మైన్మార్‌కు మంచిరోజులు?
ఏడాది తరువాత జరిగే మైన్మార్ సాధారణ ఎన్నికల గురించి పరిశీలకులు అప్పుడే ఆశావహమైన అంచనాలకు వస్తున్నారు. ప్రపంచ పటంలో ‘అస్పృశ్య దేశం’ మైన్మార్ రూపురేఖలు 2015 ఎన్నికల తరువాత సంపూర్ణంగా మారిపోవ చ్చుననిపించే రీతిలో పరిణామాలు వరసగా జరుగుతున్నాయి. రెండు వారాల తరువాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరపనున్న మైన్మార్ చరిత్రా త్మక పర్యటన ఈ పరిణామాలను వేగవంతం చేస్తోంది.
ఒబామా పర్యటన ఖరారు కాగానే, దేశ అధ్యక్షుడు థీన్‌సీన్ ఆగమేఘాల మీద అక్టోబర్ 31న సైనికాధికారులతోను; విపక్షనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసి (ఎన్‌ఎల్‌డీ) అధ్యక్షురాలు అంగ్‌సాన్ సూకీతో చర్చల ప్రక్రియ ప్రారంభిం చారు. దేశ అధ్యక్ష స్థానానికి పోటీ చేయడంపై సూకీ మీద ఉన్న ఆం క్షలను సడలించడానికి పార్లమెంట్ సుముఖత వ్యక్తం చేయడం మరో పరిణామం. నిజానికి 2015 ఎన్నికలలో ఎన్‌ఎల్‌డీ విజయం ఖాయమని తేలిపోయింది. ఈ పరిణామాలన్నీ సూకీని అధ్యక్షపీఠం వైపు నడిపించేవే.
అసలే వెనుకబాటుతనం, ఆపై సైనిక నియంతృత్వం. ఇవి రెండూ కలసి మైన్మార్‌ను ప్రపంచ పేదదేశాలలో ఒకటిగా మిగిల్చాయి. ఆసియాలో రాజ్యాలలో బర్మా లేదా మైన్మార్ పేదరికానికి చిరునామాగా కనిపిస్తుంది. 1962 నుంచి 2011 వరకు జుంటా పేరుతో పిలిచే సైనిక పాలనే అక్కడ సాగింది. హక్కులన్నింటినీ హరించడమే కాదు, బాల కార్మిక వ్యవస్థకు కూడా జుంటా వత్తాసు పలికింది. అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వచ్చినా సైనిక పాల కులు లొంగలేదు. ఆంక్షలను లెక్కచేయలేదు. జుంటా ఏలుబడిలో ఆ చిన్నదేశం అవినీతి మయమైపోయింది.
వీటన్నిటి పర్యవసానం ఏమిటో 1990లో మొద టిసారి జుంటా అనుభవానికి వచ్చింది. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నిక లలో సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. కానీ ఈ ప్రజా విజయాన్ని కూడా సైనిక పాలకులు చెరబట్టారు. ఈ రెండు దశాబ్దా లలో మళ్లీ అక్కడ 2010 లోనే ఎన్నికలు జరిగాయి. వాటి తీరుతెన్నులు ప్రపం చాన్ని నివ్వెరపరిచాయి. ఈ ఎన్నికలకు ఎన్‌ఎల్‌డీ దూరంగా ఉంది.
అయినా సూకీతో పాటు, ఆ పార్టీ ప్రముఖలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీనికి తోడు దారుణమైన అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. సైనిక పాలకులు దేశం మీద రుద్దిన యూనియన్ సాలిడారిటీ డెవలప్‌మెంట్ పార్టీ వీర విహారం చేసింది. పేరుకే ప్రజా ప్రభుత్వం అనదగిన కీలుబొమ్మ సర్కారును జుంటా ఏర్పాటు చేసింది. దీని నాయకుడే థీన్‌సీన్. 2011 మార్చి లోనే ఇతడిని సైనిక పాలకులు ప్రధాని పదవిలో ప్రతిష్టించారు. థీన్‌సీన్ కూడా మాజీ సైనికాధికారే.
థీన్‌సీన్‌ను ప్రధానిగా ప్రతిష్టించడానికి చాలా ముందే అంటే, 2008లోనే జుంటా రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చేసింది. ఆ మార్పుల వెనుక సూకీ రాజకీయ భవితవ్యానికి శాశ్వతంగా సమాధి కట్టాలన్న కుట్ర ఉంది. విదే శీయులతో వైవాహిక బంధం ఉన్నా, లేదా వారితో సంతానాన్ని కన్నా అలాం టివారు అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఈ రాజ్యాంగం నిరోధిస్తుంది. పార్ల మెంటులో పావు శాతం స్థానాలను సైనిక పాలకులకు కేటాయించడంతో పా టు, దేశీయ వ్యవహారాలు, రక్షణ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కూడా 2008 రాజ్యాంగ సవరణలు సైనికులకే రిజర్వు చేశాయి. ఇంత తీవ్ర స్థాయిలో బిగించిన పట్టు 2011 నుంచి సడలిపోవడం మొదలైంది.
ఆ ఏడా దిలోనే అమెరికా విదేశ వ్యవహారాలమంత్రి హిల్లరీ మైన్మార్ వచ్చారు. ఇక 2012లో జరిగిన ఉప ఎన్నికలలో మొత్తం స్థానాలన్నీ సూకీ పార్టీయే గెలుచు కుంది. అప్పుడే ఆమె కూడా ఎంపీగా గెలిచారు. ఇది జరిగిన సంవత్సరమే ఒబామా సందర్శించారు. ఇప్పుడు ఒబామా మరోసారి తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మైన్మార్ వెళుతున్నారు. తన పర్య టన గురించి మైన్మార్ ప్రధాని సీన్‌కు తెలియజేస్తూ, 2015లో జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పడం విశేషం. ఇది జరిగిన మరునాడే రాజధానిలో ప్రధాని సీన్ సూకీ, సైనిక పాలకులతో చర్చలు జరి పారు. 2012లో ప్రారంభమైన ప్రజాస్వామ్య ప్రతిష్ట ప్రక్రియ 2015 కైనా పూర్తయితే ఆ పేద దేశం ఒక్క అడుగైనా ముందుకు వేయగలుగుతుంది.