స్వేచ్ఛకు పరిమితి!
పరువు నష్టం కేసుల్లో క్రిమినల్ నేర చట్టంకింద చర్యలకు వీలు కల్పిస్తున్న భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 499, సెక్షన్ 500లు...నేర విచారణ ప్రక్రియా స్మృతి(సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 119 రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు భావ ప్రకటనా స్వేచ్ఛను కాంక్షించే వారందరికీ నిరాశ కలిగిస్తుంది. బ్రిటిష్ వలసవాదులు ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకు నేందుకూ...ఇక్కడ సాగుతున్న ప్రజా ఉద్యమాలనూ, తిరుగుబాట్లనూ అణిచేం దుకూ తీసుకొచ్చిన కఠిన నిబంధనల్లో ఈ సెక్షన్లు కూడా భాగం. విచారకరమైన విషయమేమంటే మన దేశం గణతంత్రంగా మారి 70 ఏళ్లు కావస్తున్నా 156 ఏళ్లనాటి ఈ అప్రజాస్వామిక చట్టాలూ, సెక్షన్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి.
పరువు నష్టాన్ని క్రిమినల్ చర్యగా పరిగణిస్తున్న ఈ సెక్షన్లు వాస్తవాలు వెల్లడించదల్చుకున్న మీడియాకు ఎంత ప్రతిబంధకంగా మారుతున్నాయో... సారాంశంలో పౌరులకు గల తెలుసుకునే హక్కును ఎలా దెబ్బతీస్తున్నాయో ఆ రంగంలో పనిచేస్తున్నవారికి నిత్యానుభవం. అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు కూడా వీటి బాధితులుగా మారుతున్నారు. దాని పర్యవసానంగానే ఈ కేసు సుప్రీంకోర్టు పరిశీలనకు వెళ్లింది. ఈ సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేసినవారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణస్వామి. అనంతరకాలంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కేసులో కక్షిదారులుగా చేరారు. అయితే ఈ ముగ్గురూ పరువునష్టం నిబంధనలు చెల్లబోవని ప్రకటించాలని కోరినా వారు ప్రాతినిధ్యంవహిస్తున్న పార్టీలూ, ప్రభుత్వాలూ మాత్రం అందుకు విరుద్ధమైన వైఖరిని తీసుకోవడం ఒక వైచిత్రి.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అవినీతి ఆరోపణలు చేసినందుకు సుబ్రహ్మణ్య స్వామిపై ఆరు పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. ఇవన్నీ జయలలిత వ్యక్తిగతంగా కాక తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన కేసులు. వీటిని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి తొలుత ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సెక్షన్లు ఉండితీరాలని ఆ ప్రభుత్వం వాదించింది(ప్రస్తుత ఎన్‌డీఏ సర్కారు వాదనా అదే!). కానీ అధికారం కోల్పోయాక ఇదే ‘పరువునష్టం’ రాహుల్ మెడకు కూడా చుట్టుకుంది. మహాత్ముడి హత్యలో తమ ప్రమేయం ఉన్నదని ఆయన చేసిన ఆరోపణపై ఆరెస్సెస్ పరువునష్టం కేసు దాఖలు చేసింది. పర్యవసానంగా రాహుల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఇక కేజ్రీవాల్‌ది విచిత్రమైన పరిస్థితి. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీలపై చేసిన అవినీతి ఆరోపణలు ఆయనను బాధితుడిగా మార్చాయి. అందువల్లే ఆయన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోపక్క తమ ప్రభుత్వానికి లేదా సీఎం కేజ్రీవాల్‌కూ పరువునష్టం కలిగించేవిధంగా మీడియాలో వార్తలు, కథనాలు వస్తే వాటిపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. నిరసనలు వెల్లువెత్తాక దాన్ని ఉపసంహ రించుకున్నారు. వీటన్నిటినీ చూస్తే అప్రజాస్వామిక చట్టాల విషయంలో ఈ నేతలకు చిత్తశుద్ధిగానీ, సూత్రబద్ధమైన వైఖరిగానీ లేవని అర్ధమవుతుంది.
పరువు నష్టాన్ని క్రిమినల్ చర్యగా పరిగణిస్తున్న సెక్షన్లు నియంతృత్వమైనవి. ‘నేరం’ రుజువైన పక్షంలో రెండేళ్ల జైలు, జరిమానా విధించడానికి ఇవి వీలు కల్పిస్తున్నాయి. అంతకన్నా దారుణమేమంటే ఆ సెక్షన్లకింద ఏళ్ల తరబడి సాగే విచారణ ప్రక్రియ దానికదే ఓ పెద్ద శిక్ష. నిందితుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ఫిర్యాదీ నిరూపించడం కాక...తాను చేసిన ఆరోపణ సరైందని నిరూపించుకునే బాధ్యత నిందితుడిదేనని సెక్షన్ 499 చెబుతోంది. అంటే నిజమేమిటో తెలిసినా దాన్ని నిరూపించే సత్తా ఉంటే తప్ప అధికారులపైనో, పాలకులపైనో సామాన్య పౌరులు ఆరోపణలు చేయకూడదన్న మాట. అంతేకాదు...అసలు ఒక వ్యక్తి ఎలాంటి ఆరోపణా చేయకపోయినా, అలా చేసినవారితో చేతులు కలిపాడని ఫిర్యాదు అందినా అలాంటి వ్యక్తిపై క్రిమినల్ చర్య ప్రారంభించవచ్చు. అది నిజంకాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అలా ఇరుక్కున్న వ్యక్తిపైనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో చేసే విమర్శలు నేరపూరితమని చెబుతున్న ఐటీ చట్టం సెక్షన్ 66ఏ చెల్లదని నిరుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు ప్రజాస్వామికవాదులంతా హర్షం వ్యక్తంచేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు బాసటగా నిలుస్తున్నదని ప్రశంసించారు. ప్రస్తుత తీర్పు దాని స్ఫూర్తిని దెబ్బతీసిందనే చెప్పాలి.
రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు హామీనిస్తోంది. అయితే 19(2) అధికరణ ప్రజా ప్రయోజనాలరీత్యా ఈ స్వేచ్ఛకు ‘సహేతుకమైన’ పరిమితులు విధించే చట్టాలకు అవకాశమిస్తోంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణ, దేశ భద్రత, మిత్ర దేశాలతో సంబంధాలు, ప్రజాభద్రత, నైతికత, పరువునష్టం వంటి అంశాలు ఈ పరిమితుల్లో ఉన్నాయి. ఇందులో ‘పరువు నష్టం’ తప్ప మిగిలినవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి. అదొక్కటీ వ్యక్తుల ప్రయోజనాలకు సంబంధించింది. కనుక దీన్ని ‘సహేతుకమైన పరిమితుల’ జాబితాలో ఉంచరాదని చాలామంది వాదిస్తున్నారు. అయితే భావప్రకటనా స్వేచ్ఛ కోసం ‘పరువు ప్రతిష్టలను కలిగి ఉండే హక్కును సిలువేయలేమని సుప్రీంకోర్టు అంటున్నది. ఆ హక్కు ‘జీవించే హక్కు’లో అంతర్లీనంగా ఉంటుందని చెబుతోంది. అయితే ‘పరువు నష్టం’ పాలకుల చేతుల్లో ఆయుధమై భావప్రకటనాస్వేచ్ఛను హరిస్తుండటాన్ని విస్మరించకూడదు. ఈ విషయంలో మరిన్ని విస్తృతమైన అంశాలు చర్చలోకొచ్చి ఇలాంటి అప్రజాస్వామిక చట్టాలు, నిబంధనలు విరగడ కావాలని ఆశిద్దాం.