాటిరారని నిరూపించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ(ఏకేపీ) 49.4 శాతం ఓట్లు తెచ్చుకుని 550 స్థానాలున్న పార్లమెంటులో 216 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఇదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 276 స్థానాలను సాధించలేక చతికిలబడింది. పైగా అప్పుడు దానికొచ్చిన ఓట్ల శాతం 40 మాత్రమే. విపక్షాలన్నీ కలిసి 60 శాతం ఓట్లు గెల్చుకున్నాయి. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి అవసరమైన మెజారిటీ ఏ పార్టీకి రాని పక్షంలో అధిక స్థానాలొచ్చిన పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పాలి. అయితే అది సాధ్యపడలేదు. పర్యవసానంగా ప్రస్తుత ఎన్నికలు అవసరమయ్యాయి.
గత కొన్నాళ్లుగా టర్కీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూ వచ్చిన రాజకీయ విశ్లేషకులు...ఈ ఎన్నికల్లో కూడా కొంచెం హెచ్చుతగ్గులతో గత ఫలితాలే పునరావృతమవుతాయని అంచనా వేశారు. టర్కీ స్వల్పకాలంలోనే మూడోసారి ఎన్నికలకు వెళ్లాల్సిరావచ్చునని భావించారు. కానీ ఎర్డోగాన్ అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. పాశ్చాత్య ధోరణులను గట్టిగా వ్యతిరేకించి, ఇస్లామిక్ సిద్ధాంతాలను అవలంబించకపోతే దేశం నాశనమవుతుందని సందర్భం వచ్చినప్పుడల్లా ఎర్డోగాన్ ఊదరగొట్టారు. కుర్దులతో ప్రమాదం పొంచి ఉన్నదని, దీన్నుంచి దేశాన్ని కాపాడటం ఏకేపీకి మాత్రమే సాధ్యమని చెబుతూ వచ్చారు. అయితే ఈ పనులన్నీ గత ఎన్నికల్లోనూ చేశారు. అప్పుడు ఇవేవీ ఆయనకు అక్కరకు రాలేదు. అప్పుడు పనికిరాని అస్త్రాలు ఇప్పుడు మాత్రం ఎలా విజయాన్ని సాధించిపెట్టాయో తెలియాలంటే ఈ ఆర్నెల్లూ టర్కీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
దేశానికి ఐఎస్ ఉగ్రవాదులనుంచి ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలను ఆయన పదే పదే హెచ్చరించారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పడి సమర్థవంతంగా వారి దాడులను తిప్పిగొట్టకపోతే దేశం చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. అంతేకాదు... కుర్దుల తరఫున పోరాడుతున్న కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)పై ఆయన విరుచుకుపడ్డారు. కుర్దిష్ స్థావరాలపై బాంబు దాడులు చేయించారు. మరోపక్క కుర్దుల హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్‌డీపీ)పై అనేక ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పైకి ప్రజాస్వామ్యం ముసుగు తగిలించుకున్నా అది రహస్యంగా పీకేకేతో చేతులు కలిపిందని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడంతోపాటు కుర్దుల భవిష్యత్తుకు కూడా అది ఎసరు తెస్తున్నదని ఎర్డోగాన్ ప్రచారం చేశారు.
ఈ ప్రచారం సృష్టించిన భావోద్వేగాలు తీవ్ర స్థాయికి చేరుకున్న తరుణంలోనే గత నెలలో రాజధాని అంకారాలో రెండు భారీ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హెచ్‌డీపీ పార్టీ ఇతర వామపక్ష పార్టీలతో కలిసి నిర్వహించిన శాంతి ర్యాలీలో జరిగిన ఈ పేలుళ్ల కారణంగా 130మంది పౌరులు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించకపోతే ఇలాంటివి పదే పదే జరుగుతాయని, దేశం అభివృద్ధిని సాధించడం అసాధ్యమవుతుందని ఎర్డోగాన్ హెచ్చరించారు. పౌరుల్లో రేపటి గురించిన భయాందోళనలు రేకెత్తించడంలో ఎర్డోగాన్ విజయం సాధించారని ఒక విశ్లేషకుడు చెప్పిన మాటల్లో నిజముంది.
అయితే ఎన్నికల్లో విజయం సాధించడానికి అక్కరకొచ్చిన అస్త్రాలు ప్రభు త్వాన్ని సాఫీగా నడపడంలో ఎర్డోగాన్‌కు తోడ్పడే అవకాశాలు లేవు. నిరుద్యోగం అక్కడి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దేశంలో సంపద పెరిగినా అది కొన్ని వర్గాలకే సొంతం కావడంవల్ల అసమానతలు తారస్థాయికి చేరుకున్నాయి. వృద్ధి రేటు క్రమేపీ క్షీణిస్తూ వస్తున్నది. వీటన్నిటినీ ప్రతిఫలిస్తున్న మీడియా అంటే ఎర్డోగాన్ ప్రభుత్వానికి మొదటినుంచీ కడుపుమంట. వాటిపై అనేక ఆంక్షలు విధించడం, పాత్రికేయులను ఖైదు చేయడం టర్కీలో పెరిగి పోయింది. అధ్యక్షుణ్ణి అవమానించే రాతలు రాస్తున్నారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కాసేపటిలోనే అక్కడి మీడియా సంస్థలపై పోలీసులు దాడిచేసిన తీరు చూస్తుంటే ఇది రాను రాను మరింతగా పెరుగుతుందని అర్ధమవుతుంది.
పాత్రికేయులపై సాగుతున్న దాడులపైనా...కుర్దుల విషయంలో వ్యవహ రిస్తున్న తీరుపైనా యూరప్ దేశాలకూ, అమెరికా, రష్యాలకూ అభ్యంతరా లున్నాయి. టర్కీ ఇప్పటికే నాటో సభ్య దేశం. ఈయూలో సభ్యత్వం కోసం కూడా అది ప్రయత్నిస్తున్నది. అయితే టర్కీ వ్యవహార శైలి ఈయూ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిగా ఉన్నదని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఐఎస్ ఉగ్రవాదులపై సిరియాలోనూ, ఇరాక్‌లోనూ పోరాడుతున్నది కుర్దులే. అలాంటివారిపై బాంబు దాడులకు పూనుకోవడం సరైంది కాదని యూరప్ దేశాలు విశ్వసిస్తున్నాయి.
అటు అమెరికా, రష్యాలకు కూడా ఈ విషయంలో కుర్దులపై సానుభూతి ఉంది. ఆ దేశాల మనోభీష్టానికి వ్యతిరేకంగా కుర్దులపై కఠిన చర్యలు తీసుకోవడం ఎర్డోగాన్‌కు అంత సులభం కాదు. ఈ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో రాజ్యాంగ సవరణలకు పూనుకుని అధ్యక్ష తరహా పాలనను ప్రవేశపెట్టాలని ఆయన ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న మెజారిటీతో అది సాధ్యమే. భావోద్వేగాలను రెచ్చగొట్టడంవల్ల తిరుగులేని మెజారిటీ లభించి ఉండొచ్చుగానీ పరిపాలన సక్రమంగా చేయాలన్నా...దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నా అన్ని వర్గాల సహకారం అవసరం. ఘర్షణాత్మక వైఖరివల్ల జరిగేది కీడే తప్ప మేలు కాదు. ఆ సంగతిని ఎర్డోగాన్ గ్రహించడానికి ఎంతో కాలం పట్టదు.