రాజధాని ప్రాంతంలో తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తోన్న బాధిత రైతులు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం మాయమైపోయింది అన్నది ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్న కఠోర వాస్తవం. అంతర్జాతీయమూ లేదు, మహా నగరాలు లేవు... అమరావతి అంటే.. కొందరు మాత్రమే లాభపడుతున్న ఉద్దేశపూర్వకమైన ఓ కుట్ర. ఎందరో సామాన్యులు మోసపోయిన ఓ చట్రం. ఒకవేళ నిర్మించినా ప్రజా సంక్షేమాన్ని కాలరాసిన ప్రభుత్వం ప్రజారహిత అమరావతి నిర్మించాలనుకుంటుందా? సమాధానం చెప్పాలి.
అమరావతి. ప్రపంచస్థాయి రాజధాని... ఆధునిక నగరాలను తలదన్నే రాజధాని.. ప్రపంచ పారిశ్రామికవేత్తలదరూ దృష్టి సారి స్తున్న అద్భుత రాజధాని. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాడిందే పాటలాగా పాడుతున్న ఒకేపాట.. రూపురేఖలు లేని బీడు భూముల్లో రాజధాని స్వర్గం గురించి డిజిటల్ రూపంలో సాగిస్తున్న వంచనాత్మక ప్రచారగీతం. పాలకుడి విజన్.. ఇంకా కట్టని 45 అంతస్తుల పాలనా సౌథం గురించి కలలు కంటూండగా.. రైతుల చెమట చుక్కల ఫలితమైన అమరావతి వాస్తవరూపం ఏమిటంటే చిన్నాభిన్నమైన జీవితాలు. భూములివ్వమన్న రైతులపై అక్రమ కేసులు, వేధింపులు.
లక్షలు మాత్రమే ఇచ్చి కోట్లు కొల్లగొడుతున్న భారీ భూ దందా చేదు గుర్తులు, వ్యవసాయానికి ద్రోహం బడా కంపెనీలకు మోదం.. తమ భూమిని తీసుకుని బీడుగా ఉంచిన భూముల్లో ఎవరిని ఉద్ధరిస్తున్నారో అంతు చిక్కని రైతుల నిర్వేదం. వ్రయ్యలైన హామీలు, చెల్లని హెల్త్ కార్డులు, పడిపోయిన జీవన ప్రమాణాలు, వ్యవసాయానికి దూరమైన పదివేల మంది కౌలురైతుల కుటుంబాల తీరని వ్యథ. ఇదీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత ప్రజలకు ఇన్నేళ్లుగా చూపిన మహామాయ. శంకుస్థాపనలు, బాహుబలి లాంటి ఫాంటసీ బొమ్మలు తప్ప తెలుగువారి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో నరమానవులకు అర్థం కాని స్థితి.
ఇది భూ సేకరణా.. లేక అపహరణా అంటూ ఉద్యమకారులు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఆంద్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి, నాలుగేళ్లు గడిచిపోయాయి. అమరావతి పేరిట అప్పుడప్పుడూ జరుగుతున్న ఆర్భాటానికి గడుస్తున్న కాలం మౌన సాక్షిగా నిలిచింది. కానీ.. అమరావతిలో ఇప్పుడు అడుగుపెడితే.. కంటిచూపు పరిధిలో ఉండే భూమి బీడువారిపోయి, దుమ్ముపట్టిన శిలాఫలకాలు కలుపుమొక్కల చాటునుండి తొంగిచూస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా దిక్కుతోచని ముఖాలు, కూలిపోయిన ఆశలు, అక్కడక్కడా గొంతు చించుకుంటున్న ఉద్యమ నినాదాలు, చితికిపోతున్న బతుకులు దర్శనమిస్తాయన్నది అక్షర సత్యం.
అందరికన్నా ఎక్కువగా చిన్నాభిన్నమైంది రైతు జీవితం. అగాధంలో కూరుకుపోయిన భవిష్యత్తుతో సతమతమై, స్థిరత్వం కోల్పోయిన వర్తమానంతో, సంధి కుదుర్చుకోలేక తల్లడిల్లిపోతున్నాడు రైతన్న. అన్నింటికీ మించిన దుర్భరమైన అంశం ఏమిటంటే.. ఇష్టపడో, కష్టపడో భూములను ధారాదత్తం చేసిన అన్నదాత నమ్మకాన్ని టీడీపీ ప్రభుత్వం వమ్ము చేసిన విధానం. రైతన్న ఊహకందని చందంగా వంచించి గాలికొదిలేసింది ఏపీ ప్రభుత్వం. అసలు ఆది నుండే ఈ భూసేకరణ, సమీకరణ ఒక ప్రహసనంగా స్వలాభాల కోసం కొందరు అస్మదీయులు సొమ్ము చేసుకోవడం కోసం సామాన్యులపై ప్రయోగించిన ఒక పిడుగులా పరిణమిస్తూ వచ్చింది. సీఆర్‌డీఏ నిబంధనలను కాలరాస్తూ, బాధ్యతా రాహిత్యం, స్వార్థం తాండవిస్తూ కొనసాగిన ఈ తంతు సామాన్యుడిపై కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఇంతకీ ఎవరిపై ఈ దెబ్బ.. ?
భూములిచ్చిన రైతుకి ఇచ్చిన హామీలు, కేజీ–పీజీ ఉచిత విద్య, హెల్త్ కార్డులు, అభివృద్ధి చేసిన ప్రత్యేక ఫ్లాట్లూ.. ఇంకా ఏవేవో. కానీ.. భూములిచ్చాక చేతికి చిక్కినవి పనిచేయని ఆరోగ్య కార్డులు, శ్మశానాల్లో సెల్ టవర్ల కింద బోరు బావుల్లో ఫ్లాట్లూ. జరీబ్ భూములకు బదులుగా వారికిచ్చినవి విలువ తక్కువుండే మెట్ట భూములు. జరిగింది అన్యా యం, మోసం అంటూ రైతు బోరుమంటున్నాడు. పైపెచ్చు లక్షలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం కాజేసిన ఈ భూముల విలువ చూస్తూండగానే కోట్లకు చేరింది.
ఎవరైనా హెల్ట్ కార్డులు ఎందుకు కోరుకుం టారు..? అనుకోని ఆర్థిక సమస్య వస్తే భరించలేరు కనుక అవసరానికి ఆదుకోవాలని ఆశిస్తారు. కానీ అలా జరగటం లేదు. ‘మా నాన్నకి గుండె ఆపరేషన్ చేయించుకోడానికి ఈ కార్డు చెల్లదని చెప్పారు. నాలుగు లక్షలు నేను ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు ఓ రైతు. మరొక రైతుది ఇంకో దీనగాథ. కాన్వెంట్ స్కూల్స్‌కు వెళుతున్న పిల్లల్ని అరకొర వసతుల ప్రభుత్వ పాఠశాలలకి మార్చాల్సి వచ్చింది. అందుకు కారణం దిగజారిన అతని ఆర్థిక పరిస్థితి. ఇదీ భూములిచ్చిన రైతుల దుస్థితి.
ఇక పెనుమాకలో రైతులు నిత్య పోరాటంతో సావాసం చేస్తున్నారు. పచ్చగా సస్యశ్యామలంగా నాలుగైదు పంటలు పండించే జరీబు భూములు ఇవ్వనందుకు వారిపై అక్రమ కేసులు, వేధింపులు ప్రయోగిస్తూ.. మెడలు వంచే ప్రయత్నం చేసింది టీడీపీ సర్కార్. రాత్రికి రాత్రి చెయ్యని నేరానికి తప్పుడు కేసులు పెట్టి, మానవ హక్కులను బేఖాతరు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆదుకునేవారే కరువయ్యారు. పైగా ‘చక్కగా పండించే భూములన్నీ బడా కంపెనీలకు అమ్మేసి వ్యవసాయానికి ద్రోహం చేసే ఈ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అంతుచిక్కడం లేదు’ అంటాడు ఓ రైతు. ఆలోచిస్తే అన్నీ అంతుచిక్కుతాయి. జరిగిన కుట్ర తేటతెల్లమవుతుంది. ఇక అధికారుల పెడసరి సమాధానాలు, కంప్యూటర్ రికార్డుల్లో అకస్మాత్తుగా జరుగుతున్న మార్పులు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది.
అసైన్డ్ లంక భూముల రైతులది మరో తరహా పోరాటం. బలహీన వర్గాలుగా భావించి వ్యవస్థ నుంచి వారికి సంక్రమించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హక్కు చాటుకుంటోంది. స్థానికంగా లేనిపోని భయాలతో రైతుల్ని బెదిరించి, కారుచౌకగా భూముల్ని స్వాహా చేసి మంత్రిగారి బినామీల పేరిట రిజిష్టర్ చేయించారు. ఇప్పుడు అవే భూముల విలువ కోట్లలో ఉంది. అంతర్గత వ్యాపార దురాశతో దళిత భూములతో దందా చేసి సొమ్ము చేసుకున్న ప్రభుత్వ కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీఓ 41 రద్దు చెయ్యాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పి సంవత్సరం గడిచిపోయింది కానీ, ఉద్దండరాయపాలెం చుట్టు పక్క గ్రామాల దళిత రైతులకు ఇంకా న్యాయం జరగలేదు.
ఉన్న ఏకైక ఆసరా కోల్పోయిన రైతులు కుటుంబాన్నే సాకుతారా? బెదిరిస్తున్న ప్రభుత్వంతో దైనందిన పోరాటమే చేస్తారా? ఇదేనా ముఖ్యమంత్రి చేసే న్యాయం.. ?
ఇవన్నీ ఒక ఎత్తయితే.. కౌలు రైతుల గురించి అసలు ప్రభుత్వం ఆలోచించలేదా.. అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పదివేల దిక్కుతోచని కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. పండించడానికి పొలాలు లేక, సంపాదన కరువై పూట గడవక అల్లాడిపోతున్న ఈ జీవితాలు సీఎంకి కనపడవా? తరతరాల వృత్తి ఇప్పుడు సాయం రాక, ఇతర పనులు చేతకాక పస్తులుంటున్న అన్నదాతలకి ఏమిటి దిక్కు? అటు రైతుకూలీలదీ ఇదే పరిస్థితి. ఒక్కో కుటుంబానికీ ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల ఐదు వందలు మాత్రమే.
పనికి వెళదామంటే పొలాలు లేక పనులు లేవు. అంతకు ముందు పనులు దొరికినప్పుడు కుటుంబ ఆదాయం 15 నుంచి 20 వేలదాకా ఉండేది. ఇప్పుడు పని దొరికినా కానీ పాతిక మందితో కలసి కుక్కిన ఆటోలో 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే.. చేతికొచ్చేది వంద రూపాయలు కూడా ఉండదు. ప్రభుత్వం ఇచ్చే కోటా బియ్యం మరీ నాసిరకంగా ఉండి, ఆరోగ్యాలు పాడవుతూ ఉంటే అక్కరకు జేబులో డబ్బులు లేక విలపిస్తున్నారు పిల్లల తల్లులు. పోనీ.. అయ్యవారు చెప్పినట్లు స్థానిక సచివాలయంలో పని కల్పిస్తారా అంటే, మధ్య దళారుల వేధింపులు మరో కోణం. ఎర్రగా, పొడుగ్గా వయసు మీరకుండా ఉంటేనే పనుల్లో పెట్టుకుంటారు. ఇక మా పరిస్థితి ఏమిటంటూ కంటతడి పెడుతున్నారు ఆడపడుచులు.
వాస్తవంగా ప్రభుత్వం 35 వేల ఎకరాలు సేకరించింది. ఇవి అధికారిక లెక్కలు. ప్రభుత్వం చేతిలో సుమారు 80 వేల ఎకరాల భూమి ఉంది అన్నది నమ్మలేని నిజం. కానీ.. ఇంకా శంకుస్థాపనలు, బాహుబలి లాంటి బొమ్మలు మినహా తెలుగువారి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలి. బిల్డింగ్‌లు, ఒకవేళ అవి కట్టినా ప్రజా సంక్షేమాన్ని కాలరాసిన ప్రభుత్వం ప్రజా రహిత అమరావతి నిర్మించాలనుకుంటుందా.. సమాధానం చెప్పాలి. ఇక బట్టతలకి మల్లెపూలు అన్నట్లు చుట్టూ బార్లూ, రెస్టారెంట్లూ వెలసి ఇంతో అంతో డబ్బులు చేసుకున్న రైతన్నల జీవితాలపై నీలినీడలు కమ్ముతున్న విషయం ఎవరూ ఊహించని విపరిణామం.
పాలకులకు మొదట ఉండవలసింది ప్రజల పట్ల బాధ్యత. రెండవది జవాబుదారీతనం. ఇవేవీ లేకపోగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పుష్కలంగా ఉన్నవి నియంతృత్వ ధోరణి, పూర్తి దాటవేత వైఖరి. నాలుగేళ్లలో ప్రజల్ని ఎన్నిసార్లు కలిశారు. ఎన్నిమార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం మాయమైపోయింది అన్నది ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్న కఠోర వాస్తవం. అంతర్జాతీయమూ లేదు, మహా నగరాలు లేవు... అమరావతి అంటే.. కొందరు మాత్రమే లాభపడుతున్న ఉద్దేశపూర్వకమైన ఓ కుట్ర. ఎందరో సామాన్యులు మోసపోయిన ఓ చట్రం.
స్వప్న అశోక్
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాక్షి టీవీ
ఈ–మెయిల్: swapnatvhost@gmail.com
Comments
Please login to add a commentAdd a comment