మహారాష్ట్రలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం పోకడ ఎలా ఉండబోతున్నదో బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కళ్లకుకట్టాయి. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో దాన్ని అయిందనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు...ఆ తర్వాత సభలో చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు కాంగ్రెస్‌కు చెందిన అయిదుగురు సభ్యుల్ని రెండేళ్లపాటు సభనుంచి సస్పెండ్ చేయడానికి దారితీశాయి. కొత్త శాసనసభ కొలువుదీరిన తొలిరోజే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పార్టీల ప్రతిష్టను పెంచదు. తగినంత సంఖ్యాబలం ఇవ్వకపోయి ఉండొచ్చుగానీ మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నాయ కత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనే కోరుకున్నారు. అందులో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాలు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది.
శివసేనకు 63, ఎన్సీపీకి 41, కాంగ్రెస్‌కు 42 లభించాయి. తన సర్కారు మనుగడ సాధించాలంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి మద్దతు పొందక తప్పని స్థితిలో బీజేపీ ఉన్నది. మిగిలిన చిన్నా చితకా పార్టీలకు 18 స్థానాలు మాత్రమే ఉన్నందువల్ల వారందరి సహకా రమూ పొందినా ప్రభుత్వ మనుగడకు అవసరమైన 145 సం ఖ్యను చేరుకోవడం అసాధ్యం. కనుక మహారాష్ట్రలో ఇప్పుడున్నది మైనారిటీ ప్రభు త్వమన్నది సుస్పష్టం. దానికి తగినవిధంగా బలం చేకూర్చుకుని, సుస్థిర పాలనను అందివ్వాలన్న దృఢ సంకల్పం ఉన్నప్పుడు బీజేపీ తన పూర్వ మిత్ర పక్షం శివసేనను బుజ్జగించి, వారి డిమాండ్లపై చర్చించి ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. లేదా కోర కుండానే మద్దతివ్వడానికి ముందుకొచ్చిన ఎన్సీపీ తోడ్పాటు అయినా తీసుకోవాలి.
కానీ, బీజేపీ తీరు చూస్తుంటే అది ఈ మార్గాలను బేఖాతరు చేస్తూనే లేదా చేసినట్టు కనిపిస్తూనే ప్రభుత్వాన్ని నడపదల్చుకున్నట్టు అర్థమవుతుంది. బహుశా లోగడ కర్ణాటకలో యడ్యూరప్ప నేతృత్వంలోని కమలం సర్కారు చేసినట్టు కొంతమంది విపక్ష సభ్యుల్ని రాజీనామాలు చేయించి మళ్లీ పోటీకి నిలబెట్టే యోచన ఏమైనా ఉన్నదేమో! వాస్తవానికి శాసనసభ సమావేశాలు ఎంతో సుహృద్భావ వాతావరణంలో మొదలయ్యాయి. స్పీకర్ స్థానానికి పోటీ పడదామనుకున్న శివసేన, కాంగ్రెస్‌లు రెండూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వినతిమేరకు రంగంనుంచి తప్పుకున్నాయి.
ఈ ఘట్టం పూర్తయి, కొత్త స్పీకర్ హరిభావ్ బగ్డే సభాధ్యక్ష స్థానంలో ఆశీనులైన కాసేపటికే ఇదంతా మారిపోయింది. ఆ వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు విశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, తీవ్ర గందరగోళంమధ్య మూజువాణి ఓటుతో అది ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించడం పూర్తయ్యాయి. శివసేన, కాంగ్రెస్‌లు తేరుకుని, ఓటింగ్‌కు పట్టుబట్టేసరికి నిబంధనలు ఒప్పుకోవని ఆయన నిరాకరించారు. చట్టసభకు స్పీకరే అధిపతి. అక్కడ ఆయన నిర్ణయమే అంతిమం. సాంకేతికంగా దీన్నెవరూ కాదనలేరు. కానీ నైతికంగా చూసినా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూసినా బీజేపీ సర్కారుకు సాధికారత ఉంటుందా? 1999లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తుకుతెచ్చుకోవాలి. సభలో తమ బలం అంతంతమాత్రమేనని...ఒకరో ఇద్దరో జారుకున్నా జారుకోవచ్చునని తెలిసికూడా ఆనాడు వాజపేయి బలపరీక్షకు సిద్ధమయ్యారు. అంతేతప్ప స్పీకర్ సాయం తీసుకుని మూజువాణి ఓటుతో గట్టెక్కాలని చూడలేదు. రాజకీయాల్లో నైతిక విలువలకు పెద్ద పీట వేయాలనుకున్నప్పుడు అనుసరించాల్సిన మార్గమది.
దురదృష్టమేమంటే ఇటీవలికాలంలో చట్టసభల్లో మూజువాణి ఓటు ప్రయోగం ఎక్కువైపోయింది. ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకున్నదో తెలియకుండా, సభ్యుల్లో ఎవరి వాదన ఏమిటో అర్థంకాకుండా కీలకమైన ప్రతిపాదనలన్నీ మూజువాణి ఓటుతో నిర్ణయాలుగా మారిపోతున్నాయి. కోట్లాదిమంది పౌరుల జీవితాలతో ముడిపడి ఉండే వందలు, వేల కోట్ల రూపాయల విలువైన బడ్జెట్ పద్దులు సైతం ఈ మార్గంలోనే ఆమోదం పొందుతున్నాయి. గిలెటిన్ అవుతున్నాయి. పార్లమెంటరీ పరిభాషలో ‘ఫ్లోర్ మేనేజ్‌మెంట్’ అనే మాట ఉంది. కానీ, అది సభలో పారదర్శక పద్ధతుల్లో ప్రతిబింబించాలి తప్ప ఇలా సాంకేతిక కారణాలను చూపి సర్కారును నిలబెట్టుకునే తీరుగా ఉండకూడదు. అత్యధిక స్థానాలున్న పార్టీగా అవసరమైన బలాన్ని సమీకరించుకోవడానికి వివిధ పక్షాలతో బీజేపీ మాట్లాడి ఉండాల్సింది.
వెనువెంటనే ఎవరూ ఎన్నికలు కోరుకునే పరిస్థితి ఉండదు గనుక ఆ విషయంలో బీజేపీ పని సులభమై ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గి ఉండేదేమో కూడా! కానీ, ఆ రాజమార్గాన్ని ఎన్నుకునే ధైర్యాన్ని ఫడ్నవీస్ సర్కారు ప్రదర్శించలేకపోయింది. అలాంటపుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్నా తాము విపక్షంలోనే కూర్చుంటామని ప్రకటించిన అక్కడి బీజేపీ నేతలను ఆదర్శంగా తీసుకోవాల్సింది. ‘కాలు తొక్కిననాడే కాపురం సొగసు ఎలా ఉంటుందో తెలిసింద’న్నట్టు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే అనవసర వివాదానికి తావిచ్చి ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం మసకబార్చింది.
నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి మరో ఆర్నెల్లవరకూ విశ్వాసపరీక్ష ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు. కానీ, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడల్లా ఈ ‘మైనారిటీ’ సమస్య అడ్డం పడుతూనే ఉంటుంది. ప్రభుత్వానికి బలం ఉన్నదో లేదో తేలాల్సింది రాజ్‌భవన్‌లలో కాదని, చట్టసభల్లో మాత్రమేనని ఎస్‌ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చట్టసభల్లో కూడా మూజువాణి ఓటు ద్వారా కాక విస్పష్టమైన ఓటింగ్ ద్వారా మాత్రమే బలాబలాలను తేల్చాలన్న నిబంధన తీసుకురావడం అవసరమని మహారాష్ట్ర అనుభవం చాటిచెబుతున్నది. ఎన్నికల వ్యవస్థపైనా, చట్టసభలపైనా ప్రజలకు విశ్వాసం పెరగాలంటే ఇది తప్పనిసరి.
‘మహా’ రభస!
Published Thu, Nov 13 2014 1:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement