మనం నిత్యం మృత్యువును ఆఘ్రాణిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బయటపెట్టిన వివరాలు దిగ్భ్రాంతిపరుస్తాయి. ప్రపంచంలోని కాలుష్యభరిత నగరాల్లో 14 మన దేశంలోనే ఉన్నాయని ఆ నివేదిక చెప్పడంతోపాటు నిరుడు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలమంది మరణించారని వెల్లడిస్తోంది. పీల్చే గాలి సైతం ప్రాణాంతకం కావడం కన్నా విషాదమేముంటుంది? పరిశ్రమలు, వాహనాలు, అడవుల ధ్వంసం వగైరాలన్నీ వాయు కాలుష్యాన్ని నానాటికీ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. పర్యవసానంగా డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత డేటా బేస్‌లో మన నగరాలు అధమ స్థానంలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లోని 4,300 నగరాల్లో అధ్యయనం చేసి 540 నగరాల్లో పరిమితులకు మించిన వాయు కాలుష్యం ఉన్నదని నివేదిక వెల్లడిస్తే...అందులో కాన్పూర్, లక్నో, వారణాసి, గయ, పట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, ముజఫర్‌పూర్, శ్రీనగర్, పటియాల, జైపూర్ తదితర 14 నగరాలు మనవే. అత్యంత సూక్ష్మ ధూళి కణాలు మిగిలిన నగరాల్లో కన్నా కాన్పూరులోనే అధికంగా ఉన్నాయి. ఈ నగరాలన్నిటా 2016 పొడవునా వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వార్షిక సగటు లెక్కేసి ఈ నివేదిక రూపొందించారు. కాలుష్య నగరాల్లో చాలా భాగం ఢిల్లీ సమీపంలోనివే. వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం2.5) ప్రతి ఘనపు మీటరులోనూ 25 మైక్రోగ్రాములు మించకూడదు. మన నగరాలు ఈ పరిమితులను దాటిపోయాయని తాజా నివేదిక అప్రమత్తం చేస్తోంది. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పరిమితులకు మించి అధికంగా ఉన్న నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం కూడా చోటు సంపాదించాయి.
సకాలంలో చర్యలు చేపట్టకపోతే అవి కూడా రాగలకాలంలో ప్రమాదకర నగరాల జాబితాలో చేరతాయి. నగరాల్లోని వాయు కాలుష్యం కేవలం అక్కడే పుట్టిందనుకోనవసరం లేదు. గాలులు వీచే దిశ కూడా దాన్ని నిర్దేశిస్తుంది. వాయువ్యం నుంచి తూర్పు వైపు వీచే గాలులు మోసుకొచ్చే ధూళి కణాలు గయ, ముజఫర్‌పూర్, కాన్పూర్ నగరాల్లోని వాయు నాణ్యతను దెబ్బతీస్తున్నాయన్నది శాస్త్రవేత్తల అంచనా. దీనికి తోడు ముందు చూపు లేకుండా అభివృద్ధి పేరిట నగరాల చుట్టూ పరిశ్రమలను కేంద్రీకరించే విధానాలు సైతం ప్రాణాంతకమ వుతున్నాయి. ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికే జనం వలసపోతారు. జనాభా కేంద్రీకరణ వల్ల నగరాల్లో వాహన కాలుష్యం శ్రుతి మించుతోంది.
జనాభా అంతటికీ రవాణా సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాల చేతగానితనం రోడ్లపైకొచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యను నానాటికీ పెంచుతోంది. పరిశ్రమలు, వాహనాలు వదిలే ఉద్గారాలు నైట్రేట్‌లు, సల్ఫేట్‌లు, కాడ్మియం, పాదరసం, నికెల్ వంటి కేన్సర్ కారక కార్సినోజిన్‌లను వ్యాప్తి చేస్తున్నాయి. ఇవన్నీ చడీచప్పుడూ లేకుండా మనిషి ఊపిరితిత్తుల్లోకి చొరబడి కొంచెం కొంచెంగా ప్రాణాన్ని కొరుక్కుతింటున్నాయి. వాయు కాలుష్యం వల్ల మనిషి జీవితకాలంలో కనీసం మూడేళ్లు హరించుకుపోతుందని నిపుణులంటున్నారు. భౌగోళికంగా చూస్తే ఉత్తరభారతం ఉత్తరాన ఉన్న హిమాలయాలకూ, దక్షిణం వైపునున్న వింధ్యపర్వతాలకూ మధ్యన ఉంది. ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో తరచు వీచే ప్రచండగాలులు ఇక్కడికి భారీ పరిమాణంలో ధూళి కణాలను మోసుకొస్తాయి. సముద్ర తీరప్రాంతాలుంటే ఇలా వచ్చే ధూళి కణాలు చెదిరిపోయే ఆస్కారముంటుంది. కానీ ఇక్కడ ఆ అవకాశం లేదు.
ఈ భౌగోళిక స్థితికి తోడు అడవుల ధ్వంసం, పంట వ్యర్థాలను తగలబెట్టడం, పరిశ్రమలు, వాహనాల కాలుష్యం పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. ఊపిరితిత్తుల జబ్బులు అంతకంతకు పెరగడంతోపాటు ఏటా పది లక్షల చొప్పున కొత్తగా కేన్సర్ కేసులు తయారవుతున్నాయి. గంగానదీ పరివాహ ప్రాంతంలో గత దశాబ్దంలో గాలిలో ధూళి కణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. దీన్నంతటినీ చూసీచూడనట్టు వదిలేస్తే మున్ముందు నియంత్రణకు సైతం వీలుకాకపోవచ్చు. ఎన్నడో 1940 ప్రాంతంలోనే కాలుష్య నివారణకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన అమెరికాలోని కాలిఫోర్నియాను మన దేశం ఆదర్శంగా తీసుకోవాలి.
భౌగోళికంగా కాలిఫోర్నియా మన ఉత్తరభారతంలాగే ‘సహజసిద్ధం’గా కాలుష్యం బారిన పడక తప్పని ప్రాంతం. కనుకనే అక్కడ కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అదనంగా పరిశ్రమలు, వాహనాలు కాలుష్యాన్ని మరింత పెంచకుండా నియంత్రించారు. అక్కడ వాహనాలు భారీయెత్తున పెరిగినా వాటివల్ల కలిగే వాయు కాలుష్యాన్ని కనిష్టం చేయగలిగారు. రెండేళ్లక్రితం మన దేశం వాయు కాలుష్య నియంత్రణ విషయంలో కాలిఫోర్నియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన చురుకైన ఆచరణే ఇంకా కనబడటం లేదు. ఒక్క కాలిఫోర్నియానే కాదు...మనకంటే వెనకబడిన దేశాలైన ఫిలిప్పీన్స్, పెరు, ఉరుగ్వే వగైరాలు సైతం వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ముందున్నాయి. వాటినుంచి కూడా పాఠాలు నేర్వాలి.
మన దేశంలో వాయు కాలుష్యం బాధితులు జనాభాలో సగానికి పైబడి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. వాయు కాలుష్యం వల్ల ఏటా లక్షమంది వయోజనులు మరణిస్తుంటే...అందులో 24 శాతంమంది గుండె సంబంధ వ్యాధులతో, 43 శాతంమంది ఊపిరితిత్తుల వ్యాధులతో, 29 శాతంమంది ఊపిరితిత్తుల కేన్సర్‌కు లోనై మరణిస్తున్నారు. ఈ వ్యాధులు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుంగదీస్తున్నాయి. కుటుంబాలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. కనుకనే ఈ సమస్యపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలి. వాయు నాణ్యత నాసిరకంగా ఉంటున్నా, అది ప్రాణాంతకంగా మారుతున్నా చూసీచూడనట్టు వదిలేసే ధోరణిని ఇకనైనా ప్రభుత్వాలు విడనాడాలి.
Comments
Please login to add a commentAdd a comment