సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరమా కాదా... అవసరమైతే ఏమేరకు అనే అంశా లపై మన దేశంలో అడపా దడపా చర్చ సాగుతోంది. నియంత్రణ తప్పనిసరని, అందుకు సంబం ధించి మార్గదర్శకాలు ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని ఆదేశించింది. మరోపక్క తమ ఖాతాదార్ల లావాదేవీలు ఇవ్వడం ససేమిరా కుదరదంటూ భిన్న సందర్భాల్లో వాట్సాప్ కేంద్రానికి చెబుతోంది. కానీ వీటితో సంబంధం లేకుండా, ఎలాంటి నీతినియమాలు పాటించ కుండా చాపకింద నీరులా ఒక ప్రైవేటు సంస్థ ప్రపంచంలో అనేకమంది వాట్సాప్ వినియోగ దారుల ఖాతాలను హ్యాక్ చేసేందుకు, వారి సమస్త వివరాలను ఎప్పటికప్పుడు రాబట్టేందుకు వీలుకల్పించే స్పైవేర్‌ను సృష్టించి, సొమ్ము చేసుకుంటున్నదని బట్టబయలైంది. దీనంతటికీ సూత్ర ధారి ఇజ్రాయెల్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ఎన్‌ఎస్‌ఓ. పెగాసస్ అనే ఈ స్పైవేర్‌ను కేవలం వివిధ దేశాల్లోని ప్రభుత్వాధీన సంస్థలకు మాత్రమే విక్రయించానని...ప్రైవేటు సంస్థలకు ఇవ్వలేదని అడ్డంగా దొరికిపోయాక ఆ సంస్థ సంజాయిషీ ఇస్తోంది. ఇందులో నిజం పాలెంతో, బుకాయింపు భాగమెంతో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
కానీ ప్రభుత్వాలైనంతమాత్రాన ఇలాంటి దొంగపనులు చేసే సంస్థలతో చీకటి లాలూచీలకు దిగడం చట్టబద్ధం కాబోదు. అనుమానాస్పదంగా కనబడే వ్యక్తులపైనా, సంస్థలపైనా నిఘా ఉంచటం ఏ దేశంలోనైనా సర్వసాధారణం. దేశ రక్షణకోసం, పౌరుల భద్రతకోసం ప్రభుత్వాలు కొన్ని నిబంధనలకు లోబడి ఆ పనులు చేస్తాయి. ప్రభుత్వాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడైతే బాధిత పౌరులకు న్యాయస్థానాలు అండగా నిలబడ తాయి. ఏ బాధ్యతాలేని ఒక ప్రైవేటు సంస్థ ఇంత ప్రమాదకరమైన స్పైవేర్‌ను రూపొందించి ప్రపంచం మీదికి వదలడం అత్యంత ఆందోళనకరం. నిజానికి నిఘా ఉంచిందన్న సంగతి ఫిర్యాదు వస్తే తప్ప వాట్సాప్‌కు కూడా తెలియలేదు. ఎన్‌ఎస్‌ఓలాంటి సంస్థలు మరెన్ని పనిచేస్తున్నాయో, వాటి కార్యకలాపాల వల్ల జరుగుతున్న నష్టమెంతో ఊహించుకుంటేనే భయాందోళనలు కలుగు తాయి. మన దేశం వరకూ చూస్తే మానవ హక్కుల కార్యకర్తలు, దళిత, ఆదివాసీ కార్యకర్తలు, విద్యావేత్తలు, పాత్రికేయులు ఈ నిఘా నీడలో ఉన్నారని వెల్లడవుతోంది. సాధారణంగా బాధితు లెవరన్నదాన్నిబట్టి వారి ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నదెవరన్న అనుమానాలు తలెత్తుతాయి. కనుకనే కొందరు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై నవంబర్ 4 కల్లా సంజాయిషీ ఇవ్వాలని వాట్సాప్ సంస్థను కోరామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతున్నారు.
ఈ స్పైవేర్ ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుంటే దిగ్భ్రాంతికలుగుతుంది. నిఘా పెట్టదల్చు కున్న ఫోన్ నంబర్‌కు వాట్సాప్ మాధ్యమం ద్వారా వీడియో కాల్ వెళ్తే చాలు సర్వం గుల్లవుతుంది. ఆ కాల్ అందుకున్న వ్యక్తి దానికి కనీసం జవాబు కూడా ఇవ్వనవసరం లేదు! ఫోన్ మోగిన మరు క్షణం నుంచి ఆ ఫోన్‌లోని వాట్సాప్ ఖాతా వివరాలు మాత్రమే కాదు...ఇతరేతర వివరాలన్నీ గుర్తు తెలియని నేరగాళ్ల చేతికి చేరతాయి. వాట్సాప్ కాల్స్‌తోపాటు సాధారణ కాల్స్ సైతం ఎప్పటి కప్పుడు చేరిపోతాయి. ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి పోతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడు తున్నాడో, ఏ లావాదేవీలు చేస్తున్నాడో, అతని పాస్‌వర్డ్‌లు ఏమిటో స్పైవేర్ రాబడుతూ ఉంటుంది. ఆ వివరాలు ఎవరి దగ్గరకు పోతాయో, అలా సేకరించేవారు వాటితో ఏం చేస్తారో ఖాతాదారులకు తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. తమ ఖాతాదారుల లావాదేవీలేమిటో తమకే తెలియదు గనుక, వాటిని అందించలేమని ప్రభుత్వాలకూ, న్యాయస్థానాలకూ పదే పదే వాట్సాప్ సంస్థ చెబుతూ వచ్చింది. అది తమ గోప్యతను నూరుశాతం పరిరక్షిస్తుందని అందరూ నమ్ము తున్నారు. కానీ ఎన్‌ఎస్‌ఓ సంస్థ దీన్నంతటినీ కుప్పకూల్చింది. ఇలాంటి నిఘా వల్ల జరిగే ప్రమాదం సాధారణమైనది కాదు. కొన్ని నెలలక్రితం ఈ స్పైవేర్ ద్వారానే అమెరికాలో నివాసం ఉంటున్న సౌదీ అరేబియా పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీని సౌదీ ప్రభుత్వం టర్కీ గడ్డపై గుట్టు చప్పుడు కాకుండా హతమార్చింది. ఈ స్పైవేర్‌ను ఎస్‌ఎస్‌ఓ 45 దేశాల్లో అమ్మిందని, అందులో కనీసం ఆరు దేశాల్లో సామాజిక కార్యకర్తలను గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారని టొరంటో యూనివర్సిటీకి చెందిన సిటిజన్ లాబ్ అనే సంస్థ అంచనా వేస్తోంది.
పుట్టి పాతికేళ్లు కాకుండానే సైబర్ ప్రపంచం మన వ్యక్తిగత జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. వీధి చివరి చిన్న దుకాణంలో టీ తాగడం మొదలుకొని కోట్లాది రూపాయల లావాదేవీల వరకూ దేన్నయినా క్షణాల్లో చేసిపెట్టేందుకు ఈ సైబర్ ప్రపంచం వీలిస్తోంది. పర్యవసానంగా దీనిపై ఆధారపడేవారి సంఖ్య పెరుగుతోంది. పైకి అంతా ప్రశాంతంగా, సవ్యంగా సాగిపోతున్నట్టు కనబడే ఈ సైబర్ ప్రపంచంలో అడుగడుగునా మందుపాతరలు నిక్షిప్తమై ఉంటాయి. దొంగదాడికి నేరగాళ్లు సిద్ధంగా ఉంటారు. గతంలో తమ డెబిట్, క్రెడిట్ కార్డుల పాస్‌వర్డ్‌లు అంగట్లో దొరుకు తున్నాయని వెల్లడైనప్పుడు ప్రజలంతా వణికిపోయారు. తమ ఈమెయిళ్లు ‘ఎవరో’ తనిఖీ చేస్తు న్నారని, తమ ఫోన్లు ‘ఎవరో’ వింటున్నారని తరచు అనేకులకు అనుమానాలొస్తుంటాయి. కానీ అవి అనుమానాలు మాత్రమే కాదని, గగుర్పొడిచే వాస్తవాలని ఇప్పుడు రుజవైంది. వాట్సాప్ సంస్థ ఎన్‌ఎస్‌ఓపై అమెరికా న్యాయస్థానాల్లో కేసులు వేసింది. కానీ తమ గోప్యతను గుల్ల చేసిన ఎన్‌ఎస్‌ఓపైనా, రక్షణ కల్పించలేకపోయిన వాట్సాప్ సంస్థపైనా దేశదేశాల్లోనూ వ్యాజ్యాలు పడటం ఖాయం. టెక్నాలజీ విస్తరిస్తున్నకొద్దీ ప్రపంచం ఎంత సంకుచితంగా, ఎంత అనైతికంగా తయార వుతున్నదో తాజా ఉదంతం వెల్లడిస్తోంది. మన దేశంలో ఈ నిర్వాకం చేసిందెవరో విచారించి రాబట్టడం కేంద్రం బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment