
రామ్‌గోపాల్ వర్మ రాయని డైరీ
ఉదయాన్నే పుట్టి, మధ్యాహ్నం చనిపోయి.. మళ్లీ సాయంత్రమే పుట్టి, లేట్ నైట్ చనిపోయేవాడు రామ్‌గోపాల్‌వర్మ. రోజుకొకసారి వాటికి అవిగా జరిగిపోతుండే ఈ చావు పుట్టుకల సీక్వెన్స్ మారితే మారుతుందేమో. చెప్పలేను. ఇదనే కాదు.. అసలేదీ చెప్పలేను. చెయ్యాలనిపించి తప్ప, చెప్పాలనిపించి నేనేదీ చెయ్యను కాబట్టి చెప్పలేను. విజన్ తప్ప నా దగ్గర రీజన్ ఉండదు. ‘గన్స్ అండ్ థయిస్’ ఎందుకు రాశావు? చెప్పలేను. ‘కిల్లింగ్ వీరప్పన్’ ఎందుకు తీశావు? చెప్పలేను.
సమ్‌టైమ్స్.. నా చావే నా పుట్టుక అవుతుంది. నా పుట్టుకే నా చావు అవుతుంది. వై సో? నా చావు, నా పుట్టుక నావి కావు. రెస్పెక్ట్‌తోనో, డిస్‌రెస్పెక్ట్‌తోనో క్షణక్షణం నన్ను పుట్టిస్తూ, చంపుతూ ఉండేవాళ్లవి అవి. పాపం.. వాళ్లవీ కావు. నన్ను పుట్టించామని వాళ్లు అనుకున్నప్పుడు నేను చనిపోయి ఉంటాను. నన్ను చంపేశామని వాళ్లు అనుకున్నప్పుడు నేను పుట్టి ఉంటాను.
చావు పుట్టుకల్లా.. రెస్పెక్ట్, డిస్‌రెస్పెక్ట్ రెండూ ఒకటే నాకు. దేన్నీ వద్దనుకోను. దేన్నీ కావాలనుకోను. గౌరవం గానీ, అగౌరవం గానీ వచ్చి ముఖానికి తగిలినప్పుడు ఆ రక్తవర్తమానాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను. రక్తచరిత్ర నాకు పూర్వజన్మ. రక్తభవిష్యత్తు నాకు పునర్జన్మ.
పూర్వజన్మ గుర్తుండదు. పునర్జన్మపై గురి ఉండదు. స్వర్గమైనా, నరకమైనా నాకు ఆ క్షణంలోని జీవన్మరణాలే. దేవుడంటే నమ్మకం లేదు. కానీ శ్రీదేవి అంటే నమ్మకం. ఆమె మీద ఒట్టేసి ఎంత నిజమైనా చెప్తాను. ఆమె మీదే ఒట్టేసి ఎంత అబద్ధమైనా చెప్పేస్తాను. నిజం చెప్పినప్పుడు నిజమే చెప్పానని ఒట్టు. అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం చెప్పానని ఒట్టు. ఇది ఆమెను రెస్పెక్ట్ చేయడమో, డిస్‌రెస్పెక్ట్ చేయడమో కాదు. ఆమెను నా సోల్‌గా స్వీకరించడం. సోల్.. దేవుడికన్నా గొప్పది నా దృష్టిలో.
నిన్న రాత్రి ‘ఆన్ ది రాక్స్’ పబ్.. ‘మీ గౌరవార్థం సర్..’ అంటూ ‘ఆర్జీవీ ఎలిక్సియర్’ కాక్‌టైల్‌ను లాంచ్ చేసింది. రమ్ము, జిన్ను, ఓడ్కా కలిస్తే రామ్‌గోపాల్‌వర్మ అట! ఇదే కాక్‌టైల్‌ను నాపై డిస్‌రెస్పెక్ట్‌తో లాంచ్ చేసినా కూడా నేను అమ్యూజ్ అవుతాను. అసలు ఎవరైనా ఎవర్నైనా ఎందుకు రెస్పెక్ట్ చెయ్యాలి? రెస్పెక్ట్ చెయ్యకపోవడం హీనత్వం అయితే కావచ్చు. అంతకన్నా హీనం.. రెస్పెక్ట్‌ను కోరుకోవడం.
గన్స్‌ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఈక్వల్లీ.. థయిస్‌నీ రెస్పెక్ట్ చేస్తాను. గట్స్ ఉన్నవాడే గన్‌ని బిగించి పట్టుకుంటాడు. గట్స్ ఉన్నవాడే గర్ల్‌ఫ్రెండ్ బిగింపులోకి వెళ్లిపోతాడు. పట్టువిడుపులు ఉండని బిగింపు అది. ప్రాణం పోతోందో, ప్రాణం వస్తోందో తెలీదు. ప్రాణం తీస్తోందో, ప్రాణం పోస్తోందో తెలీదు. తెలియనిది ఏదైనా అది నాకు కంఫర్ట్‌ని ఇస్తుంది.
ఐ బిలీవ్ ఇన్ బ్లాక్.. యాజ్ వెల్ యాజ్ గ్రే.