అభ్యంతరాలన్నీ అరణ్యరోదనవుతున్నచోట పోరే శరణ్యమవుతుంది. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంత రైతులు రాజధాని కోసం భూములు సేకరిస్తున్న తీరుపై భగ్గుమంటున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని తాము ఇచ్చేది లేదని కరాఖండీగా చెబుతున్నారు. వారి అభ్యంతరాలగురించి చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి ఆందోళనేమిటో తెలుసుకుని సరిచేయడానికి ప్రయత్నించిందీ లేదు. కానీ రెండో పంటకు అనుమతి లేదంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. దీనిద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 200 చదరపు కిలోమీటర్ల పరిధిలోని వేలాది ఎకరాల పంట పొలాల్లో వ్యవసాయ కార్యకలాపాలను శాశ్వతంగా నిలిపేయాలని రైతులకు ప్రభుత్వం హుకుం జారీచేస్తున్నది.
ఆ ప్రాంతంలో ‘అక్రమ నిర్మాణాల’ను కూల్చేస్తామని హెచ్చరిస్తున్నది. ఈ పంటపొలాలపై ఆధారపడ్డ రైతులు, కౌలు రైతులు, రైతుకూలీలు, ఇతరులు ఇకపై ఏం పని చేసుకోవాలో, ఎలా బతకాలో చెప్పకుండానే... అసలు వారి గురించి ఎలాంటి ఆలోచనా లేకుండానే ఈ నోటిఫికేషన్ జారీచేశారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది మొదలుకొని ప్రభుత్వం సాగిస్తున్న నాటక పరంపరలో ఇది తాజా అంకం. మొదటగా అక్కడి రైతులంతా స్వచ్ఛందంగా భూములు అప్పగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారన్నట్టు ప్రభుత్వం ప్రచారం లంకించుకుంది. భూ సేకరణ చట్టంకింద భూములు తీసుకుంటే రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది గనుక భూ సమీకరణకింద వాటిని తీసుకోదల్చుకున్నామని ప్రకటించింది. మొత్తం 57,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం సేకరించదల్చుకున్నట్టు, దాన్ని భవిష్యత్తులో లక్ష ఎకరాలకు పెంచదల్చుకున్నట్టు తెలియజేసింది. దానికి కొనసాగింపుగా గత నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సీఆర్‌డీఏను ఏర్పాటుచేస్తూ తీర్మానించింది. డిసెంబర్ నెలలో భూ సమీకరణ తంతు ఎంతో ఆర్భాటంగా మొదలైంది. రైతులంతా స్వచ్ఛందంగా భూములివ్వడానికి క్యూ కట్టినట్టు చూపడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నిజమైన పక్షంలో ఈపాటికల్లా కనీసం తుళ్లూరు చుట్టుపక్కల ఉన్న 20,000 ఎకరాల మెట్ట భూములైనా సర్కారుకు దఖలు పడాలి. ఆ భూముల్ని ఇచ్చేందుకు చాలామంది ముందుకొచ్చారు. కానీ, ప్రస్తుతం సీఆర్‌డీఏ కమిషనర్ చెబుతున్నదాన్ని బట్టి కేవలం 7,500 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం సమీకరించగలిగింది. అంటే భూములు ఇస్తామన్నవారు కూడా ఇప్పుడు సంశయంలో పడ్డారని అర్థమవుతున్నది. దీనంతటి పర్యవసానమే తాజా బెదిరింపు నోటిఫికేషన్.
భూ సమీకరణ స్వచ్ఛందమైనదేనని తొలినాళ్లలో ప్రకటించిన సంగతిని ప్రభుత్వం మరిచినట్టు కనబడుతున్నది. ఇవ్వదల్చుకోనివారు తమ అభ్యంతరా లేమిటో చెప్పాలని, అందుకోసం 9.2 ఫారాలు నింపి ఇవ్వాలని చెప్పిన అధికారులు ఇప్పుడు వాటితో నిమిత్తం లేకుండా ఇకపై ఆ ప్రాంతంలో అసలు పంటలే పండించవద్దంటున్నారు. ఇప్పటివరకూ భూ సమీకరణ ద్వారా తీసుకున్న భూముల గురించి నోటిఫికేషన్ ప్రస్తావించి, వాటిల్లో రెండో పంట వేయొద్దనడం వేరు. వాస్తవానికి అది కూడా అన్యాయమే అవుతుంది.
ఎందుకంటే, ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే ఎప్పుడో జూన్ నెలకుగానీ రాజధాని ప్లానింగ్ సిద్ధమయ్యే అవకాశం లేదు. ఇలాంటి స్థితిలో తమకు తామే స్వచ్ఛందంగా, లిఖితపూర్వకంగా భూములిస్తామని పూచీపడిన రైతులను అనుమానించడానికేమీ లేదు. జూన్‌లోగా వారు ఆ భూముల్లో ఏదైనా పండించుకోవడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకుండాలి? ఏదీ ఇంకా తేలని ఈ దశలోనే వేలాది ఎకరాల్లో రెండో పంట వేయొద్దంటూ హుకుం జారీచేయడ మంటే అన్నదాతను కుంగదీయడమే. వారి కుటుంబాలను అనిశ్చితిలో నడిరోడ్డున నిలబెట్టడమే. నిరంకుశంగా, ఏకపక్షంగా వ్యవహరించడమే.
రైతుల భూముల్ని చెరబట్టడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న పార్టీలపైనా, ప్రజాసంఘాలపైనా చంద్రబాబు సర్కారు ఆదినుంచీ నిందాపూర్వక ఆరోపణలు చేస్తున్నది. వారికసలు విజయవాడ-గుంటూరుమధ్య రాజధాని నగర నిర్మాణమే ఇష్టంలేదని అంటున్నది. రాజధాని నగర ఎంపిక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్న విమర్శలే తప్ప అక్కడ రాజధాని వద్దని ఎవరూ అనలేదు. పైగా ఆ ప్రాంతంలోనే దాదాపు 12,000 ఎకరాల మేర ప్రభుత్వ భూములున్నాయని, ఇవి చాలవనుకుంటే మెట్ట ప్రాంతంలోని మరికొన్ని వేల ఎకరాల భూముల్ని తీసుకోవచ్చునని పలువురు నేతలు చెబుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి 20,000 ఎకరాలకు మించి అవసరం లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వం వీటన్నిటినీ పెడచెవిని పెట్టి లక్షలాది మందికి జీవనాధారమైన పచ్చటి పంటపొలాలను బీళ్లుగా మార్చాలని చూస్తున్నది. ఒక ఎకరం నేలను పంట పొలంగా మార్చడంలోని శ్రమ ఎంతో, అందుకయ్యే వ్యయమెంతో తెలుసున్నవారెవరూ ఇంత బాధ్యతా రహితంగా వ్యవహరించలేరు.
ఇప్పుడు ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతంలో బంగారు పంటలు పండే సారవంతమైన జరీబు భూములున్నాయి. ఏడాది పొడవునా అవి పచ్చగా కళకళలాడుతుంటాయి. ఆ ప్రాంత ప్రజానీకానికి రెండు చేతులా పనికల్పిస్తాయి. రైతులకు లక్షలాది రూపాయలు ఆర్జించిపెడతాయి. ఇలాంటి భూముల్ని రాజధాని పేరుతో కాంక్రీట్ అరణ్యంగా మార్చడానికి ప్రభుత్వానికి మనసెలా వచ్చిందో అర్ధంకాదు. రాజధాని ప్రాంత రైతులను బెదిరించి దారికితెచ్చే పనులను బాబు ప్రభుత్వం విరమించుకోవాలి. కనీసం ఈ దశలోనైనా ఎన్డీయే సర్కారు జోక్యం చేసుకుని ఇలాంటి చర్యలు సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి. రైతు కంట నీరొలికితే రాజ్యానికి అది అరిష్టమని పాలకులు తెలుసుకోవాలి.
రైతులతో చెలగాటమా!
Published Thu, Jan 29 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement