మంచి మనిషికొక మాట చాలని నానుడి. దేశంలో పెరిగిపోతున్న అసహనంపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై సంఘ్ పరివారానికీ... బీజేపీ పెద్దలకూ ఒకటికి పదిసార్లు చెప్పినా సరిపోలేదు. అనేకులు అనేకసార్లు చెప్పినా తలకెక్కలేదు. దేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికి మూడోసారి కూడా చెప్పడం అయిపోయింది. రచయితలు, కళాకారులు నిరసన తెలిపితే అధికారంలో ఉన్నవారికి అస్సలు నచ్చలేదు. చెప్పినవారికల్లా పేర్లు పెట్టారు. ముద్రలేశారు. ‘మీరు రాయకపోతే ఏమవుతుంద’ని ఒకరు... మీరంతా ఫలానా సమయంలో ఏమైనారని ఒకరు... కుట్రపూరితమని ఒకరు మాట్లాడి గేలిచేశారు.
సినీ రంగ దిగ్గజాలు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు సైతం అలా నిరసన చెబుతున్నవారితో గళం కలిపినా ఏం జరుగుతున్నదో తెలివి తెచ్చుకోలేదు. వారి విషయంలోనూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పుడిక ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, ఫార్మా దిగ్గజం బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా వంతు వచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ సైతం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వీరికన్నా ముందు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ కూడా మతతత్వ శక్తులు చెలరేగటంపై హెచ్చరిక జారీ చేసింది. ఇదే వరస కొనసాగితే దేశీయంగా, అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోవడం ఖాయమని చెప్పింది.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి... ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్రపతిని మాత్రం బీజేపీ నేతలు ఏమీ అనలేదు. ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చారు. మళ్లీ ఆ స్థాయిలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు గౌరవించింది నారాయణమూర్తి ఇత్యాదులనే! వారి విషయంలో ఎవరూ మాట తూలలేదు. లేనిపోని ఆరోపణలు గుప్పించలేదు. బహుశా వ్యాపార భాష అర్ధమైనట్టుంది. ఏదో విధంగా అర్ధం కావాలనే దేశ ప్రజలు కూడా కోరుకున్నారు.
కవులు, రచయితల విషయంలో...శాస్త్రవేత్తల విషయంలో చేసిన తర్కం అందరినీ నివ్వెరపరిచింది. గతంలో తస్లీమా నస్రీన్‌పై దాడి చేసినప్పుడు మీరంతా ఏం చేశారని ఒకరంటే, ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈ వివేచన ఎటు పోయిందని మరొకరు ప్రశ్నించారు. నిజమే...రచయితలు, కవులు స్పందించాల్సిన సందర్భాలు గతంలో చాలా వచ్చాయి. సిక్కుల ఊచకోత, బాబ్రీ మసీదు విధ్వంసం, ఎంఎఫ్ హుస్సేన్‌పై దాడి జరిగినప్పుడు, ఆయన దేశం వదలి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడూ...శ్రీరాంసేన పేరిట పబ్‌లలో, పార్క్‌ల్లో యువజంటలపై దాడులు చేసినప్పుడూ వారు అవార్డులను వెనక్కి ఇవ్వలేదు.
అంతమాత్రాన ఇప్పుడు కూడా మాట్లాడవద్దనడం ఏం తర్కమో అర్ధంకాదు. అమెరికాలో బస్సులో ప్రయాణిస్తున్న నల్లజాతి వనిత రోసా పార్క్స్‌ను వెనక సీటుకెళ్లి కూర్చోమని డ్రైవర్ హుకుం జారీ చేసినప్పుడు 1955లో అక్కడ పౌరహక్కుల ఉద్యమం రగిలింది. ఒక తెల్లవాడి కోసమని నల్ల జాతి మహిళను అవమానిస్తారా అంటూ దేశమంతా ఉవ్వెత్తున ఉద్యమం ఎగసింది. మొన్నటికి మొన్న అయలాన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుడు విగతజీవుడై మధ్యధరా సముద్ర తీరానికి కొట్టుకొచ్చినప్పుడు యూరప్ దేశాల తీరుపై ఆగ్రహం వెల్లువెత్తింది. ఆ దేశాలు శరణార్థులపై తమ వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో 1955 కన్నా ముందు ఎన్నో దశాబ్దాలనుంచి నల్ల జాతి పౌరులపై వివక్ష ఉంది. అలాగే గత కొన్నేళ్లుగా సిరియా, లిబియా తదితర దేశాలనుంచి వలసలు సాగుతున్నాయి. ప్రమాదాల్లో ఎందరో మరణిస్తున్నారు. అయినా అయలాన్ కుర్దీ ఉదంతమే అందరినీ కదిలించింది. శరణార్ధుల సమస్యకు తాత్కాలికంగానైనా ఒక పరిష్కారాన్ని చూపింది.
నిరసన తెలిపిన రచయితలు, కళాకారులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వగైరాలు వ్యక్తంచేసిన ఆందోళనకూ...మూడీస్, నారాయణమూర్తి, కిరణ్ మజుందార్ షా, రఘురాంరాజన్ తదితరులు ప్రస్తావించిన అంశాలకూ చాలా తేడా ఉంది. ఈ రెండు వర్గాలూ దేశంలో పెరిగిపోతున్న అసహనం గురించే మాట్లాడినా ఆ సమస్యను చూసిన తీరు వేరుగా ఉంది. శతాబ్దాలుగా ఈ దేశంలో ఉన్న నాగరికత, అది అందజేసిన విలువలు ఛిద్రమవుతున్నాయన్న ఆందోళన రచయితలు, కళాకారులు తదితరుల్లో వ్యక్తమైంది.
ఉన్మాద మూకల దాడులు ఇలాగే కొనసాగితే అంతిమంగా ప్రజాస్వామ్యం పతనం కావడానికి దారితీస్తుందని వారు హెచ్చరించారు. నారాయణమూర్తి, కిరణ్ మజుందార్ షా, రఘురాం రాజన్‌లది వేరే తరహా ఆందోళన. ఘర్షణ వాతావరణం, కొందరు భయాందోళనలతో కాలం వెళ్లబుచ్చే పరిస్థితులు ఆర్ధికాభివృద్ధికి ఆటంకాల వుతాయన్నది వారి భావన. రఘురాం రాజన్ చెప్పిన మాటలు గమనించదగ్గవి. భిన్నాభిప్రాయాలను గౌరవించడం, సహనంతో మెలగడం ఆర్థిక పురోగతికి దోహదపడతాయనడమే కాదు...వీటిని కాపాడుకోవడానికి పోరాడవలసిన అవసరం ఉన్నదని కూడా ఆయన నొక్కిచెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి, రెపో, రివర్స్ రెపో రేట్ల గురించీ...వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల గురించి మాత్రమే ప్రస్తావించే అలవాటున్న రాజన్ చేత విలువల గురించి కూడా మాట్లాడించిన ఘనత బీజేపీ నేతలదే.
దాద్రిలో గొడ్డు మాంసం తింటున్నారని అనుమానం వచ్చి ఒక ముస్లింను దుండగులు పొట్టనబెట్టుకున్నాక అదే తరహాలో రెండు ఘటనలు జరిగాయి. అంతక్రితం తమిళనాడులో రచయిత పెరుమాళ్ మురుగన్‌ను వేధించడం, క ర్ణాటకలో సాహితీవేత్త కల్బుర్గిని కాల్చిచంపడం వంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ విడివిడిగా చూడగలగటం గొప్ప స్థిత ప్రజ్ఞతే కావొచ్చు...దాన్ని బీజేపీ నేతలు, సంఘ్ పరివార్ నేతలు సాధించి ఉండొచ్చు. కానీ మిగిలినవారెవరూ అలా చూడటం లేదు. వీటన్నిటి వెనకా ఒక రకమైన ధోరణి ఉన్నదని భావిస్తున్నారు. వ్యాపార ప్రపంచం హెచ్చరించాకైనా ఆ నేతలు వాస్తవాలను గ్రహించాలి. పరిస్థితిని చక్కదిద్దాలి.
ఈసారైనా వింటారా?!
Published Tue, Nov 3 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM
Advertisement
Advertisement