ముత్యాల పేరుతో మనకు మార్కెట్‌లో దొరికేవి మూడు రకాలు. నాచురల్ ఫార్మ్‌డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్, ఇమిటేషన్ పెరల్స్. నాచురల్ ఫార్మ్‌డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్ రెండూ ఆయెస్టర్‌లోనే తయారవుతాయి. ఇమిటేషన్ పెర్ల్ అంటే గాజు పూస లేదా ప్లాస్టిక్ పూస మీద ముత్యంలా కనిపించడానికి కోటింగ్ వేసినవి. ఇవి మన్నిక ఉండవు. ఫ్యాన్సీగా ధరించాలనే సరదాతో వాటిని కొనుక్కోవచ్చు. కానీ ముత్యాలని భ్రమ పడవద్దు.
ప్రాచీన కాలంలో నాచురల్‌గా వాటంతట అవి ఉత్పత్తి అయ్యే ముత్యాలే మనకు తెలుసు. సముద్రంలో ఉండే ఆయెస్టర్ (ముత్యపు చిప్ప) లోపల ఇసుక రేణువు కానీ మరేదైనా ఫారిన్‌బాడీ చేరినప్పుడు, దాని చుట్టూ క్యాల్షియం పొరలను కోటింగ్‌గా ఏర్పరుచుకుంటుంది ముత్యపుచిప్ప. అలాంటి ముత్యాల లభ్యత చాలా తక్కువ. ఒక నెక్లెస్‌కు అవసరమైన ముత్యాలను సేకరించడం కూడా ప్రాచీన కాలంలో చాలా పెద్ద పని అయ్యేది. గడచిన కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ముత్యపు చిప్పలను సేకరించి నీటి కొలనుల్లో పెంచుతున్నారు.
ముత్యపు చిప్ప అంటే ఒక ప్రాణి. ముత్యపుచిప్పలోపల చిన్న బీడ్‌ను ఇంజెక్ట్ చేస్తారు. ఇక ఆ బీడ్ చుట్టూ క్యాల్షియం పొరలను ఏర్పరుచుకుంటుంది ఆ ప్రాణి. బీడ్ షేప్‌ను బట్టి ముత్యం ఆకారం ఉంటుంది. ఇలా తయారు చేయడం మొదలైన తర్వాత ముత్యాలు విరివిగా లభిస్తున్నాయి. కల్చర్డ్ పెరల్స్ కూడా నిజమైన ముత్యాలేనని గమనించాలి. ఎక్స్ రే ద్వారా పరీక్షించి నిజమైన ముత్యాన్ని గుర్తించాలి.
ఇక ముత్యం రంగు ఆయెస్టర్ జీవించిన నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చల్లటి నీరు, ఒక మోస్తరు వెచ్చటి నీరుని బట్టి రంగు మారుతుంది. అలాగే ఆస్ట్రేలియాలో దొరికే ముత్యాలను సౌత్ సీ పెరల్స్ అంటారు. జూన్ నుంచి వచ్చిన వాటిని ఫ్రెష్ వాటర్ పెరల్స్ అంటారు.
ముత్యాలకు గాలి తగలాలి. కాబట్టి ముత్యాల దండలను జిప్‌లాక్ కవర్లలో భద్రపరచరాదు. కుషన్ బాక్సులు లేదా వెల్వెట్ బాక్సుల్లో పెట్టాలి. గాలి ధారాళంగా అందడం కోసం కనీసం నెలకోసారయినా బీరువా లో నుంచి బయటకు తీస్తుండాలి. ముత్యాల ఆభరణాలను ధరించకపోతే పాడవుతాయనే మాట అందుకే చెబుతారు. -
-విశేషిణి రెడ్డి,
జిఐఏ జెమాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment