కటోవీస్‌ దారిలోనే మాడ్రిడ్‌! | Sakshi Editorial Article On Madrid COP 25 Summit | Sakshi
Sakshi News home page

కటోవీస్‌ దారిలోనే మాడ్రిడ్‌!

Published Fri, Dec 20 2019 12:06 AM | Last Updated on Fri, Dec 20 2019 12:06 AM

Sakshi Editorial Article On Madrid COP 25 Summit - Sakshi

పారిస్‌ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై చరిత్రాత్మక ఒడంబడిక కుదిరినప్పటినుంచీ దాన్ని ఉల్లంఘించడమే ధ్యేయంగా పనిచేస్తున్న దేశాలకు ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే  కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌) సదస్సులు తప్పనిసరి లాంఛనం. ఈనెల 2 నుంచి 15 వరకూ స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌లో జరిగిన కాప్‌–25 సదస్సు కూడా ఆ కోవలోనిదే. దాదాపు 200 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పారిస్‌ శిఖరాగ్ర సదస్సు ఆమోదించిన ఒడంబడిక 2030నాటికి అన్ని దేశాలూ 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని తగ్గించాలని నిర్దేశించింది. ఆ దిశగా ఏ దేశం ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకుంటున్నదో, ఆచరణలో అవి ఏవిధంగా సాగుతున్నాయో, సాఫల్యవైఫల్యాలేమిటో సమీక్షించడం కాప్‌ సదస్సుల ధ్యేయం. కానీ ఏడాది పొడవునా నిర్వా్యపక త్వంతో ఉండిపోయి, ఈ సదస్సులకు ప్రతి దేశమూ ముఖాలు వేలాడేసుకు వస్తున్నాయి. సాధించిం దేమీ లేక, చెప్పడానికేమీ మిగలక తదుపరి కాప్‌ సదస్సుకు చర్చలను వాయిదా వేసుకుని తిరుగు ముఖం పడుతున్నాయి.

తమ చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ సదస్సులను అనుకున్న కంటే మరో రెండురోజులో, నాలుగురోజులో, వారంరోజులో పొడిగించడం, ఏదో జరుగు తోందన్న అభిప్రాయం ప్రపంచ పౌరుల్లో కలిగించడం దేశాలు అనుసరించే ఎత్తుగడ. వాస్తవానికి కాప్‌–25 సదస్సుకు తాము ఆతిథ్యమిస్తామని రెండేళ్లక్రితం చెప్పిన బ్రెజిల్‌ అక్కడ ప్రభుత్వం మారాక నిరుడు మాట మార్చింది. దాంతో ఆ వేదికను చిలీ రాజధాని శాంటియాగోకు మార్చవలసి వచ్చింది. అయితే ఉద్యమాలతో అట్టుడుకుతున్న చిలీ ఈ సదస్సును నిర్వహించే స్థితిలో లేకపోవడంతో అది కాస్తా మాడ్రిడ్‌కు మారింది. ఈసారి సదస్సు సమయానికి ఒక్క చిలీ మాత్రమే కాదు... వేరే దేశాలు కూడా వేర్వేరు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఫ్రాన్స్‌లో దేశవ్యాప్త సమ్మె సాగింది. బ్రిటన్‌ ఎన్నికల హడావుడి, ప్రభుత్వం ఏర్పాటు వగైరాల్లో బిజీగా ఉంది. ప్రపంచంలో అతి పెద్ద కాలుష్య కారక దేశంగా ముద్రపడిన చైనా హాంకాంగ్‌ ఉద్యమంతో ఊపిరాడకుండా ఉంది. రెండో స్థానంలో ఉన్న అమెరికా ఇప్పటికే పారిస్‌ ఒడంబడిక నుంచి తప్పుకుంది.

అమెజాన్‌ మహారణ్యాల్లో ఏడు శాతం వరకూ వాటావున్న బొలీవియాలో ప్రభుత్వం సైనిక తిరుగుబాటులో కుప్పకూలింది. ఇక ఆ అర ణ్యాలు 60 శాతం మేర ఉన్న బ్రెజిల్‌ దాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ధ్వంసం చేసింది. పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న వాదనంతా పెట్టుబడిదారీ దేశాలను దెబ్బతీయడానికి ‘మార్క్సి స్టులు’ పన్నిన కుట్రగా జైర్‌ బోల్సొనారో నాయకత్వంలోని మితవాద ప్రభుత్వం అభివర్ణిస్తోంది. భూగోళం ఉనికికే పెనుముప్పు తీసుకురాగల కాలుష్యాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోవడమే కాప్‌ సదస్సుల వరస వైఫల్యానికి కారణం. పారిస్‌ ఒడంబడిక ఎంత చరిత్రాత్మకమైనది అయినా అందులోని అంశాలు అమలు చేయని దేశాలకు భారీ జరిమానా విధిం చడం, అభిశంసించడం వంటి నిబంధనలు లేకపోవడంతో ఆ లక్ష్యాలను సాధించడానికి ఏ దేశమూ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. పర్యావరణం ప్రమాదంలో పడిందన్న విషయంలో అమెరికా, బ్రెజిల్‌ తప్ప అందరూ ఏకీభవిస్తున్నారు.

నిజానికి పారిస్‌ ఒడంబడిక ఆ ప్రమాదాన్ని అవసరమైన స్థాయిలో పట్టించుకోలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ దేశాలు అనేక ఉత్పాతాలను చవిచూశాయి. మొన్న సెప్టెంబర్‌లో బహామస్‌ను చుట్టుముట్టిన పెనుతుపాను డోరియన్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కేటగిరీ 5లో చేర్చిన ఈ తుపాను వల్ల 70మంది ప్రాణాలు కోల్పోగా, 340 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది. అగ్రరాజ్యాల చర్యల పర్యవసానాలను చిన్న దేశాలు ఎలా భరించవలసి వస్తున్నదో చెప్పడానికి బహామస్‌ దేశమే ఉదాహరణ. ఇదొక్కటే కాదు... వనౌతు, తువాలు వంటి అతి చిన్న ద్వీపకల్ప దేశాలు కూడా తరచూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనే చిక్కు కుంటున్నాయి. ఇలాంటి చిన్న దేశాలను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత, శిలాజ ఇంధనాల్ని యథేచ్ఛగా వాడుతూ లాభాలు గడిస్తున్న అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఉంది. కానీ వీరిలో ఏ ఒక్కరూ ఆ సంగతిని గుర్తించడం లేదు. మాడ్రిడ్‌ సదస్సులో జరిగిన చర్చల తర్వాత ఈ దేశాలు నామమాత్రమైన సాయాన్ని విదిల్చి తమ బాధ్యత తీరినట్టు ప్రవర్తించాయి.

పారిస్‌ ఒడంబడిక లక్ష్యాలు ఏమిటో, వాటిని సాధించడానికి ఏం చేయాలో ప్రతి దేశానికీ తెలుసు. అన్ని దేశాలూ ఒకే స్థాయిలో కాలుష్యానికి కారణం కావడం లేదు. అలాగే ఈ కాలుష్య పర్య వసానాలను అన్ని దేశాలూ సమాన స్థాయిలో చవి చూడటం లేదు. ఏ ఒక్క దేశమో పూనుకుని ఈ కాలుష్యాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు. కనుక ప్రతి దేశమూ కాలుష్యంలో తన బాధ్యతను నిజాయితీతో గ్రహించి, దాని అదుపునకు గరిష్టంగా ఏం చేయగలనో నిర్ణయించుకోవాలి. అందరి లక్ష్యమూ కాలుష్యాన్ని అంతం చేయడమే అయినా, ఎవరెంత కారకులన్న దాన్నిబట్టి భారాన్ని పంచు కోవాలి. కానీ సంపన్న దేశాల వైఖరి వేరుగా ఉంది. అతిగా కాలుష్యాన్ని విడుస్తున్నా దానికి దీటైన చర్యలుండటం లేదు. కనుకనే అందరి మెడలూ వంచే విధంగా నిబంధనలుండాలి. ఆ నిబంధనల మాట అటుంచి కర్బన ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో విఫలమైన దేశాలు తప్పించుకోవడానికి పారిస్‌ ఒడంబడిక వీలు కల్పించింది. అందులోని ఆరో అధికరణ అటువంటిదే.

కర్బన ఉద్గారాల అదుపులో విఫలమైన సంపన్న దేశం... వాగ్దానానికి మించి అదుపు చేసిన దేశాలనుంచి ఆ ‘అదనాన్ని’ కొనుగోలు చేయొచ్చునని చెప్పే ఈ అధికరణ పరిస్థితి మెరుగుదలకు ఏమైనా దోహదపడుతుందా? మొత్తానికి ఈ సదస్సు ఎప్పటిలాగే సమస్యల్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది బ్రిటన్‌లోని గ్లాస్గోలో వాటిని పరిష్కరిస్తామని ఆశాభావం వెలిబుచ్చింది. కానీ నమ్మేదెవరు? నిర్ణయాత్మకంగా వ్యవహరిం చలేని ఇలాంటి సదస్సులు చివరకు నిరర్థకమవుతాయి తప్ప సాధించేదేమి ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement