ఘోరం... దారుణం! | Telangana bill tabled in LS; MP uses pepper spray, Speaker suspends 16 lawmakers | Sakshi
Sakshi News home page

ఘోరం... దారుణం!

Published Fri, Feb 14 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

Telangana bill tabled in LS; MP uses pepper spray, Speaker suspends 16 lawmakers

సంపాదకీయం: ప్రజాస్వామ్యాన్ని స్వీయ ప్రయోజన చట్రంలో బంధించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో గురువారం లోక్‌సభలోని విషాదకర పరిణామాలు వెల్లడించాయి. సభలో మైక్రోఫోన్లు విరిగాయి. కంప్యూటర్‌ను విసిరేశారు. పత్రాలు చించేశారు. కొన్నేళ్లుగా...మరీ ముఖ్యంగా గత ఏడు నెలలుగా రాష్ట్రంలో సంభవిస్తున్న అనేకానేక ఘటనలకు ఇవి పరాకాష్ట. తీవ్ర గందరగోళం మధ్య, కనీవినీ ఎరుగని తోపులాటలు, పెప్పర్‌స్ప్రే వినియోగం, ముష్టిఘాతాలు, పరస్పర దూషణలమధ్య విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనను ఎవరూ నిరోధించకుండా చూసేందుకు ఇతర రాష్ట్రాల ఎంపీలను షిండేకు రక్షణగా ఉంచారు. మరికొందరిని సభలో ఇతరచోట్ల మోహరించారు. ‘మీరు మీ సభ్యులను అదుపు చేసుకోండి.

 

సభను సజావుగా నడపండి. బిల్లు ప్రవేశపెట్టేందుకు మేం సహకరిస్తా’మని బీజేపీ ఇచ్చిన హామీకి కాంగ్రెస్ నాయకత్వం చేసిన ‘ఫ్లోర్ మేనేజ్‌మెంటు’ఇది! దేశంలోనే అత్యున్నతమైన చట్టసభను గ్రామ పంచాయతీ సమావేశం స్థాయికి దిగజార్చిన ఈ నేరంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెస్. సభలో షిండే బిల్లు ప్రవేశపెట్టడాన్ని దేశ ప్రజలకు చూపలేని దుస్థితికి పార్లమెంటు చేరుకున్నదంటే అది యూపీఏ ప్రభుత్వ పాలనా నిర్వహణకు బండగుర్తు. బిల్లు ప్రవేశపెడుతూ షిండే మాట్లాడిన నాలుగు ముక్కలూ వినబడటమే తప్ప దృశ్య మాధ్యమంలో ఆయన జాడలేదు. అలా చూపవలసివస్తే చుట్టూ రక్షణగా ఉన్న ఎంపీలూ కనబడతారన్న భయమే అందుకు కారణం కావొచ్చు.  గతంలో ఇటలీ, బల్గేరియా, ఉక్రెయిన్ పార్లమెంట్లలో సంభవించిన పరిణామాలను మన పార్లమెంటుకు కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది.
 
 ఆంధ్రప్రదేశ్ విభజన అన్నది దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్య. అలాంటి జటిలమైన అంశాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఆదినుంచీ అత్యంత అప్రజాస్వామికంగా, బాధ్యతారహితంగా వ్యవహరించింది. ఈ విషయంలో వచ్చే పేరుప్రతిష్టలూ, ఓట్లూ తనకు మాత్రమే లభించాలన్న కుట్రపూరిత ధోరణిని ప్రదర్శించింది. పార్టీ అత్యున్నత స్థాయి విధాన నిర్ణాయక వేదిక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలియజేసే ముందు పార్టీలో అందరినీ కలుపుకుపోదామనుకోలేదు.
 
 పోనీ, తీర్మానం ఆమోదించాకైనా ఆ విధానానికి కట్టుబడితీరాల్సిందేనని సభ్యులకు చెప్పలేదు. ఇందుకు భిన్నంగా రెండు ప్రాంతాల నేతలనూ ఎగదోశారు. ఆయా ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా చేతనైనంత చేయమని, డ్రామాను సాధ్యమైనంతగా రక్తికట్టించమని నూరిపోశారు. సరిగ్గా తెలుగుదేశం కూడా ఈ విషయంలో కాంగ్రెస్ అడుగుజాడల్లో నడిచింది.  రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి అభ్యంతరంలేదంటూ ఆ పార్టీ అధినేత స్పష్టమైన లేఖ ఇచ్చికూడా ఇరువైపులా ఉన్న నేతలను భిన్నస్వరాలు వినిపించమని ప్రోత్సహించారు. ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలుండటం తప్పేమీ కాదు. అయితే, సూత్రబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించే ఏ పార్టీ అయినా ఆ భిన్నాభిప్రాయాలను పార్టీ వేదికల్లోనే పరిష్కరించుకుంటుంది. వ్యతిరేకిస్తున్న నాయకులకు నచ్చజెప్పటమో, వారిని వెళ్లగొట్టడమో...ఏదో ఒకటి చేస్తుంది. ప్రజల ముందు ఒకే స్వరాన్ని వినిపిస్తుంది.
 
 ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటున్న సీపీఎం, వైఎస్సార్‌కాంగ్రెస్‌లు... రాష్ట్రాన్ని విభజించాలని కోరుతున్న టీఆర్‌ఎస్, సీపీఐలు ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. వారి వైఖరిలో లోటుపాట్లుండవచ్చు. అవగాహనలో లోపాలుండవచ్చు. కొందరి మనోభావాలను వారు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. కానీ...అలాంటి వైఖరి ప్రజాస్వామ్యయుతమైనది. ఇందుకు భిన్నంగా... పార్టీ నిర్ణయమేదైనా ప్రాంతీయ వాదనలను వినిపించవచ్చునని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, పరస్పరం తలపడినట్లు నటించమనడం అవకాశవాదానికి, దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట. ఇలాంటి రాజకీయానికి కాంగ్రెస్, టీడీపీలు బరితెగించిన పర్యవసానమే గురువారంనాటి లోక్‌సభ పరిణామాలు. ఇందులో సన్నాయినొక్కులు నొక్కిన బీజేపీ బాధ్యతా ఉంది. బుధవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ మంత్రులు వెల్‌లోకి రావడాన్ని గమనించాకైనా ముందు సొంతింటిని చక్కదిద్దుకోమని చెప్పాల్సిన బీజేపీ...కాంగ్రెస్ కపటనాటకాన్ని కొనసాగించేందుకు దోహదపడింది. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని స్పీకర్ మీరా కుమార్ వ్యాఖ్యానించడంతోపాటు 16మంది ఎంపీలను సస్పెండ్ కూడా చేశారు. అయితే, కాంగ్రెస్ పన్నిన ‘ఫ్లోర్ మేనేజ్‌మెంటు’ వ్యూహంలో ఈ దుస్థితికి బీజాలున్నాయి. తనకు సొంతంగా బలం లేదనుకున్నప్పుడు విపక్షంనుంచి అరువు తెచ్చుకోవడం తప్పుకాదు.
 
  కానీ, తన సభ్యులను నిభాయించుకోలేకపోవడం, బౌన్సర్లను నియమించుకున్నట్టు హోంమంత్రి రక్షణార్ధం రాష్ట్రేతర ఎంపీలను తెచ్చుకోవడం కూడా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చే. ఆ విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని అభిశంసించాకే తప్పుచేశారనుకుంటున్న సభ్యులపై చర్యలకు ఉపక్రమించాలి. అసలు ఇంత గొడవ జరుగుతుందని సర్కారు ముందే ఊహించిందా? అందుకు అనుగుణంగా ఇతరేతర దృశ్యాలు మాత్రమే తెరపై సాక్షాత్కరించాయా? అదే నిజమైతే, అది లోక్‌సభ నిర్వహణా తీరును సైతం సంశయించేలా చేస్తుంది. అందుకే, కొందరు సభ్యులు డిమాండు చేస్తున్నట్టు అన్ని దృశ్యాలనూ సంపూర్ణంగా వీక్షించి, సమగ్రమైన చర్యకు ఆమె పూనుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదనుకుంటే ఇది తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement