
అనవసర గోప్యత
సంపాదకీయం
అవసరంలేనిచోట దాపరికాన్ని ప్రదర్శిస్తే అది వికటించే ప్రమాదం ఉంటుంది. ఈ సంగతి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆలస్యంగా అర్ధమై ఉంటుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెలక్రితం గుజరాత్ తీరంలో జరిగిందంటున్న ఒక చొరబాటు యత్నం ఉదంతం చుట్టూ ఇప్పటికే అల్లుకున్న మిస్టరీపై తీర రక్షక దళం సీనియర్ అధికారి నోరుజారి దాన్ని మరింత జటిలం చేశారు. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా... పాకిస్థాన్‌నుంచి మర పడవలో బయల్దేరిన ఉగ్రవాద ముఠా చొరబాటుకు చేసిన ప్రయత్నాన్ని మన తీర రక్షక దళం నిరోధించిందని కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రకటించినప్పుడు దేశం ఉలిక్కిపడింది. ఎందుకంటే 2008లో కొందరు ఉగ్రవాదులు ఇదే తరహాలో ముంబై నగరంలోకి ప్రవేశించి నరమేథాన్ని సృష్టించారు. 140 మందిని పొట్టనబెట్టుకున్నారు. మళ్లీ అలాంటి దాడికి తెగించి వచ్చిన ఉగ్రవాదులను తీరరక్షక దళం అడ్డుకోగలిగిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఉదంతంలో పడవలోనివారు తప్పించుకో వడానికి విఫలయత్నంచేసి చివరకు తమను తాము పేల్చుకు చనిపోయారని కేంద్ర ప్రభుత్వ ప్రకటన వివరించింది. ఈ కథనంలో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయని ఆరోజే జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తంచేసింది. ఒక సాధారణ మర పడవను తీర రక్షక దళం నౌక గంటపాటు వెంబడించినా పట్టుకోలేకపోయిందనడం, ఆ పడవలోనివారు పేల్చుకు చనిపోయారని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఆ కథనాలు అభిప్రాయపడ్డాయి. తమకు ఎలాంటి పేలుడు శబ్దాలూ వినిపించలేదని ఘటన జరిగిన ప్రాంతానికి చేరువలో సంచరించిన మత్స్యకారులు చెప్పారని కూడా వివరించాయి. త్వరలోనే ఒక సమగ్ర ప్రకటన చేస్తామని కేంద్రం దీనికి స్పందనగా జవాబిచ్చింది. అది ఇంతవరకూ జరగకపోగా తీర రక్షక దళం డీఐజీ బీకే లోశాలి ఒక సమావేశంలో అత్యుత్సాహానికి పోయి ‘డిసెంబర్ 31 అర్థరాత్రి పాక్ వైపునుంచి ఒక పడవ వచ్చిందన్న సమాచారం అందగానే దాన్ని పేల్చిపారేయమని చెప్పాను. వారిని పట్టుకుని బిర్యానీలు తినిపించే ఉద్దేశం మాకు లేదు’ అని చెప్పారు. ఆ అధికారి మాటలు ఇప్పటికే ఆ ఉదంతంపై ఉన్న అనుమానాలను మరింత పెంచాయి.
ఉగ్రవాద ముఠా ఒకటి దేశంలోకి జొరబడిన ఘటనపై నిజానికి ఇంత దాపరికం అవసరం లేదు. ఆ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రకటన వెలువడింది గనుక అప్పుడే వివరాలన్నిటినీ సమగ్రంగా ప్రభుత్వం ప్రకటించి ఉండొచ్చు. కనీసం మరో వారం, పదిరోజుల తర్వాతనైనా వెల్లడించి ఉండొచ్చు. త్వరలోనే వెల్లడిస్తామని తానే చెప్పినందువల్ల ఆ బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఎందుకనో అది జరగలేదు. ఈలోగా ఒక అధికారి తానే ఆ పడవను పేల్చేయమన్నానని ప్రకటించడంద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. పడవలోనివారు తీర రక్షక దళాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించలేదని, కేవలం పారిపోవడానికి చూశారని రక్షణ శాఖ అధికారులు మొదట్లో చెప్పారు. ఇక పట్టుబడిపోతామని గ్రహించాక పేలుడు పదార్థాలున్న పడవను పేల్చేసుకున్నారని అన్నారు. జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ (ఎన్‌టీఆర్‌ఓ) సేకరించిందంటున్న ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ పడవపై తీర రక్షక దళం అధికారులు నిఘా పెట్టారనుకున్నా అది మన సముద్ర జలాల్లోకి ప్రవేశించాక పట్టుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో అంతుబట్టదు. వారు పారిపోవడానికి ఎంతగా ప్రయత్నించినా నౌక వేగానికి దీటుగా ఆ పడవ వెళ్లే అవకాశం లేదు. కనుక గంటసేపు దాన్ని వెంటాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఒకవేళ అధికారిక ప్రకటన చెబుతున్నట్టు ఉగ్రవాదులు పడవను పేల్చేసుకుని ఉన్నా...తీర రక్షక దళం డీఐజీ చెబుతున్నట్టు ఆయనే పేల్చేయమన్నా అందుకు సంబంధించిన చప్పుళ్లు దరిదాపుల్లోని మత్స్యకారులకు వినబడాలి. అదీ లేదు. మరో కోణంనుంచి చూస్తే... సోదాలకు ప్రయత్నించకుండా పడవను పేల్చేయడం తీవ్ర తప్పిదమవుతుంది. అనుమానాస్పద స్థితిలో సంచరించే పడవ అయినంత మాత్రాన ఎలాంటి ఆరా తీయకుండా...అటునుంచి ప్రతిఘటన లేకుండా పేల్చేయడం సమర్థనీయమేనా? మన చట్టాలుగానీ, రాజ్యాంగంగానీ దీన్ని అనుమతిస్తాయా? అంతర్జాతీయ న్యాయ సూత్రాలు సమర్థిస్తాయా?
ఉదంతం జరిగిన ప్రాంతం మన సముద్ర జలాల పరిధికి ఆవల ఉంది. పైగా ఆ ప్రాంతంలో మత్స్యకార పడవల సంచారం విస్తృతంగా ఉంటుంది. అలాగే మాదకద్రవ్యాలనూ, మద్యాన్ని, ఆయుధాలనూ, డీజిల్‌నూ అక్రమ రవాణాచేసే స్మగ్లర్ల పడవలు సంచరిస్తుంటాయి. ముంబై దాడి ఘటన తర్వాత మన తీర ప్రాంతాన్ని పటిష్టం చేయడంలో భాగంగా మెరైన్ పోలీస్ స్టేషన్లను విస్తృతంగా ఏర్పాటుచేశారు. భద్రతా సంస్థలమధ్య సమన్వయం పెరిగింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అవసరానికి అనుగుణంగా నిఘాను పెంచడం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ఉదంతంపై ఇంత అయోమయం ఉండవలసిన అగత్యం ఏర్పడకూడదు. దేశం పెను ప్రమాదంబారిన పడకుండా తప్పించామని చెప్పుకోవడానికే దీనికి ఎనలేని ప్రాముఖ్యమిచ్చి ప్రచారం చేశారని కాంగ్రెస్ ఇప్పటికే విమర్శించింది. కాంగ్రెస్ తీరు పాకిస్థాన్ వాదనను బలపరిచేలా ఉన్నదని బీజేపీ ప్రతి విమర్శచేసింది. వీరి వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా మన ప్రతిష్టను దెబ్బతీసేలా తయార య్యాయి. మన దేశ రక్షణ కోసం తీసుకున్న ఒక చర్య విషయంలో అనవసరమైన దాపరికాన్ని పాటించడం ద్వారా కేంద్రం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. పడవను పేల్చేయమని తానే ఆదేశించానని చెప్పిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నంతమాత్రాన ఈ వివాదం సమసిపోదు. ఇకముందైనా ఇలాంటి ఉదంతాల విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని గ్రహించడం అవసరం.