మన దేశంలో చడీచప్పుడూ లేకుండా నిత్యమూ సాగే నరమేథం ఒకటుంది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాక్షిగా... కాసుల కక్కుర్తి రోగంతో చెలరేగే వైద్యుల సాక్షిగా... చేతగానట్టు మిగిలిపోయే చట్టాల సాక్షిగా ‘గర్భ’గుడిలో ఆడ శిశువుల్ని చిదిమేసే భయంకర నరమేథమది. బాలిక పుడితే కుటుంబానికి భారమవుతుంద నుకునే పాపిష్టి ఆలోచన దేశంలో రోజుకు 1,370మంది ఆడ శిశువుల్ని కడతేరుస్తున్నదని ఆమధ్య కొన్ని గణాంకాలు వెల్లడించాయి.
ఇంతటి దారుణాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలపై పౌర సమాజ కార్యకర్తలనుంచి, ఇతరుల నుంచి ఎన్నో సలహాలు, సూచనలు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటి మాటెలా ఉన్నా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ ఇటీవల చేసిన ప్రతిపాదన అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు నిషేధం అమలవుతున్న లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేయాలన్నదే ఆ ప్రతిపాదన సారాంశం.
ఆ పరీక్షల అనంతరం గర్భంలో ఉన్నది ఆడ శిశువో, మగ శిశువో తేలాక ఆ వివరాలను ఒక రిజిస్టర్‌లో నమోదు చేయాలని, పుట్టేది ఎవరైనా కనాల్సిందేనని వారికి నచ్చ జెప్పాలని ఆమె అభిప్రాయం. ఆ రిజిస్టర్‌లోని వివరాలకు అనుగుణంగా శిశు జననాలున్నాయో లేదో తనిఖీ చేయాలని కూడా ఆమె చెప్పారు. అలా చేస్తే అమ్మ కడుపులో ఉన్న ఆడ శిశువులకు రక్షణ ఉంటుందని ఆమె అంటున్నారు. ఈ మాట చెబుతూ ఇది కేవలం తన ఆలోచన మాత్రమేనని కూడా మేనక వివరించారు. ఈ ఆలోచన వెనకున్న కారణాన్ని కూడా ఆమె చెప్పారు.
చట్టవిరుద్ధంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లు చేస్తున్న వారిని ఎంతకాలం అరెస్టు చేస్తూ పోతాం...అది శాశ్వత పరిష్కారం ఎలా అవుతుంది అన్నదే ఆమె ప్రశ్న. కానీ ఈ క్రమంలో గర్భిణులను నేరస్తులుగా పరిగణిస్తున్నామన్న సందేహం ఆమెకు కలగలేదు. బిడ్డను కనాలో లేదో నిర్ణయించుకునే హక్కును మహిళలకు లేకుండా చేసినట్టవుతుందన్న ఆలోచన కూడా రాలేదు. అందువల్లే మేనకాగాంధీ ప్రతిపాదనపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి.
బాలలు, బాలికల నిష్పత్తి విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా యన్నది వాస్తవం. 1991నాటికి ప్రతి వెయ్యిమంది బాలలకూ 945 బాలిక లుండగా...2011 జనాభా లెక్కల్లో అది 919కి పడిపోయింది. హైదరాబాద్ నగరంలో అది 914 మాత్రమే. వాస్తవానికి వెయ్యిమంది బాలురకూ 950 మంది ఆడపిల్లలు ఉండటం ఆరోగ్యకరమైన నిష్పత్తి అంటారు. కానీ మహిళలను గౌరవిస్తున్నామని, పూజిస్తున్నామని చెప్పే దేశంలోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీన్ని ఎంతో కొంత మార్చాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జనవరిలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేసే ధోరణి అత్యంత హీనమని ఆ సందర్భంగా మోదీ చెప్పారు. ఆడపిల్లల విషయంలో వివక్ష ప్రదర్శించడం అలవాటైన సమా జానికి ఆధునిక టెక్నాలజీ కూడా తోడ్పడుతున్నది. కనీస వైద్య సదుపాయాలు కరువైన మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పోర్టబుల్ స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉంటున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన ఒక ప్రొఫెసర్ జరిపిన అధ్యయనంలో తేలింది.
చట్టాలున్నా వాటిని సమర్థవంతంగా అమలు పరిచే వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఈ జాడ్యం నానాటికీ ముదురుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల్ని నిషేధించే చట్టం వచ్చి రెండు దశాబ్దాలవుతున్నది. అయినా మెరుగైన ఫలితాలు రావడంలేదని జనాభా లెక్కలు చెబుతున్నాయి.
మెరుగైన జీవనం, చదువు వంటివి భ్రూణ హత్యల్ని నివారిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఆర్ధిక సంస్కరణలు అమలై అవకాశాలు పెరిగాక కుటుంబాలు కుంచించుకుపోవడం, ఒక్కరితో సరిపెట్టుకోవాలను కోవడం, ఆ ఒక్కరూ మగపిల్లాడైతే బాగుంటుందని భావించడం పెరిగిందని సామాజిక అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలు మధ్య తరగతిలో ప్రబలంగా ఉన్నాయంటున్నారు.
ఈ విషయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగు. సమాజంలో మహిళల స్థితిగతులకూ, వారిపట్ల చూపుతున్న వివక్షకూ...గర్భస్త శిశు పిండాలను చిదిమేయడానికీ ఉన్న సంబంధాన్ని గుర్తించనంతకాలమూ ఈ స్థితి మారదు. సామాన్య పౌరుల సంగతలా ఉంచి నాయకులుగా చలామణి అవుతున్నవారు సైతం మహిళల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, వారి సమస్యల విషయంలో ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే కుటుంబాల్లోనూ కొనసాగుతోంది.
లింగ నిర్ధారణ పరీక్ష మొదలుకొని భ్రూణ హత్యల వరకూ అన్నిటినీ నిర్దేశిస్తున్నది కుటుంబాల్లోని పురుషాధిక్యతే. ఇప్పుడు సాగుతున్న భ్రూణహత్యల్లో మహిళలు నేరస్తులు కాదు...బాధితులు. అయితే మేనకాగాంధీ తాజా ప్రతిపాదన బాధితుల్నే నేరస్తులుగా మార్చేట్టు కనబడుతోంది. పైగా ఇది ఆచరణసాధ్యం కూడా కాదు. కొన్ని లక్షల సంఖ్యలో ఉండే వైద్యులనూ, వారి కార్యకలాపాలనూ పసిగట్టలేని వ్యవస్థ కోట్లాదిమంది తల్లులపై నిఘా పెట్టి ఉంచడం కుదిరేపనేనా? రోజుకు 50,000 శిశు జననాలుండే మన దేశంలో గర్భిణుల డేటా సేకరణ, దానికనుగుణంగా ఆడ శిశువులు జన్మిస్తున్నారో లేదో చూడటమన్నది సాధ్యమేనా? మారుమూల పల్లెల్లో ఇప్పటికీ చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు.
ఉన్నా వాటిల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. మాతాశిశు సంర క్షణకంటూ ఎన్నో పథకాలున్నా అవి సక్రమంగా అమలు కావడంలేదు. పౌష్టికాహార లేమితో, ప్రాణాంతక వ్యాధులతో శిశువులు కన్నుమూసే సిగ్గుమాలిన పరిస్థితులున్నాయి. వీటన్నిటినీ సరిచేయడమెలాగో ఆలోచించి చర్యలు తీసుకోవడం తక్షణావసరం. మేనకాగాంధీ అలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
ఆడ శిశువు రక్షణ ఇలాగా?!
Published Wed, Feb 3 2016 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement