సత్వర న్యాయం కీలకం
దేశ ప్రజలనే కాదు...యావత్ ప్రపంచాన్నీ దిగ్భ్రమపరిచిన 2002నాటి గుజరాత్ మారణకాండకు సంబంధించిన కేసుల్లో ఒకటైన గుల్బర్గ్ సొసైటీ కేసులో 11మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ...మరో 13మందికి వేర్వేరు రకాల శిక్షలు విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎంతమంది దోషులుగా తేలారో వెల్లడిస్తూ న్యాయస్థానం మొన్న రెండో తేదీన తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న మరో 36మంది నిర్దోషులని భావించి విడుదల చేసింది. శిక్షల ఖరారును శుక్రవారం ప్రకటించింది. గోధ్రాలో 2002లో సబర్మతీ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 58మందిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశాక ఆ రాష్ట్రమంతటా వ్యాపించిన మారణకాండ దాదాపు పదిహేను వందల మందిని బలితీసుకుంది.
వీరిలో అత్యధికులు ముస్లింలు. కొన్ని రోజులపాటు సాగిన ఆ ఊచకోతను పౌర, పోలీస్ యంత్రాంగం నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోవ డమే కాక...పరోక్షంగా ప్రోత్సాహం కూడా అందించిందని ఆరోపణలొచ్చాయి. ఈ మారణకాండకు సంబంధించి నమోదైన అనేక కేసుల్లో తొమ్మిది సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. వాటిల్లో ఇంతవరకూ 8 కేసుల్లో తీర్పు వెలువడింది. అందులో గుల్బర్గ్ సొసైటీ మారణకాండ కేసు ఒకటి. ఆ ఉదంతంలో 69మంది ముస్లింలు సజీవదహనమయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎషాన్ జాఫ్రీ అందులో ఒకరు. ఇప్పుడు శిక్ష పడిన 24మందిని కలుపుకుంటే గుజరాత్ మారణకాండకు సంబం ధించిన వివిధ కేసుల్లో శిక్షపడిన వారి సంఖ్య 140కి చేరింది. ఒక్క గుల్బర్గ్ సొసైటీ ఉదంతంలో పాల్గొన్నవారే 400మంది ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా సుప్రీం కోర్టు నియమించిన సిట్ 60మందిని నిందితులుగా నిర్ధారించగలిగింది.
మన దేశంలో మత కల్లోలాలు కొత్తగాదు. గుజరాత్ మారణకాండకు ముందూ, తర్వాతా చాలా జరిగాయి. 1946లో జరిగిన బిహార్ మతకల్లోలాలు మొదలుకొని మొరాదాబాద్(1980), నెల్లి(1983), హిషింపురా(1987), భగల్పూర్ (1989), బొంబాయి(1992) వరకూ ఎన్నో ఉన్నాయి. రెండేళ్లనాటి అస్సాం ఊచ కోత ఆ ఉదంతాలకు ముగింపు లేదని నిరూపించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని నగరంలో కాంగ్రెస్ నేతల ప్రాపకంతో జరిగిన సిక్కుల ఊచకోతను ఎవరూ మరిచిపోలేరు. ఈ కేసులన్నిటా దర్యాప్తు, విచారణ ఏళ్లతరబడి సాగడం రివాజైంది. ఆలస్యంగా లభించే న్యాయం అన్యాయంతో సమా నమంటారు. ఈ మారణకాండ కేసుల్లో చాలా సందర్భాల్లో జరుగుతున్నది అదే. ఇప్పుడు గుల్బర్గ్ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టి పనిచేసిన పౌర సమాజ కార్యకర్త తీస్తా సెతల్వాడ్ తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన నిందితులను వదిలేయడంపై అప్పీల్‌కి వెళ్తామని ప్రకటించారు. గుల్బర్గ్ సొసైటీ ఉదంతంలో సజీవదహనానికి గురైన తన భర్త ఎషాన్ జాఫ్రీకి తీరని అన్యాయం జరిగిందని ఆయన భార్య జకియా జాఫ్రి అంటున్నారు.
స్వతంత్ర భారతంలో జరిగిన మిగిలిన మారణకాండలకూ, 2002నాటి గుజరాత్ మారణకాండకూ తేడా ఉంది. ఇతర ఉదంతాలకు స్థానికులు మాత్రమే ప్రత్యక్ష సాక్షులుగా ఉంటే గుజరాత్ మారణకాండ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైంది! అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకొస్తున్న న్యూస్ చానెళ్ల పుణ్యమా అని ఆ దురంతాన్ని లక్షలాదిమంది చూశారు. అయినా అధికార యంత్రాంగాన్ని కదిలించడంలో, ఆ మారణకాండను నియంత్రించడంలో అది ఏ మాత్రం తోడ్పడ లేకపోయింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని కేసులనైతే తానే పర్యవేక్షించాల్సివచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించడం, కింది కోర్టుల్లో విచారణ సక్రమంగా లేదని భావించి పునర్వి చారణకు ఆదేశించడం, కొన్ని కేసుల విచారణను పొరుగు రాష్ట్రాలకు బదిలీ చేయడం వంటివన్నీ చోటుచేసుకున్నాయి. దర్యాప్తు బృందాలు, కింది కోర్టులు నిందితులకు సహకరి స్తున్న జాడలు కనిపిస్తున్నాయని ఒకటి రెండు కేసుల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. కొందరు పోలీస్ ఉన్నతాధికారులైతే... ఈ మారణ కాండను చూసీచూడ నట్టు వదిలేయమని తమకు ఆదేశాలందాయని ఆరోపించారు.
జాతి మొత్తం సిగ్గుపడాల్సిన ఇలాంటి ఉదంతాల విషయంలో అధికార యంత్రాంగం చూపుతున్న అలసత్వమూ, నిర్లక్ష్యమూ క్షమించరానివి. కారణమే దైనా నడివీధుల్లో ఉన్మత్త మూకలు చెలరేగడాన్ని తేలిగ్గా తీసుకోవడమంటే అలాంటివి మళ్లీ మళ్లీ జరగడానికి ఆస్కారమీయడమే. సర్వోన్నత న్యాయస్థానం అనేకసార్లు చీవాట్లు పెట్టినా, హెచ్చరికలు జారీచేసినా గుజరాత్ పోలీసులు కర్తవ్య నిర్వహణలో పదే పదే విఫలమయ్యారు. గుల్బర్గ్ సొసైటీ మారణకాండ పౌర సమాజ చరిత్రలో చీకటి అధ్యాయమని అభివర్ణించిన న్యాయమూర్తి దీని వెనక కుట్ర ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించలేకపోయారు. ఆ సంగతిని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంవల్ల ఆయన ఆ అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చుగానీ పథక రచన లేకుండా...సూత్రధారులు, తెరవెనక సహాయ సహకారాలు అందకుండా ఇలాంటివి సాధ్యపడవు.
ఈ కేసు సంగతలా ఉంచి గతంలో జరిగిన అనేక ఊచకోత ఉదంతాల్లో ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్‌లు లోతుగా విచారించి విలువైన నివేదికలిచ్చాయి. దోషులెవరో నిర్ద్వం ద్వంగా నిర్ధారించాయి. అయినా తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కనుకనే అలాంటివి పునరావృతమవుతున్నాయి. మన ప్రజా స్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నాయి. అయినవారిని కోల్పోయి, సర్వస్వం పోగొట్టుకుని వేలాది కుటుంబాలు ఈనాటికీ రోదిస్తున్నాయి. అలాంటివారికి న్యాయం లభించాలనీ, మానవత్వాన్ని మంటగలిపిన ముష్కరులకు కఠిన శిక్షపడా లనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. న్యాయం ఇకనుంచి అయినా వడివడిగా అడుగు లేయాలని ఆశిస్తారు.