
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు ప్రకటించినట్టు.. 2070 నాటికి భారత్‌ను సున్నా కర్బన ఉద్గారాల దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు 10 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు (సుమారు రూ.770 లక్షల కోట్లు) అవసరమని జీఈ–ఈవై సంయుక్త అధ్యయన నివేదిక పేర్కొంది. గతేడాది కాప్–26 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఈ లక్ష్యాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సమీప భవిష్యత్తులో భారత్ బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడాల్సిన పరిస్థితే ఉంటుందని ఈ నివేదిక గుర్తు చేసింది.
ఈ అవసరాల నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా.. బొగ్గు వినియోగానికి సంబంధించి పర్యావరణ అనుకూల సాంకేతికతపై దృష్టి సారించడంతోపాటు ప్రోత్సహించాలని సూచించింది. భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఇంధన రంగంలో దిగుమతులపై ఆధారపడడాన్ని అధిగమించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) మాదిరి దేశీయ ప్రోత్సాహకాలు అవసరమని సూచించింది. ‘‘గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలి. తయారీ వ్యయాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. కోల్ ఆధారిత విద్యుత్‌కు సంబంధించి కార్బన్ క్యాప్చర్ సాంకేతికతలను వినియోగించాలి. కార్బన్ మార్కెట్లను ఏర్పాటు చేయాలి. శుద్ధ ఇంధన టెక్నాలజీలను అమలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’అని ఈ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment