సంపాదకీయం: పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో ఉగ్రవాదులు 48 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు బరితెగించిన తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిపరిచింది. దేశంలోనే అతి పెద్దదైన విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని పదిమంది తెహ్రీక్-ఎ- తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు మొదట 13 గంటలపాటు పాక్ భద్రతా దళాలతో హోరా హోరీ పోరాటం జరిపారు. ఈ దాడికి దిగిన పదిమందినీ పాక్ దళాలు మట్టుబెట్టాయి. మరో 27మంది ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. రెండోసారి అదే విమానాశ్రయానికి సమీపంలోని భద్రతా దళాల శిబిరాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రెండు దాడులూ పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాల భద్రతపై ఎన్నో సందేహాలను రేకెత్తిస్తు న్నాయి. ఉగ్రవాదుల మృతదేహాలవద్ద లభ్యమైన ఆయుధాలు, మందు గుండు, ఆహారపదార్థాలు గమనించినా...దాడికి అనుసరించిన విధా నాన్ని పరిశీలించినా వారు సుదీర్ఘమైన దాడికి సిద్ధమై అక్కడికొచ్చారని అర్ధమవుతుంది. సైనిక దుస్తుల్లో ఆటోమేటిక్ రైఫిళ్లు, రాకెట్ చోదిత గ్రెనేడ్లువంటి మారణాయుధాలతో కనీసం వారం పదిరోజులకు సరిపడా ఆహారపదార్ధాలు, మంచినీటితో దుండగులు కరాచీ విమానాశ్రయం ఆవరణలోకి ప్రవేశించారు. తుపాకి కాల్పుల్లో గాయపడితే క్షణాల్లో నొప్పిని, రక్తస్రావాన్ని అరికట్టే ఔషధాన్ని కూడా తెచ్చుకున్నారు.
కరాచీ విమానాశ్రయాన్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడి విమానాలను ధ్వంసంచే సేందుకు, రక్తపాతాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలు పాక్ దళాలు వెనువెంటనే స్పందించడంతో విఫలమయ్యాయి. కొన్నాళ్ల క్రితం అమెరికా ద్రోన్ దాడిలో తమ నాయకుడు హకీముల్లా మెహ్ సూద్‌ను మట్టుబెట్టినందుకు, గ్రామాలపై బాంబు దాడులు చేస్తూ అమాయకులను మట్టుబెడుతున్నందుకు నిరసనగా ఈ దాడికి దిగామని టీటీపీ ప్రకటించింది. తమతో చర్చలకు సిద్ధపడినట్టు కనిపించిన పాకిస్థాన్ సర్కారు ఇటీవల వరస దాడులకు దిగుతుండటంకూడా ఈ ప్రతీకారానికి ముఖ్య కారణమని ఆ సంస్థ తెలిపింది.
హకీముల్లా మెహ్‌సూద్‌ను మట్టుబెట్టాక టీటీపీలో చీలికలొచ్చాయని, పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడిన మెహ్ సూద్ వర్గానికి... ముల్లా ఫజ్లుల్లా వర్గానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గు మంటున్నదని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ చీలికలవల్ల సంస్థ బలహీన పడిందన్న అంచనాలూ వెలువడ్డాయి. ఇందులో ఏమాత్రం నిజంలేదని కరాచీ ఘటనలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాదు...పాకిస్థాన్‌లోని అణు స్థావరాలతోసహా కీలక ప్రాంతాల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. కరాచీ దాడులను తిప్పికొట్టడంలో పాక్ భద్రతాద ళాలు విజయం సాధించి ఉండొచ్చుగానీ...ఉగ్రవాదులు అత్యంత కట్టుది ట్టమైన భద్రతావలయంలో ఉండే విమానాశ్రయంలోకి సులభంగా చొరబడగలిగారంటే సామాన్యమైన విషయం కాదు.
సైనిక దుస్తులు ధరించినంతమాత్రానే వారి వాహనాలు సులభంగా విమానాశ్రయ ఆవరణలోకి చేరుకోగలిగాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రయా ణికులతో రద్దీగా ఉండే ప్రాంతంవైపునకు చొచ్చుకు రావడానికి ఉగ్రవా దులు చేసిన ప్రయత్నం ఫలించివుంటే అంతర్జాతీయ విమాన సర్వీసులతో నిత్యం రద్దీగా ఉండే ఆ విమానాశ్రయం ఉగ్రవాదుల దిగ్బంధంలో చిక్కుకునేది. అది కొన్ని రోజులపాటు కొనసాగి ప్రమాదకరమైన పరిణామాలు సంభవించేవి. మూడేళ్లక్రితం కరాచీ నౌకాదళ స్థావరంపై కూడా ఇదే తరహా దాడి సాగింది. అప్పుడైతే 16 గంటలపాటు లోపలి సిబ్బందిని నిలువరించి రెండు గూఢచారి విమానాలనూ, ఒక హెలికాప్టర్‌నూ ధ్వంసంచేశారు. 10మంది నావికా సిబ్బందిని హతమార్చారు. 2009లో రావల్పిండిలోని సైనిక ముఖ్య కార్యాలయంపై కూడా ఈ తరహా దాడే చేసి సీనియర్ సైనికాధికా రులతోసహా 8మందిని కాల్చిచంపారు. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా పాక్ ప్రభుత్వం గుణపాఠాలు నేర్వలేదని తాజా ఘటన నిరూపిస్తున్నది. ఈ ఘటనలన్నిటా దుర్భేద్యమైన భద్రతావలయాన్ని ఉగ్రవాదులు ఛేదించడం కనిపిస్తుంది.
ఒకనాడు తాను పెంచిపోషించిన ఉగ్రవాదం... తన ప్రయోజనాల సాధనకు ఉపయోగపడిన ఉగ్రవాదం ఇప్పుడు తననే గురిచూస్తున్న వైనం పాక్‌ను ఇరకాటంలో పడేసింది. అక్కడ ఉగ్రవాదులదే పైచేయిగా మారితే అది పాకిస్థాన్‌కు మాత్రమే కాదు...పొరుగునున్న మనతోసహా ప్రపంచానికంతకూ ముప్పుతెచ్చిపేట్టే పరిణామమే అవుతుంది. తమ అణ్వాయుధ సంపత్తి పటిష్టమైన నేషనల్ కమాండ్ అథారిటీ నేతృత్వంకింద భద్రంగా ఉన్నదని పాక్ పాలకులు తరచు చెబుతుంటారు. దీన్ని ఛేదించడం ఎవరి తరమూ కాదని అంటారు. కానీ, కరాచీలో జరిగిన తాజా దాడి అలాంటి భరోసానివ్వడంలేదు. ఉగ్రవాద స్థావరాలపై అటు అమెరికా ద్రోన్‌లు, ఇటు పాక్ విమానాలు సాగించే దాడులు ఒక్కోసారి దారి తప్పి అమాయకులను కూడా మట్టుబెడుతున్న సంగతి రహస్యమేమీ కాదు.
ఇలాంటి అవాం ఛనీయమైన సందర్భాలను పరిహరించడంతోపాటు ఉగ్రవాద మూలా లను దుంపనాశనం చేసే దిశగా కూడా పాక్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా భారత్‌తో చెలిమికి తాను ఒకడుగు ముందుకేసినప్పుడల్లా ఉగ్రవాదం జడలు విప్పుతున్న తీరును గమనించాలి. ఇటీవల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన దేశ పర్యటనకు రావడం, పరస్పర సాన్నిహిత్యానికి ఒక ప్రాతిపదిక ఏర్పడటం ఉగ్రవాద ముఠాలకు రుచిం చడంలేదు. కరాచీ ఘటన పాక్‌కు గుణపాఠం కావాలి. ఉగ్రవాద సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలోనూ, ఉగ్రవాద నిర్మూలనలోనూ భారత్‌తో కలిసి పనిచేస్తేనే ఈ బెడదను నివారించగలమని పాక్ గుర్తించాలి. అలాచేస్తేనే మొత్తంగా ఉపఖండంలో శాంతి నెలకొం టుందని ఆ దేశం గుర్తించాలి.
కరాచీ చెప్పే గుణపాఠం!
Published Thu, Jun 12 2014 1:12 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM
Advertisement