పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేసే అంశంలో ప్రభుత్వాల్లో దశాబ్దాలుగా నెలకొన్న అస్పష్టత ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలు దెబ్బతినే స్థితికి చేర్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కోటాను ప్రాథమిక హక్కుగా పరిగణించడం లేదా వాటిని వర్తింపజేయమని ప్రభుత్వాలను ఆదేశించడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ విషయమై వున్న సందిగ్ధతను తొలగించడానికి గిన చర్యలు తీసుకోమంటూ చాన్నాళ్లుగా దళిత సంఘాలు కోరుతూనే వున్నాయి. కానీ కదిలికేది? తీరా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక కారణం మీరంటే మీరని ఆ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పార్లమెంటులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. కుల వివక్ష అంతం కావడానికి... సమాజ పురోగతిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిజమైన భాగస్వామ్యం దక్కడానికి, వివక్ష పోవడానికి ఆ వర్గాలకు చదువుల్లో, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఒక్కటే మార్గమని మన రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లవు తున్నా వివక్ష అంతరించలేదు. అది కొత్త కొత్త రూపాల్లో తలెత్తుతున్నది. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలొచ్చినవారు సైతం పదోన్నతుల్లో అన్యాయానికి గురవుతున్న సందర్భాలు కోకొల్లలుగా వుంటున్నాయి. తొలిసారి 1957లోనే అప్పటి రైల్వే మంత్రి జగ్జీవన్‌రామ్ దీన్ని గుర్తించారు. పదోన్నతుల్లో సైతం కోటా అమలు చేయడానికి వీలుగా ఆ శాఖలో విధానం రూపొందించారు. అయితే ఈ మాదిరి నిర్ణయాలు తరచు వివాదాస్పదంగా మారుతున్నా ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయి.
ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకూ అంగీకరిస్తున్నవారు కూడా పదో న్నతుల్లో పని తీరు, సర్వీసు ప్రామాణికం కావాలి తప్ప రిజర్వేషన్లు ఎందుకివ్వాలన్న ప్రశ్న లేవ నెత్తుతున్నారు. కానీ ఉద్యోగ నియామకాల్లో అడ్డుతగులుతున్న కులం పదోన్నతుల్లో అడ్డుతగలదని ఎందుకనుకోవాలన్నది దళిత సంఘాల ప్రశ్న. సమాజంలో అడుగడుగునా అసమానతలు, వివక్ష గూడుకట్టుకుని ఉన్నప్పుడు పదోన్నతుల సమయంలో వాటి ప్రభావం పడదని, పడటం లేదని ఎలా చెప్పగలం? కనుకనే ఈ రెండు వాదాలూ అప్పట్లోనే కోర్టుకెక్కాయి. జగ్జీవన్ రామ్ తీసుకొచ్చిన విధానం సరికాదని, రాజ్యాంగ విరుద్ధమని మద్రాసు హైకోర్టు 1959లో కొట్టేసింది. దానిపై కేంద్రం సుప్రీంకోర్టు కెక్కినప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గజేంద్ర గాడ్కర్ నేతృత్వంలోని ధర్మాసనం రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సరైనదేనని 1961లో 3–2 మెజారిటీతో తీర్పునిచ్చింది. కానీ వెనకబాటుతనాన్ని నిర్ధారించే అనేకానేక అంశాల్లో కులం ఒకటి మాత్రమేనని, అదే ఏకైక గీటురాయి కారాదని 1992లో ఇంద్రా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పరిస్థితి మొదటికొచ్చింది. మధ్యలో కొన్ని రాష్ట్రాలు పదోన్నతులు అమలు చేసిన సందర్భాలు న్నాయి. కానీ వాటి రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించినచోట అవి నిలిచిపోయాయి. దీన్ని సరిదిద్దడానికి 1995లో కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగంలోని 16 వ అధికరణలో 4ఏ క్లాజును చేరుస్తూ 77వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది.
అయితే ఈ మార్గంలో పదోన్నతులు పొందుతున్నవారు అంతవరకూ సీనియర్లుగా వున్న తమకు సీనియర్లుగా మారుతున్నారని కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు 1999లో ‘క్యాచ్ అప్’ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ సిబ్బందికి పదోన్నతి వచ్చి, సాధారణ కేటగిరీకి చెందిన తమ సీనియర్లకు వారు సీనియర్లుగా మారితే, తక్షణం ఆ సాధారణ కేటగిరీ వారికి కూడా పదోన్నతి లభిస్తుంది. దీనిపై వినతులు వెల్లువెత్తాక, ఆ ఉత్తర్వును అధిగమించడం కోసం 2001లో అప్పటి వాజపేయి ప్రభుత్వం 85వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 16వ అధికరణలోని 4ఏ క్లాజులో వున్న అస్పష్టతను తొల గించడం దీని ఉద్దేశం. కానీ ఆ తర్వాత వివిధ హైకోర్టులు తమ ముందుకొచ్చే కేసుల్లో వివిధ రకాల తీర్పులిస్తూ వచ్చాయి. వాటిని ఎవరైనా సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడల్లా ‘యధాతథ స్థితి’ కొనసాగించాలంటూ ఉత్తర్వులివ్వడంతో సమస్యకు తాత్కాలిక ఉపశమనం దొరికేది. 2001లోనూ, అంతకుముందు తీసుకొచ్చిన సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అనుమతిస్తూ 2006లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. పదోన్నతుల విషయంలో నిదర్శనాపూర్వకమైన గణాం కాలు అందజేస్తే తప్ప కోటాను అమలు చేయడానికి వీల్లేదని చెప్పింది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్లు పాటించాలని కేంద్రం రాష్ట్రాలను కోరడం సాధ్యంకాదని తెలిపింది. ఆ తర్వాత 2012లో ఉత్తరాఖండ్‌లో రిజర్వేషన్ల ప్రమేయం లేకుండా అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన ప్పుడు అది చెల్లదని రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం నోటిఫికేషన్ సరైందేనని స్పష్టం చేసింది. 2006లో ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటించింది.
దళిత వర్గాల ప్రయోజనాలకు భంగం కలగనీయరాదన్న సంకల్పం వుంటే భిన్న సందర్భాల్లో వెలువడిన ఈ తీర్పుల్ని ప్రభుత్వాలు శ్రద్ధగా అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని తగువిధంగా సవ రించేవి. కానీ అందుకు విరుద్ధంగా అవి మౌనంగా వుండిపోయాయి. తాజాగా వెలువరించిన తీర్పులో పదోన్నతుల్లో కోటా కల్పించవద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు. కాకపోతే పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లభించడంలేదని, ఆ విషయంలో వారికి అన్యాయం జరుగుతు న్నదని లేదా అందులోనూ వెనకబాటుతనం తప్పడం లేదని నిరూపించడానికి అవసరమైన సమా చారాన్ని చూపాలని చెప్పింది. కనుక పదోన్నతుల్లో కోటా ప్రాథమిక హక్కుగా మార్చడమో లేక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విధంగా పకడ్బందీ సమాచారం ఆధారంగా ఆ పదోన్నతులు కల్పించే విధానానికి రూపకల్పన చేయడమో జరగాలి. అంతేతప్ప రాజకీయ ప్రయోజనాలనాశించి పరస్పరారోపణలు చేసుకోవడం కాలహరణమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment