తుది ఘట్టంలో ‘నాగా చర్చలు’ | Sakshi Editorial On Nagaland Peace Accord | Sakshi
Sakshi News home page

తుది ఘట్టంలో ‘నాగా చర్చలు’

Published Thu, Oct 31 2019 12:20 AM | Last Updated on Thu, Oct 31 2019 12:20 AM

Sakshi Editorial On Nagaland Peace Accord

వలస పాలకులు వదిలివెళ్లిన సమస్యల్లో అత్యంత సంక్లిష్టమైన నాగాలాండ్‌ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లక్రితం ప్రారంభించిన శాంతి చర్చల ప్రక్రియ నేటితో ముగుస్తోంది. ఇంతవరకూ దేనిపైనా స్పష్టత లేనందువల్ల ఈ ప్రక్రియను మరికొంత కాలం కొనసాగించాలని నాగాలాండ్‌లోని భిన్న సంస్థలు కోరుతున్నాయి. కానీ కేంద్రం తన వైఖరేమిటో ఇంకా చెప్పలేదు. ఏడు దశాబ్దాలుగా నానుతూ, మూడు దశాబ్దాలుగా సంక్షోభాల మధ్యే భిన్న ప్రభుత్వాల హయాంలో శాంతి చర్చలు సాగుతూ ఈ నాగా సమస్య సవాలు విసురుతూనే ఉంది. తొలిసారి 1986లో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌)తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అటువంటిదే కుదిరింది. దానిపై దాదాపు అన్ని పక్షాలూ హర్షం వెలిబుచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో... ముఖ్యంగా అస్సాం, మణిపూర్, అరుణా చల్‌ప్రదేశ్‌లలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే దాన్ని ఒప్పందం అనకుండా, ఒప్పందానికి సంబంధించిన స్వరూపం(ఫ్రేమ్‌వర్క్‌) అని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. ఆ స్వరూపానికి అను గుణంగా స్పష్టమైన విధివిధివిధానాలతో, సవివరమైన నిబంధనలతో ఒప్పందం కుదర్చుకుంటా మని చెప్పింది. అయితే అప్పటినుంచీ చర్చలు సాగుతూనే ఉన్నా ఇంతవరకూ ఒప్పందం తుది మెరుగులు దిద్దుకుందన్న సూచనలెక్కడా లేవు. భిన్న పక్షాలతో తాను సాగిస్తున్న చర్చలు ముగింపు దశకొచ్చాయని కేంద్రం తరఫున వారితో మాట్లాడుతున్న నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇటీవల చెప్పారు. కానీ ఉన్నట్టుండి మ్యువా పక్షం చేసిన ప్రకటన పెనుతుపాను రేపింది. నాగాలాండ్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండాలన్నదే తమ కృతనిశ్చయమని దాని సారాంశం. ఒకపక్క కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణను ఉండరాదనుకున్న కేంద్రం ఇలాంటి డిమాండ్లకు తలొగ్గుతుందని ఎవరూ అనుకోరు. కానీ ఈ డిమాండ్‌ పెట్టడంలోనే మ్యువా పక్షం కఠిన వైఖరి అర్ధమవుతుంది. పైగా భారతీయులకూ, నాగాలకూ మధ్య పరస్పర సహజీవనం ఎప్పటినుంచో ఉన్నదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇకముందూ అది కొనసాగుతుందని తెలిపి సంచలనం రేపింది.

అయితే రవి అంటున్నట్టు కేవలం చర్చల ప్రక్రియను సాగదీయడం ఒక్కటే మ్యువా ప్రకటన వెనకున్న లక్ష్యమా లేక ఇతరత్రా ఉద్దేశాలున్నాయా అన్నది చూడాల్సి ఉంది. కానీ సమస్య ఎంత జటిలమైనదో, అది ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నదో అటు మణిపూర్‌ ప్రభుత్వం, ఇటు అరుణాచల్‌ ప్రదేశ్‌లో వెలువడుతున్న ప్రకటనలే తార్కాణం. తమను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు ఉండటానికి వీల్లేదని ఆ రెండు రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలూ అంటు న్నాయి. ఎన్‌ఎస్‌సీఎన్‌–ఐఎం కోర్కెలు సాధారణమైనవి కాదు. నాగా ప్రజలు అధికంగా నివసిస్తున్న మణిపూర్‌లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలూ కలిపి విశాలం నాగాలాండ్‌ ఏర్పాటు చేయాలని అది కోరుతోంది. ఈ ప్రాంతాలన్నిటా మొత్తంగా 12 లక్షలమంది నాగా ప్రజలున్నారు. ఇక్కడ మాత్రమే కాదు... పొరుగునున్న మయన్మార్‌లో సైతం ఆ జాతి ప్రజలున్నారు. వివిధ ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న వివక్ష వల్ల తమ జాతి జనం నానా ఇబ్బందులూ పడుతున్నారని, తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ధ్వంసమవుతున్నా యని ఐఎం ఆరోపిస్తోంది. దీనిపై ఆ సంస్థ మొదటినుంచీ గట్టిగా పట్టుబడుతున్నందునే 2015లో ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడినప్పుడు అస్సాంతోపాటు మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులేవీ మారవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అవి సమసిపోలేదు. కుదిరిన ఆ ఒప్పందంలోని అంశాలు బయటపెట్టాలని అప్పట్లో ఆ రాష్ట్రాలు కోరాయి. ఇప్పుడు ఆ మూడుచోట్లా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. కనుక ప్రభు త్వాలు మాట్లాడటం లేదుగానీ అక్కడి ప్రజా సంఘాలు డిమాండు చేస్తూనే ఉన్నాయి. 

అయితే సమస్య ఉన్నప్పుడు, అది అత్యంత సంక్లిష్టమైనది అయినప్పుడు పరిష్కార మార్గంలో అవరోధాలు ఉండటం సహజమే. అవి ఉన్నాయి కదా అని మొత్తం పరిష్కారం జోలికే పోకుండా ఉండటం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఏడు దశాబ్దాలుగా నాగాలాండ్‌ నెత్తుటి చరిత్రే దీనికి సాక్ష్యం. నాగాలాండ్‌లో ఎన్నో మిలిటెంట్‌ సంస్థలు ఆవిర్భవించాయి. అవి సాగించిన హింసవల్ల ఎందరో పౌరులు, మిలిటెంట్లు, భద్రతా బలగాలకు చెందినవారు మరణించారు. తరచు తెగల మధ్య ఘర్షణలు చెలరేగి వందలాదిమంది ఊచకోతకు బలయ్యారు. 60వ దశకంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తొలిసారి తిరుగుబాటుదార్లతో న్యూఢిల్లీలో చర్చలకు సిద్ధపడ్డారు. అయితే తమకు కేటాయించిన హోటల్‌ గదులను ఒక విదేశీ బృందం కోసం ఖాళీ చేయించడంతో ఆగ్రహించిన తిరుగుబాటుదార్లు చర్చలకు స్వస్తిచెప్పి నిష్క్రమించారు. కేంద్రం తమకు సమాన స్థాయినిచ్చి మాట్లాడకపోతే చర్చల సమస్యేలేదని అప్పట్లో తిరుగుబాటుదార్లు ప్రకటించారు. అటుపై మిలిటెంట్‌ సంస్థల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకుని ప్రభుత్వాలు వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించాయి. అయితే పాత సంస్థలు కనుమరుగవుతున్నా అంతకు మించిన శక్తితో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కేంద్రం గత కొంతకాలంగా మ్యువా పక్షంతోనూ, ఏడెనిమిది సంస్థలకు ప్రాధాన్యం వహిస్తున్న నాగా నేషనల్‌ పొలిటికల్‌ గ్రూప్‌(ఎన్‌ఎన్‌పీజీ)తోనూ విడివిడిగా చర్చిస్తోంది. ఐఎం వంటి సంస్థను చర్చలకు ఒప్పించడమే కాదు...ఫ్రేమ్‌వర్క్‌పై సంతకం కూడా చేయించిన కేంద్రం ఇప్పుడు చివరి దశలో అన్ని పక్షాలనూ తన దారికెలా తెచ్చుకుంటుందన్నది చూడాల్సి ఉంది. చర్చల ఉద్దేశం శాంతి స్థాపన కనుక, అది సాధ్యపడే వరకూ వాటిని కొనసాగించడమే ఉత్తమం. అప్పుడు మాత్రమే దీర్ఘకాలంగా ఈశాన్యాన్ని పీడిస్తున్న సమస్యకు అర్ధవంతమైన పరిష్కారం సాధ్య పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement