ఇనుపతెరలు దిగుతున్నాయి! | iron grill obstructions over media | Sakshi
Sakshi News home page

ఇనుపతెరలు దిగుతున్నాయి!

Published Tue, Aug 11 2015 12:41 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

ఇనుపతెరలు దిగుతున్నాయి! - Sakshi

ఇనుపతెరలు దిగుతున్నాయి!

రెండోమాట
 
‘మనిషికి కళ్లు ఎంత అవసరమో, ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ప్రసార మాద్యమం అవసరం కూడా అంతే. మీడియా లేని ప్రభుత్వం కన్నా, ప్రభు త్వం లేని మీడియానే; దాని స్వేచ్ఛనే కోరుకుంటాను’.
 -థామస్ జఫర్సన్ (అమెరికా స్వాతంత్య్ర ప్రకటన, రాజ్యాంగ రచయితలలో ఒకరు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు.)
 
‘ఇండియా అన్న భావమే నేడు ప్రమాదంలో పడింది. స్వాతంత్య్ర సము పార్జన తరువాత ఇప్పుడు మనం అత్యంత ప్రమాదకర ఘడియలను ఎదు ర్కొంటున్నాం. మరోసారి అంటున్నాను, అదేమాట- దయచేసి నా మాట లని కత్తిరించకండి! నేను ఉగ్రవాదం గురించి మాట్లాడడం లేదు. భావ స్వేచ్ఛపైన ప్రభుత్వం ఇనుపతెర దించింది. ఈ వాతావరణంలో ఆలోచనా శక్తినే నియంత్రించదలిచింది.
 -నయనతారా సెహెగల్ (‘నెహ్రూస్ ఇండియా’ రచయిత్రి)


బీజేపీ-సంఘ్ పరివార్ (ఎన్డీఏ) ప్రభుత్వం ఏరకమైన నిర్ణయాలతో, అప్రకటిత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్నదో, క్రమంగా మరో ఎమ ర్జెన్సీకి (ఆత్యయిక పరిస్థితి) దారి వెతుకుతున్నదో ఆ శిబిరానికే చెందిన అగ్ర నేత లాల్ కిషన్ అద్వానీ హెచ్చరించారు. దేశ ప్రజలను ముందస్తుగా హెచ్చ రిస్తూ మాజీ ఉపప్రధాని చేసిన ఈ ప్రకటన వెలువడిన కొలది మాసాల నుంచే అనూహ్యంగా కొన్ని ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు సయితం ఆ అనుమానాలను మరింత ధ్రువీకరించేటట్టు ఉన్నాయి. త్వరితగతిన జరిగిపోతున్న ఈ మార్పులు ప్రతి రంగంలోను కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ మార్గంలోనే బీజేపీ ప్రయాణం కూడా సాగుతోంది.

భిన్న సంస్కృతుల మేలుకలయికగా ఉన్న భారతీయ సమాజాన్ని చీలుబాట పట్టించే తీరులో పరివార్ సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సహా పలు శాఖలలోనూ, ప్రణాళికా సంఘ విభాగాలలోనూ ఇలాంటి ‘మార్పులు’ తెచ్చిపెడుతున్నారు. పాఠ్య ప్రణాళికలు వేరు బాట పడుతున్నాయి. చరిత్రకు సమగ్ర దృక్కోణాన్నీ, శాంతి సౌమనస్యాలకు దోహదం చేసే సకల మత సారాన్నీ అందించడం కాకుండా, వివాదాస్పద విషయాలను జత చేసే  ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశ ఆర్థిక, సామాజిక దిశాగతికి సంబంధిం చిన ప్రగతిశీల సంస్కరణల వైపుగా కాకుండా విదేశీ గుత్త పెట్టుబడి వర్గాల మౌలిక ప్రయోజనాల రక్షణకు తలపెట్టిన విధానాలకే కాంగ్రెస్-యూపీఏ ప్రభుత్వం ఆనాడు పాటుపడింది. ఆ విధానాలనే మరింత పటిష్టం చేస్తూ బీజేపీ-ఎన్డీఏ ఈనాడు ముందుకు సాగుతున్నది.

ఉరిశిక్ష మీద ఎవరిది రచ్చ?
బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఉరిశిక్షల విషయంలోనే కాకుండా; ‘ప్రజా వేగులు’ (విజిల్ బ్లోయర్స్) బహిర్గతం చేసే అనేక అవకతవకల గురించీ, పెరిగిపోతున్న అధికార, అనధికార మంత్రుల, ప్రజాప్రతినిధుల అవినీతి, లంచగొండితనాల గురించి చేస్తున్న హెచ్చరికలను కూడా కంపరంగా భావి స్తోంది. అందుకే ప్రసార సాధనాల పీక నొక్కడానికి ప్రయత్నిస్తున్నది. ఉరిశిక్ష విధింపులోని సామంజస్యం గురించి సుప్రీంకోర్టు సహా కొన్ని కిందిస్థాయి న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తున్న సమయమిది. మరణదండనను రద్దు చేస్తూ పార్లమెంట్ తీర్మానం తీసుకురావలసిన తరుణంలో, ఆ బాధ్యతను తాను తీసుకుని, దేశంలో ఒక రాష్ట్రం (త్రిపుర) తొలిసారి తీర్మానించడం విశే షమే. కానీ ఇదే వివాదం గురించిన వార్తలను, విశ్లేషణలను వెలువరించిన పత్రికలనూ, చానల్స్‌నూ నోటీసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నది. నిజా నికి సమాచార హక్కు చట్టాన్ని క్రమంగా నీరు కార్చడానికే బీజేపీ పాలకులు సాహసిస్తున్నారు.

కావలసిన సమాచారాన్ని సేకరించడానికి వెళ్లిన పత్రికా రచయితలు నిర్దేశించిన మీడియా గదికే పరిమితం కావాలనీ, సరాసరి ఏ సీనియర్ అధి కారినీ కలవడానికి వీలులేదనీ తాజాగా ఒక నిరంకుశ ఉత్తర్వును కేంద్ర హోం శాఖ జారీ (23-7-2015) చేసింది. ఆశించిన సమాచారాన్నీ, వివరణలనూ హోం శాఖ అడిషనల్ డెరైక్టర్ జనరల్ నుంచి మాత్రమే పొందాలని శాసిం చడం కూడా జరిగింది. కానీ కంటితుడుపు చర్యగా, అలాంటి తాఖీదు ఏదీ లేదని సర్ది చెప్పడానికి హోం శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తరువాత నానాతంటాలు పడ్డారు. ఎవరు ఏ సంగతిని మభ్య పెట్టదలిచినా ‘కలుగులో ఎలుక’ పట్టుబడక తప్పదు.

మూడు చానళ్లకు నోటీసులు
1993 నాటి ముంబై పేలుళ్ల సంఘటనలో అరెస్టయి 22 ఏళ్లు జైల్లో ఉన్న యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేయడం గురించి సమాచారాన్ని వెల్లడించడాన్ని ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే ఈ సమాచారాన్ని వెల్లడించిన లేదా ప్రచురించిన మూడు చానళ్లు- ఏబీపీ న్యూస్, ఎన్డీటీవీ, ఆజ్ తక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ (8-8-2015)  అయినాయి. ఇక్కడ మరు గునపడిన విషయం ఒకటి ఉంది- దేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనా లలోనే ఉరిశిక్ష అమలు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. మారిన ధర్మాసనం తీర్పుతో చివరికి ఉరిశిక్ష ఖరారైంది. ఇదే తీరులో పలు వురు న్యాయమూర్తులు (రిటైర్డ్), న్యాయవాదులు, ప్రసిద్ధ పత్రికలు భిన్నా భిప్రాయాలనే వ్యక్తం చేశాయి.

కేంద్రం జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా పలు పత్రికా సంస్థలు, ప్రెస్ క్లబ్‌లు, మిహ ళా పత్రికాధిపతులు భావ ప్రక టనా స్వేచ్ఛ హక్కును నిలబెట్టుకోవడానికి తమవంతు ప్రయత్నం చేశారు. చేస్తూనే ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే, ఏ విధానాల వల్ల తమ ఉనికికి భంగం వాటిల్లుతుందో వాటిని మార్చుకోవడానికే ప్రభుత్వాలు మొరాయి స్తున్న ఘడియలివి. నిజానికి అలాంటి వేళలోనే ఈ తరహా నిరంకుశ ఉత్త ర్వులు జారీ అవుతూ ఉంటాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్యమత సంస్థల మీద, మైనారిటీ సంస్థల మీద వేధింపులను ఆరంభిం చింది. ప్రస్తుతం ఎన్డీఏ పాలకులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, అగ్ని పరీక్షలు వాటి ఫలితమే. గుజరాత్ మారణకాండతో సంబంధం కలిగినవారు ఒక్కొక్కరే తమపై ఉన్న కేసులనూ, శిక్షలనూ యథేచ్ఛగా రద్దు చేయిం చుకోవడం మరో ప్రహసనం.

మనిషి కోసమే చట్టం
ప్రజల మాట పాలకుల కోట కావచ్చునే కానీ, పాలకుల మాట పాలితుల పాలిట శిలాశాసనం కారాదు. ఇకపైనైనా ఈ సూత్రమే ప్రజాస్వామ్యానికీ, రాజకీయ పక్షాలకూ, ప్రభుత్వాలకూ ఆచరణలో రక్షణ కవచం కావాలి. రక్షక భట వర్గాల పని దేశాన్నీ, ప్రజలనూ రక్షించడమే. పాలకులనూ, ప్రభుత్వా లనూ రక్షించడం కాదు. అందుకే ప్రశ్న నుంచి పుట్టిన ప్రపంచం తిరిగి ప్రశ్ననే ఆశ్రయించాలి. ‘కేవలం చట్టం కోసమని మనిషి పుట్టలేదు. మనిషి కోసం, అతడి ఉనికి కోసం, రక్షణ కోసమే చట్టం ఉంది. ప్రజాస్వామ్యానికి పునాదీ, ఉనికీ మనిషే. ఇదే రాజ్యాంగ శక్తికి పునాది’ అంటాడు హెగెల్. ‘చట్టం ఉన్నది మనిషి రక్షణకే కాని, ప్రాణం తీయడానికి కాదు’ అంటాడు జస్టిస్ జోసఫ్.

మన ఉపనిషత్తుల సారం మొత్తం ప్రశ్న అనే మాధ్యమంలోనే ఉంది. మొత్తం మనిషి మనుగడకు, సాధించదలచిన ప్రగతికి, ఆలోచనాశక్తిని పెంచేందుకూ అత్యవసరమైనవి- ప్రశ్న, సమాధానం. అవి విషయాన్ని నిగ్గు తేలుస్తాయి. నిరంతర అన్వేషణను కొనసాగించేది ప్రశ్న. కానీ ఇప్పుడు ప్రశ్నను సంధిం చిన వారి నోరు నొక్కడాన్ని పాలకులు ఆంక్షా శాసనంగా (గ్యాగ్ ఆర్డర్) వినియోగించదలుచుకున్నారు.

మన ఉపనిషత్తులు బోధించిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రక్రియ మొత్తం చర్చ, లేదా సంవాదం రూపంలో నిగ్గుతేల్చిన తరువాతే జరిగిందని మరవ రాదు. తమ స్వార్థం కోసం పోలీసులు చేసిన అకృత్యాలను మరుగుపరుస్తూ, అమాయకులను మాత్రం కేసులలో ఇరికించి, వేధించడానికి తాజా ఉదాహ రణ- మారేడ్‌పల్లి దుర్ఘటన, దుర్మార్గం. ఏ దేశంలోనైనా ప్రాక్టీసు లేని ప్లీడర్లు కొందరు, న్యాయమూర్తులు కొందరు దేశాభిమానులుగా కీర్తి గడించడం సహజం.

భావ స్వేచ్ఛను, స్వతంత్రమైన ఆలోచనా శక్తిని నిష్పాక్షికంగా, నిర్మొ హమాటంగా, స్వేచ్ఛగా సమస్యలను చర్చించడాన్ని వాత్సాయనుడు వంటి భారతీయ తత్వవేత్తలు నాడే అభిలషించి ప్రోత్సహించారు. నిరంతరం సత్యా న్వేషణ కోసం తపించిన వారిగా ప్రసిద్ధి గాంచిన వారే నచికేతాదులు. కానీ పాలకులకు ఈ ప్రశ్న అంటేనే వెగటు. ఇక ఉప ప్రశ్నల సంగతి చెప్పనక్కర లేదు. సమాచార హక్కు చట్టం కింద ఇప్పుడు మీరు కావలసిన సమాచారాన్ని రాబట్టలేరు. పౌరులకు తెలియకుండా అందుకు సంబంధించిన ఉత్తర్వులేవో చడీచప్పుడు లేకుండా జారీ అయినట్టు భావిస్తున్నారు. అద్వానీ భయం నిజ మయ్యేటట్టే ఉంది. బీజేపీలో కొందరు ఎంపీలు- వరుణ్‌గాంధీ వంటివారు- కూడా ‘దేశ ప్రజలు నిజాలు తెలుసుకోగోరుతున్నారు’ అంటూ గొంతు కల పడం రానున్న ఉప్పెనలకు ఒక సూచన.


 
 ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement