ప్రతీకాత్మక చిత్రం
ఊహించని ఉపద్రవం కరోనా మహమ్మారి రూపంలో చుట్టుముట్టడంతో సామాన్యుల బతుకులు అగమ్యగోచరమయ్యాయి. వలస కూలీలు, చిన్నా చితకా పనులు చేసుకునేవారు, చిరు వ్యాపారులు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత చేస్తున్నా, అందరికీ సాయం అందడం అసాధ్యమవుతున్నది. ఈ క్లిష్ట సమయంలో కూడా వదంతులు వ్యాపింపజేసేవారు, విద్వేషపూరిత ప్రచారం చేసేవారు, తప్పుడు ఆరోపణలకు దిగేవారు తమ వికృత క్రీడను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక మతానికి చెందినవారు కరోనా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమధ్య సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలో పెట్టారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని అటు తర్వాత ధ్రువపడింది. అది సద్దుమణి గిందనుకుంటుండగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గతవారం ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్‌ను ఒక గుంపు కొట్టి చంపిన ఉదంతం చుట్టూ రకరకాల కథనాలు ప్రచారంలోకొస్తున్నాయి.
దాడికి దిగిన ఆదివాసీ గ్రామస్తులు కొన్ని వదంతులను విశ్వసించి, ఆ సాధువులను దొంగల ముఠాకు చెందిన వారిగా అనుమానించి, ఆవేశంతో ఈ దుండగానికి పాల్పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉదంతం నిజానిజాలు మరికొన్ని రోజుల్లో బయటికొస్తాయి. కానీ ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం లేకుండా ఏదో ఒకటి వూహించుకుని దాన్నే ప్రచారం చేయడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. తమకు ఎలాంటి హానీ తలపెట్టని వ్యక్తులపై దాడికి దిగడం, దూషించడం, కొట్టి చంపడం అత్యంత దారుణం. దుండగులెవరు, బాధితులెవరు అన్న దానితో నిమిత్తం లేకుండా మనిషన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి దుర్మార్గాలను ఖండిస్తారు.
దోషులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటారు. పాల్ఘర్ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన సాధువులిద్దరిలో ఒకరు 70 ఏళ్లవారైతే, మరొకరు 35 ఏళ్ల వ్యక్తి. వీరిద్దరూ జునా అఖాడాకు చెందిన సాధువులు. ఎనిమిదో శతాబ్దంలో హిందూ మత పరిరక్షణ కోసం ఆది శంకరాచార్యులు నెలకొల్పిన ఏడు అఖాడాలు అనంతర కాలంలో 13కి చేరుకున్నాయి. ఈ అఖాడాల్లో వారణాసి కేంద్రంగా పనిచేస్తున్న జునా అఖాడా ఉన్నతమైనదని చెబుతారు. సూరత్‌లో తమ గురువు శ్రీ మహంత్ రామ్‌గిరి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తున్న సాధువులను లాక్‌డౌన్ కారణంగా అనుమతించలేమని దాద్రా నాగర్ హవేలీ వద్ద స్థానిక పోలీసులు ఆపి, వెనక్కు పంపించారు. అలా వెళ్తుండగా గుంపు దాడికి దిగింది.
సాధువులపై ఉన్మాద గుంపు చేసిన దాడికి సంబంధించిన వీడియో గమనిస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు నెత్తురోడుతున్న వృద్ధ సాధువును, మరో ఇద్దరినీ ఆ ఉన్మాదులకు అప్పగించినట్టు అర్థమవుతుంది. కర్రలతో, కత్తులతో, గొడ్డళ్లతో వారిపై దాడి చేస్తుంటే కానిస్టేబుళ్లు నిర్లిప్తంగా ఉండిపోయారు. అంతమంది గుంపును ఒకరో, ఇద్దరో నియంత్రించడం అసాధ్యమే. కానీ కనీసం పై అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి, అదనపు బలగాలు రప్పించి వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు. కొన్ని రోజులక్రితం ఇంటింటికీ ఆహారధాన్యాలు పంపిణీ చేసి, ఆదివాసీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తిరిగివస్తున్న వైద్యుడి కారుపై సైతం దాదాపు 250మంది వేరే గ్రామంలో ఇదే మాదిరి దాడి చేశారు. అప్పుడు కూడా కారులో వెళ్తున్నవారు దొంగలన్న అనుమానంతోనే గుంపు దాడికి దిగింది.
వీటన్నిటిపైనా ప్రభుత్వాన్ని నిలదీయడం, దాడులకు కారకులెవరో, వారిని ప్రేరే పించినవారెవరో వెలికి తీయాలని కోరడం సమంజసమే. దాన్నెవరూ తప్పుబట్టరు. కానీ మరణించినవారు అఖాడాకు చెందినవారు గనుక, దాడి చేసిన వారు అన్యమతస్తులైవుంటారని తమకు తామే ఒక నిర్ణయానికొచ్చి, అదే నిజమని ప్రజలందరినీ నమ్మించడానికి ప్రయత్నించడం, ఇష్టాను సారం వ్యాఖ్యలకు దిగడం దారుణం. దాడి జరిగిన ప్రాంతం సీపీఎం శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోనిది. కనుక దాడి వెనక ఆ పార్టీ హస్తం వుందని మరికొందరు ఆరోపించారు.
ఇలా తమకు తోచినట్టు ఆరోపణలు గుప్పించేవారికీ, అకారణంగా సాధువులపై దాడిచేసిన ఉన్మాదులకూ వ్యత్యాసం ఏమైనా ఉందా? జరిగిన ఉదంతంపై వెనకా ముందూ చూడ కుండా మతం రంగు పులమడానికి, వేరే పార్టీలను తప్పుబట్టడానికి సామాజిక మాధ్యమాల్లో మాత్రమే కాదు... కొన్ని చానళ్లలో సైతం ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తుంది. ఇది చివరకు మత ఘర్షణలకు దారితీస్తుందన్న అనుమానంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అరెస్టయిన నిందితుల పేర్లను కూడా వెల్లడించింది.
ప్రధాన మీడియా అయినా, సామాజిక మాధ్యమాలైనా బాధ్యతాయుతంగా మెలగకపోతే సమా జంలో పరస్పర అపోహలు, అనుమానాలు బయల్దేరతాయి. విద్వేషాలు బలపడతాయి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం ప్రచారం చేసేవారికి ఏ బాధ్యతా వుండదు. జరిగిందేమిటో తెలుసు కోవడానికి అవసరమైన ఉపకరణాలూ ఉండవు. కానీ ప్రధాన మీడియాకు సమాచారం సేకరిం చడానికి విస్తృతమైన యంత్రాంగం ఉంటుంది. నేరుగా ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. చుట్టూ ఉన్న సమాజం ఎలాంటిదో, చిన్న పొరపాటు దొర్లితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అవగాహన ఉంటుంది.
కానీ బాధ్యతారహితంగా తమకు తోచిందే నిజమని విశ్వసించి, దాన్నే ప్రచారం చేయడానికి పూనుకొనే ధోరణి ప్రధాన మీడియాకు కూడా సోకడం ఆందోళన కలిగిస్తుంది. వదంతుల వ్యాప్తిని అడ్డుకోవడానికి, మూకదాడులపై చర్యలు తీసుకోవ డానికి ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని రెండేళ్లక్రితం కేంద్రం సంకల్పించింది. కానీ ఇంత వరకూ అది సాకారం కాలేదు. సాధ్యమైనంత త్వరలో ఆ చట్టం తీసుకురావడం, మూకదాడుల వంటి ఉదంతాల సమయంలో ఎలా మెలగాలో పోలీసులకు తగిన శిక్షణ ఇవ్వడం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment