పప్పు తిప్పలు...! | sakshi editorial on kandipappu | Sakshi
Sakshi News home page

పప్పు తిప్పలు...!

Published Fri, Oct 16 2015 2:17 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

పప్పు తిప్పలు...! - Sakshi

పప్పు తిప్పలు...!

పండగొస్తున్నదంటే బెంగపడే రోజులొచ్చినట్టున్నాయి. నెల్లాళ్లక్రితం మొదలై పైపైకి ఎగబాకుతున్న పప్పుల ధరల్ని అందుకోలేక సామాన్యులు బెంబేలెత్తుతుంటే ప్రభుత్వాలు పట్టనట్టు ఉండిపోతున్నాయి. బజారుకెళ్లి ఇంటికొచ్చేసరికి జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప సంచీ నిండటం లేదు. పండగ పూట పిండి వంటల మాట అలా ఉంచి కనీసం పప్పన్నం తినడానికి కూడా సాధ్యంకాని స్థితి ఏర్పడింది. కిలో చికెన్ ధరతో పోలిస్తే కందిపప్పు ధర రెట్టింపు ఉన్నదంటే ధరల వేలంవెర్రి ఎలా ముదిరిందో అర్ధం చేసుకోవచ్చు. ఏం ధరలివి? గత నెలలో కిలో ధర రూ. 140కి మించని కందిపప్పు ఇప్పుడు రూ. 200కు చేరుకుంది. రూ. 135 ఉండే మినప్పప్పు ప్రస్తుతం రూ. 185 పలుకుతోంది. కిలో రూ. 110 ఉన్న ఎండుమిర్చి ఇప్పుడు రూ. 140కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశమంతా పప్పుల ధరలు రాకెట్ వేగాన్ని మించి దూసుకు పోతున్నాయి.

శరీర పోషణకు అవసరమయ్యే మాంసకృత్తులు చవకలో లభ్యమయ్యేది పప్పుల్లోనే గనుక సగటు పౌరులు వాటిపైనే ప్రధానంగా ఆధారపడతారు. మాంసాహారులకైనా చికెన్, మటన్ రోజూ తినే స్తోమత ఉండదు. ఇంత ప్రధాన పాత్రవహించే పప్పుల సరఫరా, వాటి ధరలపై దృష్టి సారించి అవి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న స్పృహ పాలకులకూ, విధాన నిర్ణేతలకూ కొరవడింది. వలస పాలకుల ధోరణుల్ని మన పాలకులు పుణికిపుచ్చుకోవడమే ఇందుకు కారణమని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతారు. వారు రోజూ తీసుకునే ఆహారంలో పప్పులు భాగం కాదు గనుక వాటి  సంగతే ఆ పాలకులకు పట్టేది కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కాయ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. ఆఫ్రికా దేశాల్లోగానీ, మయన్మార్, ఉరుగ్వే వంటి చోట్ల గానీ పండించి ఆ దేశాలనుంచి దిగుమతి చేసుకోవచ్చునని కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో శరద్ పవార్ ఆలోచించారు.

వాస్తవానికి  మంచి మద్దతు ధరలిస్తామని ప్రకటిస్తే రైతులు ఉత్సాహంగా కదిలి ఆ పంటల్ని మరింతగా పండించడానికి ప్రయత్నిస్తారు. ఆ పని చేయడంలో ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలూ పదే పదే విఫలమవుతున్నారు. 2014-15లో మన దేశం మొత్తంగా రూ. 18,000 కోట్ల రూపాయల విలువైన కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంది. మెరుగైన మద్దతు ధరలిస్తామంటే ఇంతకన్నా తక్కువ వ్యయంతోనే మన దేశంలో కాయ ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయి. ఎంఎస్‌పీని ప్రకటించి ఊరుకోవడమే కాదు...రైతులకు ఆ ధర వచ్చేలా ప్రభుత్వాలు చూడాలి. నిరుడూ, ఈసారీ కూడా నైరుతి రుతు పవనాలు దగా చేసిన మాట నిజమే. పంటల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిన మాట కూడా వాస్తవమే. వర్షాలు లేకపోవడం, అకాల వర్షాలు ముంచెత్తడం వంటి కారణాలవల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అంతక్రితం  కాయ ధాన్యాల ఉత్పత్తి 20 లక్షల టన్నులు మించగా 2014-15లో అది 17 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే ఇదంతా ఊహించని ఉపద్రవం కాదు.

ఈ ఏడాది కూడా కరువు తప్పదని మన వాతావరణ విభాగం చాలా ముందుగానే చెప్పింది. ఆ హెచ్చరికల్ని గమనంలోకి తీసుకుని ఏ ఏ పంటలు దెబ్బతినడానికి ఆస్కారమున్నదో అంచనా వేసుకుని వాటి దిగుమతికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాల్సింది ప్రభుత్వమే. అది సకాలంలో జరగకపోవడంవల్లనే పప్పుల ధరలిలా మండుతున్నాయి. వాస్తవానికి మొన్న జూన్‌లోనే దిగుమతులు చేసుకోవాలన్న నిర్ణయం జరిగినా అది ఆచరణకొచ్చేసరికి ఆలస్యమైంది. ఈలోగా జూలై కూడా గడిచిపోయింది. పోర్టులకు చేరుకున్న కాయధాన్యాల్ని వెంటనే తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని, అందుకు సంబంధించి కూడా జాప్యం చోటు చేసుకోవడంవల్ల మార్కెట్‌లో ధరలు పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరిస్తున్నారు. వివిధ పోర్టుల్లో 5,000 టన్నుల సరుకు సిద్ధంగా ఉండగా మరో 4,000 టన్నులు చేరుకోబోతున్నాయని చెబుతున్నారు. ఈ చర్యలతోపాటు  ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని అంటున్నారు. నిజానికి ఈ చర్యలన్నీ ఇంకాస్త ముందు మొదలై ఉంటే పప్పుల ధరలిలా భగ్గున మండేవి కాదు.

మిగిలిన పంటలతో పోలిస్తే  కాయ ధాన్యాల విషయంలో తగినంతగా పరిశోధనలు జరగడంలేదు.  కాయ ధాన్యాల పంటలు చేతికందడానికి ఎక్కువ రోజుల సమయం పడుతుందని, అలాగే వాటికి చీడపీడల బెడద కూడా ఎక్కువేనని రైతులంటారు. వీటన్నిటికీ అయ్యే ఖర్చుల్ని భరించాక వచ్చే దిగుబడి చూసినా తమకు గిట్టుబాటయ్యే పరిస్థితి కనబడదని చెబుతారు. కనుక ఈ రంగంలో మరింతగా పరిశోధనల్ని ప్రోత్సహించి రైతుకు మెరుగైన వంగడాలను అందుబాటులోకి తీసుకురాగలిగితే వాటి ఉత్పత్తి పెరుగుతుంది. పంట చేతికొచ్చాక వాటిని అమ్ముకోవడం మరో సమస్య. ప్రస్తుతం కాయ ధాన్యాల దిగుమతిపై సుంకాలు లేకపోవడంవల్ల విదేశాల నుంచి సరుకొచ్చి రైతుల దగ్గరున్న ఉత్పత్తులతో పోటీ పడుతోంది. దళారులు రంగప్రవేశం చేసి రైతుల కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారు. పంట చేతికొచ్చే సమయానికి దళారులు, వ్యాపారులూ సొమ్ము చేసుకుంటుంటే రైతు నిస్సహాయంగా మిగులుతున్నాడు. కనుకనే కాయ ధాన్యాల వైపు మొగ్గు చూపాలంటే హ డలెత్తుతున్నాడు. అటు రైతులు ఆ విధంగా నష్టపోతుంటే నల్ల బజారుకు పప్పులు తరలి కృత్రిమ కొరత ఏర్పడటంవల్ల సామాన్య పౌరులు తలకిందులవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. నెపాన్ని రుతుపవనాలపై నెట్టేసి పప్పు గింజల కొరతకూ, వాటి ధరలకూ అదే కారణమని చెప్పడం కాక సరైన విధానాలను రూపొందించుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement