ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే పనిలోకి దిగిపోయారు నరేంద్ర మోడీ. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన సార్క్ దేశాల అధినేతలతో చర్చల పరంపర కొనసాగించి కొత్త సంప్రదాయానికి శ్రీకారంచుట్టారు. అయితే, వీరందరిలోనూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆయన జరిపిన భేటీకి సహజంగానే ఎనలేని ప్రాముఖ్యత వచ్చింది. ఇతర దేశాలతో ఎలాంటి సమస్యలున్నా, వాటి పరిష్కారానికి మన ప్రభుత్వం ఏంచేస్తున్నా పెద్దగా పట్టనివారికి కూడా పాకిస్థాన్‌తో సంబంధాల విషయమై అంతటి ఆసక్తి ఉండటానికి కారణం... అది మన దాయాది దేశం కావడమే. పాకిస్థాన్‌తో మన సంబంధాలు నిలకడగా, ఒకేలా ఎప్పుడూ లేవు. ఎప్పుడూ ఆటుపోట్లే. ఆశారేఖ తళుక్కున మెరిసిన ఉత్తర క్షణంలోనే అధీనరేఖ వద్ద ఏదో ఒక ఘర్షణ లేదా చొరబాట్లు. ఈ రెండూ లేకపోతే జమ్మూ-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడులు. మళ్లీ పరస్పర ఆరోపణలు, హెచ్చరికలు. కొన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చల పేరిట ఏదో కదలిక. మళ్లీ కొత్త ఆశలు...చెలిమి ఊసులు. అటు తర్వాత షరా మామూలే. గత ఆరు దశాబ్దాలనుంచీ ఇదే పదే పదే పునరావృత మవుతున్నది. అయితే, ఈ స్థితి మారగలదని, రెండు దేశాలూ వైషమ్యాలను విడనాడి కలసి ముందుకు సాగడానికి, ఎదగడానికి సమష్టిగా ప్రయత్నిస్తాయని ఇరు దేశాల్లోని శాంతి కాముకులు విశ్వసిస్తూనే ఉన్నారు. అలాంటివారి విశ్వాసాన్ని పెంచేలా మోడీ తొలి అడుగులున్నాయి. ఇరుగుపొరుగుతో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి తాము కృషి చేస్తామన్న సందేశాన్ని దేశ ప్రజలకే కాదు...ప్రపంచానికి కూడా చాటిచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. కనుకనే ప్రమాణ స్వీకారోత్సవాన్ని మోడీ ఇందుకు ఒక సందర్భంగా ఉపయోగించుకున్నారు.
భారత్‌లో అడుగుపెడుతూ తాను శాంతి సందేశంతో వచ్చానని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. 1999లో వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇరుదేశాల మధ్యా మెరుగైన సంబంధాలున్నాయని, ప్రస్తుత ప్రధాని మోడీ కూడా బీజేపీకి చెందినవారే కావడంవల్ల మళ్లీ ఆనాటి స్థితి ఏర్పడవచ్చునని ఆయన అంచనావేశారు. అయితే, వాజపేయి నెరపిన బస్సు దౌత్యం తర్వాతే కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి వగైరా జరిగాయన్న సంగతిని ఎవరూ మరిచిపోలేరు. ఇరుప్రాంతాల్లోనూ పరస్పర విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులు ఉన్నాయి. మోడీ ఆహ్వానాన్ని నవాజ్ షరీఫ్ అంగీకరించడానికి వీల్లేదంటూ లష్కరే తొయిబావంటి సంస్థలు డిమాండ్ చేయడం, కొన్ని సంస్థలైతే ఢిల్లీకి వెళ్లి మళ్లీ తిరిగి రావొద్దని హెచ్చరించడం అందులో భాగమే. అయితే, పాకిస్థాన్‌తో వచ్చిన సమస్యేమంటే ఇలాంటి శక్తులు అక్కడి సైన్యంలోనూ, దాని గూఢచార సంస్థ ఐఎస్‌ఐలోనూ పుష్కలంగా ఉన్నాయి. పలు ఉగ్రవాద సంస్థలు వారి చెప్పుచేతల్లో నడుస్తాయి. సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఆశించిన ప్రతిసారీ శాంతిని భగ్నంచేసేలా సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకోవడం ఇందువల్లే. అక్కడి సైన్యం రాజకీయ నాయకత్వానికి లోబడి కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని చూస్తుంటుంది. భారత్‌తో సంబంధాల విషయమై తన మాటే నెగ్గాలనుకుంటుంది. ఇది ఇరు దేశాల సంబంధాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. నిరుడు పాక్‌లో నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక న్యూయార్క్‌లో ఇరు దేశాల ప్రధానులమధ్యా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడటానికి సమష్టిగా కృషిచేద్దామని ఆ చర్చల్లో నిర్ణయించారు. అధీనరేఖ వద్ద కాల్పుల విరమణ కొనసాగించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏం చేయాలో తేల్చడానికి ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) సమావేశంకావాలని నిర్ణయించారు. కానీ, అలాంటి సమావేశం జరిగేలోపే పాక్ భూభాగం వైపునుంచి చొచ్చుకొచ్చిన మిలిటెంట్లు రెండుచోట్ల దాడిచేసి నలుగురు జవాన్లతోసహా 12మందిని కాల్చిచంపారు. సహజంగానే ఇరుదేశాల సంబంధాలూ మళ్లీ మొదటికొచ్చాయి.
పాకిస్థాన్‌తో గతంలో ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నందువల్లే ఇప్పుడు జరిగిన చర్చలపై పెదవి విరుస్తున్నవారున్నారు. అయితే, ఇరుగుపొరుగు దేశాలన్నాక ఇలాంటి సమస్యలు తప్పవు. వాటి పరిష్కారానికి వివిధ మార్గాల్లో ఓపిగ్గా కృషి చేయడమే పరిష్కారం తప్ప అవి మరింతగా విషమించేలా వ్యవహరించకూడదు. ఆ కోణంలోనుంచి చూస్తే ఇప్పుడు జరిగిన చర్చలు వెనువెంటనే ఫలితాన్నివ్వకపోయినా ఆ దిశగా ఎంతో కొంత ముందడుగు అవుతాయని చెప్పవచ్చు. సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని, అధీనరేఖ వద్ద ఘర్షణల అంతానికి కృషిచేయాలని, ముంబై దాడులకు బాధ్యులైన వారిపై సాగుతున్న విచారణ ఒక కొలిక్కివచ్చేలా చూడాలని షరీఫ్‌కు మోడీ సూచించారంటున్నారు. పాకిస్థాన్ తన వంతుగా కాశ్మీర్‌తో సహా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటిపైనా చర్చలు సాగాలని కోరినట్టు తెలుస్తున్నది. ఇందుకోసమని ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు త్వరలోనే సమావేశం కావాలని కూడా ప్రధానులిద్దరూ నిర్ణయించారు. ఈ సమావేశం స్ఫూర్తితో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు, ముఖ్యంగా వాణిజ్యబంధానికి కృషిచేద్దామని షరీఫ్ అంటున్నారు. రెండు దేశాల సంబంధాలకూ ముఖ్య అవరోధంగా ఉన్నది ఉగ్రవాదమే. దీన్ని అరికట్టడానికి షరీఫ్ చిత్తశుద్ధితో కృషిచేస్తే మిగిలిన సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. రెండు దేశాల ప్రగతికీ బాటలు పరుస్తాయి. ఇరుదేశాల సంబంధాల్లోనూ నూతనాధ్యాయం ఆవిష్కృత మవుతుంది. రాగలరోజుల్లో పాకిస్థాన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తుందని ఆశిద్దాం.
మళ్లీ స్నేహ వీచిక!
Published Wed, May 28 2014 11:07 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement