ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వుండేవారికీ మధ్య లడాయి కొత్తగాదు. ఇంకా వెనక్కు వెళ్తే వేరే పార్టీలకు చెందినవారు అధికారంలో వున్నప్పుడు కూడా ఇలాంటి విభేదాలు తరచు వస్తూనే వుండేవి. తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సోమవారం రద్దు చేశారు. సాధారణంగా అయితే ఇలా సమస్య తలెత్తినప్పుడల్లా కేజ్రీవాల్‌నే అత్యధికులు సమర్థించేవారు. ఈసారి మాత్రం వారిలో చాలా మంది ఆ పని చేయలేకపోయారు. కరోనా సమస్య పరిష్కారమయ్యేవరకూ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందిం చాలంటూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం. దీనిపై అన్నివైపులా వ్యతిరే కత రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ అది అమలుకాకుండా ఆపారు. కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ పేట్రేగుతుండటం, కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోవడం అందరిలోనూ భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుంది. సంయమనం పాటించాల్సివుంటుంది.
కానీ కేజ్రీవాల్ సర్కారు జారీ చేసిన సర్క్యులర్ అందుకు విరుద్ధమైన పోకడలకు పోయింది. అన్ని రాష్ట్రాల్లాగే ఢిల్లీ కూడా కరోనా ఉగ్ర రూపం దాల్చినప్పటినుంచీ సరిహద్దులు మూసేసింది. బయటివారు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. వాటిని ఎవరూ తప్పుబట్టరు. లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడంలో భాగంగా ఆ ఆంక్షల్ని సోమవారం నుంచి రద్దు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం భావించింది. అంతవరకూ మంచిదే. కానీ కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే ఢిల్లీ ఆసుపత్రుల్లో వైద్యం లభిస్తుందని చెప్పడ మేమిటి? ఢిల్లీకి పొరుగున ఉత్తరప్రదేశ్, హర్యానాలున్నాయి. ఆ సరిహద్దుల్లోవున్న గ్రామాలు, పట్ట ణాల ప్రజలు ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఢిల్లీకి వెళ్తుంటారు. అలాంటివారందరికీ వైద్యం నిరాకరిస్తామని చెప్పడం రాజ్యాంగవిరుద్ధం మాత్రమే కాక, అమానవీయం. ఆరోగ్యంగా వుండే హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒకటైన జీవించే హక్కులో భాగమేనని ఆమధ్య సర్వోన్నత న్యాయ స్థానం తీర్పునిచ్చిన సంగతి కేజ్రీవాల్‌కు తెలియదనుకోలేం. పైగా తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన వారెవరినీ నిరాకరించబోమని వృత్తి చేపట్టే ముందు వైద్యులు ప్రమాణం చేస్తారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం పాలన చూశాక మొన్న ఫిబ్రవరిలో రెండోసారి ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను జనం గెలిపించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తీరు అందరినీ మెప్పించింది. 20,000 లీటర్ల వరకూ ఉచితంగా మంచినీరు అందించడం, మహిళలకు సిటీబస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించడం వంటివి అందరినీ ఆక ట్టుకున్నాయి. కానీ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడం మొదలెట్టాక కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలపాలవుతున్నాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి నిరాకరించే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికను కూడా ఇలాగే అనేకులు తప్పుబట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సక్రమంగా చికిత్స అందడం లేదని వస్తున్న ఆరోపణల విషయంలో స్పందించని సర్కారు ప్రైవేటు ఆసుపత్రులకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఏమిటన్నది వారి ప్రశ్న.
దానికి బదులు ప్రైవేటు ఆసుపత్రుల వాస్తవ సామర్థ్యం ఏమేరకుందో మదింపు వేసి, మెరుగైన సదుపాయాలున్న ఆసుపత్రులు కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలని ఉత్తర్వులిస్తే సరిపోయేది. ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఒకే స్థాయిలో వుండవు. ఎక్కడ పరిమిత సౌకర్యాలు వున్నాయో ...ఎక్కడ విస్తరణకు అనువైన సదుపాయాలున్నాయో చూసి, తగిన ఆదేశాలిస్తే అందువల్ల ప్రయోజనం వుంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఆసుపత్రులు కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే అన్న నిర్ణయం కూడా ఇలా అనాలోచితంగా తీసుకున్నదే. అక్కడి ఆసుపత్రుల్లో వైద్యం కావాలనుకున్నవారు రోగికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌బుక్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వగైరాల్లో ఏదో ఒకటి చూపాలని కేజ్రీవాల్ సర్కారు జారీచేసిన ఫర్మానా చెబుతోంది. ఢిల్లీలో ఈ నెలాఖరుకల్లా కరోనా రోగులకు చికిత్స అందించడానికి 15,000 బెడ్‌లు అవసరమవుతాయన్న నిపుణుల కమిటీ అంచనా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే కేన్సర్, న్యూరోసర్జరీ, అవయవాల మార్పిడి, రోడ్డు ప్రమాదాలు వగైరాలకు సంబంధించి ఈ నిబంధనలు వర్తించబోవని వివరించింది.
అసలు ఎవరు ఢిల్లీ వాసులో, ఎవరు వేరే రాష్ట్రాలవారో కొన్ని పత్రాలనుబట్టి ఎలా నిర్ణయిస్తారో అనూహ్యం. ఇరుగు పొరుగు రాష్ట్రాల సంగతలావుంచి ఢిల్లీకి ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వచ్చినవారు అత్యవసరంగా చికిత్స అవసరమై వెళ్లినప్పుడు వారికి చికిత్స చేసేందుకు నిరా కరించడం అమానుషం కాదా? గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ మహేష్ వర్మ నేతృత్వంలోని కమిటీ ఏడున్నర లక్షలమంది అభిప్రాయాలు సేకరించినప్పుడు వారిలో 90 శాతంమంది ఢిల్లీ ఆసుపత్రులు స్థానికులకు మాత్రమే ఉండాలన్నారని కేజ్రీవాల్ అంటున్న మాటలు అర్థం లేనివి. భయాందోళనల్లో వున్నప్పుడు భావోద్వేగాలకు లోనయినవారు ఏమైనా మాట్లాడతారు. అందులో సహేతుకత వుందో లేదో నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వాలే. ఆ భావోద్వేగాల ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటామంటే నిబంధనలు ఒప్పుకోవు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న మతిమాలిన నిర్ణయాన్ని అనిల్ బైజాల్ పక్కనబెట్టడం హర్షించదగ్గది. సంక్షో భాలు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు వివేకంతో వ్యవహరించాలి. అందరి క్షేమాన్నీ దృష్టిలో వుంచు కుని నిర్ణయాలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment