మహా నంబర్‌ గేమ్‌ | Sakshi Editorial On Maharashtra Politics | Sakshi
Sakshi News home page

మహా నంబర్‌ గేమ్‌

Published Fri, Jun 24 2022 2:14 AM | Last Updated on Fri, Jun 24 2022 2:14 AM

Sakshi Editorial On Maharashtra Politics

పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సాక్షాత్తూ అధికారిక నివాసం వీడి సొంత ఇంటికి వెళ్ళిపోవడం... కిడ్నాప్‌కు గురయ్యామంటా రెబల్‌ ఎమ్మెల్యేలు సొంత గూటికి రావడం... తిరుగుబాటు మానేసి ఎమ్మెల్యేలంతా తిరిగొచ్చి కోరితే కూటమి నుంచే వైదొలుగుదామని అధికార పక్షమే ఆఫరివ్వడం... బహుశా సినిమాల్లోనూ కనిపించని నాటకీయతకు మహారాష్ట్ర వేదికైంది. కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ల అండతో ఉద్ధవ్‌ ఠాకరే సారథ్యంలో శివసేన నడుపుతున్న మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయింది.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కుదిరేలా లేదని తెలిశాక, కనీసం తన తండ్రి బాలాసాహెబ్‌ ఠాకరే పెట్టిన పార్టీని నిలబెట్టుకోవడమె లాగో తెలియని స్థితిలో పడ్డారు ఉద్ధవ్‌. వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితే లేదని తిరుగుబాటు వర్గం నేత ఏక్‌నాథ్‌ శిందే గురువారం స్పష్టం చేయడంతో ఇక నేడో, రేపో... ఉద్ధవ్‌ ప్రభుత్వ పతనం ఖాయం. 2019 అక్టోబర్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకున్న బాసలకు కట్టుబడకుండా కాంగ్రెస్, ఎన్సీపీ లతో అసహజ కూటమి కట్టిన శివసేన, ఉద్ధవ్‌లపై బీజేపీ సరిగ్గా సమయం చూసి, పగ తీర్చుకుంది.

రాజకీయాల్లో రెండు వారాలంటే సుదీర్ఘ సమయం. రెండువారాల క్రితం కూడా బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వం కనిపించింది. కానీ, రాజ్యసభ ఎన్నికల్లో, ఆ వెంటనే విధాన పరిషత్‌ ఎన్నికల్లో ఎదురైన ఓటములతో రెండే వారాల్లో ఉద్ధవ్‌ నేతృత్వంలోని కూటమి కోట బీటలు వారిపోయింది. శివసేనకు కొంతకాలంగా అంగబలం, అర్థబలమైన ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. 285 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మొన్నటిదాకా 55 స్థానాలున్న శివసేన 17 సీట్ల ఉద్ధవ్‌ సేనగా, 38 సీట్ల శిందే సేనగా దాదాపు చీలిపోయిందని తుది వార్త.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండడానికి కావాల్సిన మూడింట రెండు వంతుల అంకెను శిందే వర్గం చేరుకుందనిపిస్తోంది. కనీసం 8 మంది స్వతంత్ర అభ్యర్థులూ శిందే సేన ఉన్న గువాహటీకే పరుగులు తీస్తుండడాన్ని బట్టి గాలి ఎటు వీస్తున్నదో అర్థమవుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో అంకెల మెజారిటీదే ఆఖరు మాట గనక అసెంబ్లీ వేదికగా బలపరీక్ష సాగవచ్చు. ఏమైనా ఉద్ధవ్‌ నిష్క్రమించడం, 106 సీట్ల బీజేపీ కాస్తా శిందే సేనతో కలసి మెజారిటీ మార్కు 144ను ఇట్టే దాటేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం క్రమానుగత లాంఛనమే.   

మూడు రోజులు దాటినా ముగిసిపోని మహారాష్ట్ర సంక్షోభం వెనుక కనపడుతున్న వ్యక్తులు, అంశాల కన్నా పైకి కనపడనివి చాలానే ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని మమతా బెనర్జీ సహా పలువురి ఆరోపణ. బీజేపీ మాత్రం అమాయకత్వం నటిస్తోంది. మరోసారి సీఎం పీఠం ఎక్కాలని తపిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ సహా సీనియర్‌ బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు.

కానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌ మొదలు అస్సామ్‌లోని గువాహటి దాకా ప్రత్యేక విమానాలు, బస్సుల్లో వందల కిలోమీటర్లు వెళ్ళడం, స్టార్‌ హోటళ్ళలో మకాం సహా సమస్త ఏర్పాట్లు జరగడం, స్థానిక బీజేపీ సర్కార్ల సంపూర్ణ రక్షణ ఛత్రంలో ఉండడం – ఇవన్నీ తెర వెనుక ఉన్నదెవరో చెప్పకనే చెబుతున్నాయి. పాకిస్తాన్‌తో పోరాడుతున్న ఓ జాతీయ పార్టీ తమ తిరుగుబాటు నిర్ణయాన్ని చరిత్రా త్మకమని ప్రశంసించినట్టు శిందేయే తన సహచరులతో గురువారం పేర్కొనడం గమనార్హం. 

గతంలో గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ సహా పలుచోట్ల ప్రతిపక్షాల ప్రభుత్వాలను ఉండనివ్వ కుండా బీజేపీ సాగించిన ‘ఆపరేషన్‌ కమల్‌’ను తేలిగ్గా మర్చిపోలేం. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే జరుగుతోంది. కాకపోతే, 2019లో తగిలిన దెబ్బతో ఈసారి ఆచితూచి అడుగేస్తూ, ఆఖరి క్షణం వరకు తాను బయటపడకూడదన్న జాగ్రత్త వహిస్తోంది. అలాగని తప్పంతా బీజేపీదే అనడానికి వీల్లేదు. ఇందులో ఉద్ధవ్‌ స్వయంకృతాపరాధమూ ఉంది.

కరోనా కాలం, సర్జరీతో బలహీనపడ్డ ఆరోగ్యం – కారణాలు ఏమైనా సొంత ఎమ్మెల్యేలకు సైతం ఉద్ధవ్‌ అందుబాటులో లేరనేది ప్రధాన ఆరోపణ. చుట్టూ ఉన్న కోటరీ సరేసరి. ఇక, అందరి బలవంతం వల్లే సీఎం అయ్యానంటున్న ఉద్ధవ్‌ తీరా తన రాజకీయ వారసుడిగా కుమారుడు ఆదిత్యను భుజానికెత్తుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పరిశ్రమించిన శిందే ప్రభృతులకు ఇవన్నీ పుండు మీద కారమయ్యాయి. హిందూత్వ నినాదంతో బీజేపీకి సహజ మిత్రపక్షమైన శివసేన తద్భిన్నంగా, లౌకికవాదాన్ని నెత్తినెత్తుకోవడమూ శివసైనికులకు మింగుడుపడట్లేదు. అన్నిటికీ మించి కేంద్రం చేతిలోని ఈడీ వేధింపుల భయం, గీత దాటి వస్తే ఇస్తామంటున్న భారీ ప్యాకేజీలు తిరుగుబాటుకు దోహదకారిగా ఉండనే ఉన్నాయి. 

వెరసి, ఈ మొత్తం వ్యవహారంలో శివసేన తన బలాన్నే కాదు... తన పూర్వ ప్రభావాన్నీ పోగొట్టుకుంది. ఒకప్పుడు శివసేనదే రాజ్యమైన మహారాష్ట్రలో గత మూడు దశాబ్దాల్లో బీజేపీ అనూహ్యంగా పెరిగితే, శివసేన ఊపు తగ్గింది. యూపీ తర్వాత మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కమలనాథుల వశమైతే, దేశంలో బీజేపీ సాగిస్తున్న అశ్వమేధంలో మరో కోట కూలిపోయినట్టే! రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పనీ మరింత సులువవుంది. పాత సిద్ధాంతాల కన్నా, నయావాద విస్తరణ కాంక్షతో సాగుతున్న బీజేపీ 2.0కు కావాల్సిందీ ఇదే! ఏమైనా, ప్రజాస్వామ్యం వట్టి అంక గణితంగా మిగిలిపోతే మహారాష్ట్ర లాంటి పరిణామాలు తప్పవు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ – పేర్లు ఏవైనా సరే ప్రతి పార్టీ ఇలాంటి రాజకీయాలే చేస్తుండడం విచారకరం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement