దేశంలో అవినీతిని అంతమొందించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించి వారంరోజులు కూడా కాలేదు. మహారాష్ట్రలో వెల్లడై అందరినీ దిగ్భ్రాంతిపరిచిన ఆదర్శ్ హౌసింగ్ స్కాంను అక్కడి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం కప్పెట్టడానికి ప్రయత్నిస్తోంది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన రోజు కాంగ్రెస్ పెద్దలు ఆ ఘనత తమదేనని చెప్పుకున్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ బిల్లు సాకారం కావడానికి పట్టుదలగా పనిచేశారని, ఆయన అభీష్టం మేరకు ఈ వరసలో మరిన్ని బిల్లులు తీసుకురావడం కోసం త్వరలోనే మళ్లీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్నామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని మాటలు చెప్పిన పెద్దలు... మహారాష్ట్రలో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆదర్శ్ కుంభకోణంపై వ్యవహరిస్తున్న తీరును మౌనంగా వీక్షిస్తున్నారు. ఆదర్శాలు చెప్పడానికి, ఆచరించడానికి ఎంత తేడా! ఈ స్కాంలో ఉన్న డజనుమంది నిందితుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి సీబీఐ అనుమతి కోరితే మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్ తిరస్కరించారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ సైతం చవాన్‌ను దోషిగా చూపింది. క్విడ్ ప్రో కో జరిగిందని నిర్ధారించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)-2 నిబంధనలకు విరుద్ధంగా భవనం ఎత్తును పెంచడానికి ఆయన అనుమతించారని, అందుకు ప్రతిగా ఆయన బంధువులకు ఇందులో ఫ్లాట్లు దక్కాయని కమిషన్ తెలిపింది. అయినాసరే, ఆయనను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అసలు విచారణ కమిషన్ నివేదికను సభ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకుని దీనిపై ప్రశ్నించేసరికి తప్పనిసరై నివేదికను సభకు సమర్పించారు. అదికూడా సమావేశాల ముగింపురోజున! ఈ స్కాంపై సభలో చర్చిస్తే రచ్చవుతుందని, తమ పరువుప్రతిష్టలు పాతాళానికి పోతాయని కాంగ్రెస్ పెద్దలు భయపడ్డారు.
పరిమాణంలో చూస్తే ఆదర్శ్ హౌసింగ్ స్కాం యూపీఏ పాలనలో బయట పడిన ఇతర కుంభకోణాలకన్నా పెద్దదేమీ కాదు. ముంబై మహానగరంలో ప్రఖ్యాత తాజ్ హోటల్‌కు సమీపంలోని అత్యంత విలువైన భూమిలో వెలిసిన 31 అంతస్తుల భవన సముదాయమది. సైన్యానికి చెందిన జాగాలో 2002లో ఈ భవన నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడు చెప్పింది వేరు. అటు తర్వాత జరిగింది వేరు. సైన్యంలో పనిచేస్తున్న, రిటైరైన సిబ్బంది సంక్షేమం కోసం ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు ఫ్లాట్లు అందజేయడమే దీని వెనకున్న లక్ష్యమని చెప్పారు. కాలక్రమంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సైనిక ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి తమకోసం, అయినవాళ్ల కోసం ఫ్లాట్లను కైంకర్యం చేయడం ప్రారంభించారు. రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్‌ను రూ.60 లక్షలకు సొంతం చేసుకున్నారు. అయినవాళ్లకు పంచిపెట్టారు. కొందరైతే బినామీ పేర్లతో రెండు, మూడు ఫ్లాట్లు కూడా కాజేశారు. అన్ని కుంభకోణాల్లాగే ఇందులో కూడా కాంగ్రెస్ నేతలదే ప్రధాన పాత్ర. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండేతోసహా నలుగురు ముఖ్యమంత్రులు ఆ పార్టీకి చెందినవారే. మరో ఇద్దరు మంత్రులు మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందినవారు. ఇందులో డజను మంది ఉన్నతాధికారులు భాగస్వాములని దర్యాప్తు మొదలెట్టినప్పుడు సీబీఐ తెలిపింది. తమ పదవులను అడ్డుపెట్టుకుని నిబంధనలను ఉల్లంఘించి వీరంతా దీన్ని కాజేయడానికి చూశారని ఆరోపించింది.
నగర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేయడానికి అధికారంలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో తెలియడానికి ఆదర్శ్ స్కాం ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నిస్తున్న అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగానే కాదు... రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. రక్షణ సిబ్బందికి చెందిన ఈ సొసైటీలో రక్షణేతర వ్యక్తులకు సభ్యత్వం కల్పించాలని షరతు విధించింది ఆయనే. అక్కడ నుంచి మొదలుకొని భవంతి ఎత్తు పెంచడానికి అనుమతించడం వరకూ ఆయన ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఆదర్శ్ పేరు పెట్టుకున్నందుకైనా కాస్తయినా నిజాయితీగా వ్యవహరిద్దామని ఎవరూ అనుకోలేదు. అందరూ కలిసి నిస్సిగ్గుగా వ్యవహరించారు. కోట్లాది రూపాయల ఆస్తులున్నవారు, ప్రభుత్వంలో కీలక పదవులు వెలగబెడుతున్నవారు తమ నెలసరి ఆదాయం రూ.13,000గా అఫిడవిట్లు దాఖలుచేసి ఈ సొసైటీలో సభ్యత్వం సంపాదించారు. ఒకరిని చూసి ఒకరు అత్యాశకు పోయి ఒకటికి మించి ఫ్లాట్లు సొంతంచేసుకుందామని ప్రయత్నించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారి కుటుంబాల పేరు చెప్పి మొదలెట్టిన ందుకైనా అలాంటివారిలో కొందరికైనా లబ్ధి చేకూరుద్దామని వీరెవరూ అనుకోలేదు. దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ ఎంపీ పదవిని రక్షించడానికి యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోయినప్పుడు, లోక్‌పాల్ బిల్లు విషయంలోనూ అవినీతి వ్యతిరేక ఛాంపియన్‌గా కనబడేందుకు తాపత్రయపడిన రాహుల్‌గాంధీకి మహారాష్ట్ర పరిణామాలు తెలియవని అనుకో లేం. అయినా ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు! పారదర్శకత లేనిచోట, జవాబుదారీతనం కరువైనచోట ఎలాంటి కుంభకోణాలు చోటుచేసుకుంటాయో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ అన్నీ నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా స్వీయ రక్షణ ప్రయత్నాలకు స్వస్తిచెప్పి ఆదర్శ్ స్కాంలో దోషుల దండనకు మహారాష్ట్ర సర్కారు ముందుకు రావాలి. కాంగ్రెస్ పెద్దలు ఆ దిశగా వారిని కదిలించాలి.
ఆదర్శం... వాస్తవం!
Published Sat, Dec 21 2013 11:46 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement