వలస పాలకులపై పోరాడటంలో, ప్రకృతి వనరుల్లో, జన సంపదలో ఎన్నో సారూ ప్యతలున్న భారత్-ఆఫ్రికా దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచే శిఖరాగ్ర సదస్సుకు నేటినుంచి మూడు రోజులపాటు న్యూఢిల్లీ వేదిక కాబోతున్నది. శతాబ్దా లుగా ఆఫ్రికా దేశాలతో మన దేశానికి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి. అక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయులు దాదాపు 27 లక్షలమంది. మన దేశంతో పోలిస్తే విస్తీర్ణంలో పది రెట్లు ఎక్కువగా...ఇంచుమించు మన జనాభాతో సమానంగా(జన సంఖ్య 110 కోట్లు) ఉండే ఆఫ్రికా దేశాలతో వాణిజ్య బంధానికి పదును పెట్టేందుకు 2008లో తొలి భారత్-ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమ్మేళనం జరి గింది. 2011లో ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలో తదుపరి శిఖరాగ్ర సదస్సు జరిగింది. వాస్తవానికి మూడో సదస్సు నిరుడు డిసెంబర్‌లో నిర్వహించాలని భావించారు. అయితే ఆ సమయంలో ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా మహమ్మారి పట్టి పీడిస్తుండటంతో...దాదాపు అన్ని దేశాలూ దాని నిర్మూలనపై దృష్టి పెట్టడంతో ఆ సదస్సును వాయిదా వేయక తప్పలేదు.
ఆఫ్రికా దేశాలతో బహుళ రంగాల్లో చేయీ చేయీ కలిపి నడిచేందుకు అంతర్జా తీయంగా భారత్-ఆఫ్రికా ఫోరం తరహాలోనే మరో మూడు పని చేస్తున్నాయి. అవి-యూరప్ దేశాలతో కూడిన ఈయూ-ఆఫ్రికా సమ్మేళనం, అమెరికా-ఆఫ్రికా సమ్మేళనం, చైనా-ఆఫ్రికా సహకార ఫోరం(ఎఫ్‌ఓసీఏసీ). ఈ మూడింటిలోనూ ఎఫ్‌ఓసీఏసీ మిగిలినవాటికన్నా చాలా ముందు ఆవిర్భవించడమే కాదు...విస్తృతిరీ త్యా కూడా చాలా పెద్దది. చైనా నాయకులకుండే ముందు చూపు అలాంటిది. వారు 2000 సంవత్సరంలోనే ఎఫ్‌ఓసీఏసీని ఏర్పాటు చేసి ఆఫ్రికా ఖండంలోని దాదాపు 46 దేశాలతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకున్నారు.
అక్కడి మౌలిక సదుపా యాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకా రం అందజేశారు. 2006 నాటికి 500 కోట్ల డాలర్లుండే చైనా ఆర్థిక సాయం ఇప్పుడు 2,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదికాక రైల్వే లైన్లు, ఓడరేవులు, జాతీయ రహ దార్ల నిర్మాణాల్లో ఆ దేశం పాలుపంచుకుంటోంది. చైనా రైల్వే నిర్మాణ సంస్థ నిరు డు నైజీరియాలో 1,200 కోట్ల డాలర్ల ప్రాజెక్టును చేజిక్కించుకుంది.
ఆఫ్రికా ఖండమంతా దాదాపుగా చైనా వేళ్లూనుకున్నాక 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్-ఆఫ్రికా ఫోరం ఆవిర్భవించింది. దీని ఫలితం ప్రోత్సాహకరంగానే ఉన్నా...2011లో రెండో సదస్సు కూడా జరిగినా సంబంధాలు ఎదగవలసినంతగా ఎదగలేదు. ప్రస్తుతం 41 దేశాల్లో 137 ప్రాజెక్టుల ద్వారా మన దేశ పెట్టుబడుల విలువ 750 కోట్ల డాలర్లు మాత్రమే. యూపీఏ సర్కారు హయాం లో మన విదేశాంగ విధానంలో ఏర్పడిన జడత్వమే ఇందుకు కారణం అనుకో వచ్చు.
1,300 కోట్ల డాలర్లతో ఈయూ...ఎంతో ఆలస్యంగా నిరుడు ప్రవేశించినా 900 కోట్ల డాలర్ల పెట్టుబడులతో అమెరికా వరసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. వచ్చే డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో చైనా నేతృత్వం లోని ఎఫ్‌ఓసీఏసీ సమావేశాలు జరగబోతున్న ప్రస్తుత తరుణంలో భారత్-ఆఫ్రికా ఫోరం సమ్మేళనానికి కీలక ప్రాధాన్యత ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మన విదేశాంగ విధానానికి చురుకుదనం వచ్చింది. ఇరుగు పొరుగు దేశాలతో, సుదూర తీరాల్లోని దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో, మన ప్రయోజనా లను విస్తృతం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో వ్యవహరించారు. కానీ, ఆఫ్రికా దేశాలపై మాత్రం ఇంతవరకూ సరిగా దృష్టి సారించలేదు.
అయితే ఈ విషయంలో దీటైన వ్యూహంతో ముందుకెళ్లదల్చుకున్న సంకేతాలు కనబడుతు న్నాయి. గతంలో వలె కాకుండా ఈసారి ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాల అధినేతలనూ ఈ శిఖరాగ్ర సమ్మేళనానికి ఆహ్వానించడమే ఇందుకొక ఉదాహరణ. గతంలో జరిగిన రెండు సదస్సులకూ ఆఫ్రికా యూనియన్ ఎంపిక చేసిన 15 దేశాల అధినేతలను మాత్రమే ఆహ్వానించారని గుర్తు చేసుకుంటే ఈ మార్పుకున్న ప్రాధాన్యత తెలుస్తుంది. ఆహ్వానించిన 54 దేశాల అధినేతల్లో కనీసం 40మంది తమ తమ ప్రతినిధి బృందాలతో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆ రకంగా చూస్తే ఇది మన దేశంలో జరిగే అతి పెద్ద అంతర్జాతీయ సమ్మేళనం అవుతుంది.
న్యూఢిల్లీ శిఖరాగ్ర సమ్మేళనానికి అనుకూలించే పరిణామాలు చాలా ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో చైనాది పైచేయిగా ఉండొచ్చుగానీ...దాని తీరుతెన్నులపై ఆయా దేశాల్లో బోలెడంత అసంతృప్తి ఉంది. భారీ భవంతుల నిర్మాణ పనుల్ని చైనాకు అప్పజెప్పిన బోట్స్‌వానా ఎదుర్కొంటున్న సమస్యలే ఇందుకు ఉదాహరణ. వాటిల్లో ఏ ప్రాజెక్టూ సకాలంలో పూర్తికాక ఆ దేశం అవస్థలు పడింది. వివిధ దేశాల్లో మొత్తంగా చైనాకు చెందిన 2,500 కంపెనీలు వివిధ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్నాయి. వీటిల్లో స్థానికులకు కాక చైనీయులకే ఉపాధి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయని ఆఫ్రికా దేశాలు కినుకవహిస్తున్నాయి. భారత్ బరిలో ఉంటే...తమకు ప్రత్యామ్నాయాలున్నాయని చెప్పినట్టవుతుందని అవి అభిప్రాయపడుతున్నాయి.
అపారమైన ప్రకృతి వనరులున్నా ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ పేదరికంతో, నిరుద్యోగితతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. చీకటి ఖండమన్న పేరును పోగొట్టుకోలేకపోతున్నాయి. అక్కడున్న ఇంధన వనరులు మన దేశ అవసరాలకు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే మనవద్ద ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన టెక్నాలజీ, నైపుణ్యత, విద్య, వైద్యం, ఐటీ వంటివి ఆఫ్రికాకు ఉపయోగపడతాయి. నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు అనుసరిస్తున్న విధానాల్లో ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ విజయం సాధిస్తున్న చైనాను ఆదర్శంగా తీసుకుంటే మన దేశం కూడా ఆఫ్రికాలో ముందడుగు వేస్తుంది. అది మన పలుకుబడి విస్తరణకూ, అంతర్జాతీయ వేదికల్లో భారత్‌కు మద్దతు పెరగడానికి దోహదపడుతుంది.
సరికొత్త సహకారం దిశగా...
Published Mon, Oct 26 2015 1:17 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
Advertisement