
ఈ తీరు సబబేనా?!
రాజ్యం ఔన్నత్యం దాని ప్రకటిత లక్ష్యాల్లో కంటే...ఆ లక్ష్యాలను త్రికరణశుద్ధిగా ఆచరించే తీరులోనే వ్యక్తమవుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ పరిషత్ మాగ్నకార్టా మొదలుకొని అనేక దేశాల రాజ్యాంగాలను విపులంగా అధ్యయనం చేసి మనకొక అపురూపమైన లిఖిత రాజ్యాంగాన్ని అందించింది. కనుక దాన్ని ఆచరించడంలో సందిగ్ధతకు తావుండాల్సిన అవసరం లేదు. అయితే, మావోయిస్టు పార్టీ నేతలుగా, సానుభూతిపరులుగా భావిస్తున్న వారి విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీప గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేసి ఏడాది గడిచింది. ఆయన వృత్తిరీత్యా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా, విశ్వాసాలరీత్యా విప్లవ ప్రజాస్వామిక వేదిక బాధ్యుడిగా ఉన్నారు. ఆ క్రమంలో ఆయన దేశవ్యాప్తంగా జరిగిన అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు. ధర్నాల్లో పాల్గొన్నారు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఎన్నో రచనలు చేశారు. ఇవేవీ ఆయన రహస్యంగా చేసినవి కాదు. చట్టం అనుమతించిన పరిధుల్లో, పరిమితుల్లో చేసినవి. పైగా ఆయన 90 శాతం శారీరక వైకల్యం ఉన్న మనిషి గనుక ఎక్కడికెళ్లాలన్నా చక్రాల కుర్చీయే ఆధారం. ఆయనకు తోడుగా కనీసం ఒకరైనా ఉంటే తప్ప కదల్లేని స్థితి. ఇట్లాంటి స్థితిలో ఉన్న
ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పోలీసులు చెబుతున్నట్టు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అరణ్యంలో మావోయిస్టులతో కలిసి కుట్ర చేశారన్న ఆరోపణ నిజమే అనుకున్నా...ఆ విషయంలో న్యాయస్థానం తీర్పు వెలువరించేంతవరకూ ఆయన నిర్దోషికిందే లెక్క. ఆరో శతాబ్దంలోని రోమన్ లా చెప్పిన ఈ సూత్రం మన రాజ్యాంగంలోని 20(3), 21 అధికరణలద్వారా...నేర శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల ద్వారా వ్యక్తమైంది. ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలోని 11వ అధికరణ చెబుతున్నదీ ఇదే.
అయితే, సాయిబాబా విషయంలో దీన్ని పాటించడానికి నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులకైనా, వారిపై అజ్మాయిషీ చెలాయించే అధికార యంత్రాంగానికైనా అభ్యంతరం ఉండవలసిన అవసరం ఏమిటో అర్థంగాని విషయం. ఆయనకు అంగవైకల్యంతోపాటు గుండెజబ్బు, నరాల క్షీణత, వెన్నెముక సంబంధ వ్యాధి, రక్తపోటు వంటివి ఉన్నాయి. అలాంటి వ్యక్తిని గాలి, వెలుతురు చొరబడని అండా సెల్‌లో నిర్బంధించమంటే న్యాయస్థానం శిక్ష ప్రకటించకముందే దాన్ని అమలు చేయడం. సాయిబాబాకు అవసరమైన మందులు సైతం అందుబాటులో ఉంచడంలేదని, తక్షణం చికిత్స అందకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుందని వచ్చిన ఫిర్యాదును పిటిషన్‌గా స్వీకరించి బొంబాయి హైకోర్టు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది.
అంతక్రితం సాయిబాబా గురించి టీఆర్‌ఎస్ ఎంపీ కె. కేశవరావు, మరో ఆరుగురు ఎంపీలు కేంద్ర హోంమంత్రిని కలిసినా ఫలితం లేకపోయిందని విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి...అందునా శారీరకంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా?
అయిదేళ్ల క్రితం అరెస్టయిన మావోయిస్టు పార్టీ నాయకుడు కోబాడ్ గాంధీ విషయంలోనూ తీహార్ జైలు అధికారులు ఈ తీరులోనే వ్యవహరించారు. కిడ్నీలకు సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న తనకు అవసరమైన మందులు, చికిత్స అందించకుండా...తరచుగా ఒక సెల్‌నుంచి మరో సెల్‌కు మారుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన గత నెల 30నుంచి నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆయన విషయంలో కూడా న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆదేశాలివ్వాల్సివచ్చింది. ఇద్దరిపైనా పోలీసులు మావోయిస్టులని ఆరోపణలు చేసినా సాయిబాబా యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేస్తూ అరెస్టయిన వ్యక్తి. కోబాడ్ గాంధీ అజ్ఞాతంలో ఉండగా పట్టుబడినవారు. వీరిద్దరి విషయంలోనూ న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చాయంటే అధికార యంత్రాంగం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించలేదనే అర్ధం. మావోయిస్టుల సిద్ధాంతంతో ఏకీభావం లేనివారు సైతం ఈ తీరును సమర్థించలేరు.
మావోయిస్టులు లేదా వారి సానుభూతిపరుల విషయంలో కఠినంగా ఉంటే మిగిలినవారు భయపడి అలాంటి ఆచరణకు దూరంగా ఉంటారని ప్రభుత్వాలు భావిస్తున్నట్టు కనబడుతోంది. వాస్తవానికి మన రాజ్యాంగంలోని నాలుగో విభాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పాటిస్తే అన్నీ సక్రమంగా ఉంటాయి. సమస్యంతా వాటిని పట్టించుకోకపోవడంలోనే ఉంది. ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం లభించేలా, ఆదాయ వ్యత్యాసాలను పారదోలే విధంగా ప్రభుత్వ విధానాలుండాలని... పౌరులందరికీ అవసరమైన జీవికను కల్పించాలని... స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు, సమాన పని పరిస్థితులు ఉండేలా చూడాలని ఆదేశిక సూత్రాలు చెబుతాయి. భూ సంస్కరణలు సక్రమంగా అమలైతే, అడవుల్లోని ఆదివాసీల జీవికకు ఎసరు తెచ్చే విధానాలకు స్వస్తి పలికితే... సంక్షేమ రాజ్య సాధనకు ప్రభుత్వాలు కట్టుబడి ఉంటే సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తవు. వాటిని ఆసరా చేసుకుని బయల్దేరే సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఉండవు.
ఆదేశిక సూత్రాల అమలులో విఫలమవుతూ...అణచివేతనే పరిష్కారంగా ఎంచుకుంటే సమస్యలింకా పెరుగుతాయి తప్ప తరగవు. మహా నగరాల్లోని జైళ్లలో నిర్బంధంలో ఉన్న వ్యక్తుల విషయంలోనే ఇలా ఉంటే ఎక్కడో అడవుల్లో తమపై కాల్పులకు తెగబడిన 19 ఏళ్ల వివేక్ అనే యువకుణ్ణి ఎదురు కాల్పుల్లో హతమార్చామని పోలీసులు చెబితే ఎవరైనా నమ్మగలరా? అతను తప్పే చేసివుంటే అరెస్టుచేసి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి సక్రమ మార్గంలో పెట్టవచ్చు కదా అని అంటున్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ప్రభుత్వాలిచ్చే జవాబేమిటి?
స్వాతంత్య్రం వచ్చాక ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో మన ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంవల్లే అటవీ ప్రాంతాల్లో నక్సల్ ఉద్యమం వేళ్లూనుకుంది. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారి విషయంలో చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. కానీ ఆ మాటున రాజ్యాంగ విలువలకూ, చట్టబద్ధ పాలనకూ తిలోదకాలిస్తే హర్షించరు. జవాబుదారీ తనం, పారదర్శకత పాలనకు వన్నె తెస్తాయి. వాటికి పాతరేసే విధానాలవల్ల ప్రపంచంలో మనం పలచనవుతాం. పాలకులు ఈ సంగతిని గుర్తించాలి.