పవ‘నిజానిజాలు!’ | Pawan kalyan announces his new party as name of Jana Sena party | Sakshi
Sakshi News home page

పవ‘నిజానిజాలు!’

Published Sun, Mar 16 2014 12:24 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan kalyan announces his new party as name of Jana Sena party

సంపాదకీయం: గత కొన్నిరోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ సినీనటుడు పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పేరిట పార్టీని ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీల ఆవిర్భావం అసాధారణమేమీకాదు. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. భవిష్యత్తులోనూ అవి వస్తాయి. కేరళ వంటి చిన్న రాష్ట్రంలో 20కి పైగా పార్టీలున్నప్పుడు ఇక్కడ మరో పార్టీ రంగప్రవేశం ఆశ్చర్యం కలిగించదు. పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగాలతో నిండివున్నది. అందులో ఆవేశం, ఆగ్రహం, వ్యంగ్య వ్యాఖ్యలు వంటివన్నీ ఉన్నాయి.
 
 ఆయన మంచి నటుడు కూడా కనుక వాటిని రక్తికట్టించగలిగారు. అయితే, భావోద్వేగాలు వాటికవే ఏ పార్టీనైనా నిలబెట్టలేవు. వర్తమాన రాజకీయరంగంలో తన అవసరమేమిటో, తన ఔచిత్యమేమిటో చెప్పవలసిందీ...ప్రజలను ఒప్పించవలసిందీ కొత్తగా ఏర్పడే పార్టీయే. ‘జనసేన’ ఆ విషయంలో స్పష్టతనివ్వగలిగిందా? పార్టీ విధివిధానాలేమిటో, విజన్ ఏమిటో, సిద్ధాంతాలేమిటో పవన్‌కల్యాణ్ చెప్పగలిగారా? అసలు వాటికి సంబంధించిన కసరత్తు జరిగిందా? ఆయన ప్రసంగంనుంచి వీటికి జవాబులు లభించలేదు.
 
 అసలు పార్టీ ఏర్పాటు విషయమై ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయి. ఎందుక ంటే... పవన్‌కల్యాణ్ సినీ కాల్పనిక జగత్తులో వేలాదిమంది ఆరాధించే హీరో మాత్రమే కాదు, మూడు దశాబ్దాలపాటు తెరవేల్పుగా వెలిగిన మరో హీరో చిరంజీవికి స్వయానా సోదరుడు. ఆయన అయిదేళ్లక్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్నాళ్ల తర్వాత దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రతిఫలంగా రాజ్యసభ సీటు, కేంద్రమంత్రిని పదవి పొందారు. ప్రజారాజ్యంలో పవన్ సాధారణస్థాయి కార్యకర్త కాదు...ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడు. పైగా, 2009 ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్‌వాళ్లను పంచెలూడదీసి కొట్టండి’ అని పిలుపునిచ్చిన ఆవేశపరుడు. అలాంటి తమ్ముడు అన్నగారు చేసిన పనిపై ఏమనుకున్నారన్న సందేహాలు జనంలో ఎప్పటినుంచో ఉన్నాయి.
 
 నిన్నటి ప్రసంగంలో పవన్ ఈ విషయాలేమీ తడమలేదు. అలాగని ఆయన కాంగ్రెస్‌ను ఉపేక్షించనూలేదు. ‘కాంగ్రెస్ హటావో...దేశ్ బచావో’ అని ఎలుగెత్తారు. దేశంనుంచి ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులంతా ‘నీ బాంచెన్, కాల్మొక్తా’ అని బానిసల్లా ఢిల్లీ పెద్దలముందు సాగిలబడితే వారు రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. అలాంటి కాంగ్రెస్ నాయకుల్లో చిరంజీవి ఉన్నారో, లేదో పవన్ చెప్పలేదు. ‘తండ్రి తరువాత తండ్రిలాంటి అన్నయ్యకు నేనెందుకు ఎదురెళ్తాను? ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ హైకమాండే దీనికి కారణం’ అన్నారు తప్ప ప్రజారాజ్యం విలీనంపైగానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చిరంజీవి రక్షించిన వైనంపైగానీ తన మనోభావాలను అభిమానులతో పంచుకోలేదు.
 
 మరికొన్ని రోజుల్లో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ  ప్రచారబాధ్యతలను చిరంజీవి నెత్తికెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఏ స్థితిలో ఉన్నదో అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు రాష్ట్ర విభజనతో మాత్రమే ఏర్పడ్డ పరిణామం కాదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి అంకితభావంతో కొనసాగించిన అనేకానేక సంక్షేమ పథకాలను ఆయన కనుమరుగయ్యాక అటకెక్కించిన తీరునూ, ఆయన కుటుంబంపై కక్షసాధింపుతో వ్యవహరించిన వైనాన్నీ గమనించాక ప్రజలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. పలు ఉప ఎన్నికల్లో ఈ సంగతి పదే పదే రుజువైంది. ‘సీమాంధ్రలో ఎటూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది... తెలంగాణలోనైనా నాలుగు స్థానాలు రావాలంటే రాష్ట్ర విభజన తప్ప దారిలే’దని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో పార్టీ హైకమాండ్‌కు విన్నవించారు.
 
 రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే...దేశంలో ఇంతకన్నా కనాకష్టమైన స్థితి ఉంది. ఇలా శవప్రాయమైన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టండని, దేశాన్ని రక్షించండని పిలుపునివ్వడంతోపాటు అందుకు ఎవరితోనైనా కలుస్తానని పవన్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా పిలుపునిస్తూనే... జయరాం రమేష్‌నుంచి షిండే వరకూ, దిగ్విజయ్‌నుంచి అహ్మద్ పటేల్ వరకూ అందరినీ విమర్శిస్తూనే...కాంగ్రెస్‌లో కీలకస్థానంలో ఉన్న చిరంజీవి గురించి పవన్‌కల్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదు. అన్నయ్యగా ఆయనపై భక్తిప్రపత్తులుండవచ్చుగానీ ఆయన రాజకీయ వైఖరిని గురించి, ఆయన తీసుకున్న నిర్ణయాలగురించి విమర్శించడానికి అవి అడ్డురావలసిన అవసరంలేదు.
 
  వీటన్నిటి సంగతి అలావుంచి, పవన్ కల్యాణ్ ఎంచుకున్న సమయమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత...ఒక పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశంలేని స్థితి ఏర్పడ్డాక దాన్ని ప్రకటించి ఉపయోగమేమిటన్న సంశయం అందరిలోనూ ఉంది. కొన్ని ఓట్లు చీల్చడమో, మురగబెట్టడమో, వీలైతే ఎవరినైనా ఓడగొట్టడమో మాత్రమే ఆయన చర్యలోని పరమార్థమనుకునేవారూ ఉన్నారు. ఎవరికో పావుగానో, మరెవరి ప్రయోజనమో నెరవేర్చడానికో ఆయన హడావుడిగా రంగ ప్రవేశం చేశారన్న అభిప్రాయమూ ఉంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రశ్నించడానికే తానొచ్చానని పవన్‌కల్యాణ్ చెబుతున్నారు. మంచిదే. అయితే... ‘వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం/పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్న మహాకవి మాటలను ఆయన మననం చేసుకోవాలి. తన ప్రతి మాటా, పలుకూ, కార్యాచరణా...ఇకపై జనం గమనిస్తుంటారని, అన్నిటినీ బేరీజువేసుకుని సూటిగా ప్రశ్నిస్తారని గ్రహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement