సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అమల్లోకి తెచ్చిన పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో అనేక తప్పులు దొర్లాయి. ఇంగ్లిష్ మీడియం గణితం పుస్తకంలో ఒకటి కాదు రెండు కాదు 191 అక్షర దోషాలు చోటుచేసుకున్నాయి. కొన్ని పదాల్లో అక్షరాలే లేకపోగా, మరికొన్ని పదాల్లో రెండు పదాలు వచ్చాయి. ఇంకొన్నింటిలో ఒక అక్షరానికి బదులు మరో అక్షరం ముద్రితమయ్యాయి. అంతేకాదు ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ అనేక అక్షర దోషాలతోపాటు అన్వయ దోషాలు ఉన్నాయి. ఒక్క పొరపాటు కూడా లేకుండా రూపొందించాల్సిన పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి తప్పులు దొర్లడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఈ తప్పులనే సరైనవనే భ్రమతో చదువుకుంటారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రామకృష్ణ వెల్లడించారు. భవిష్యత్తులో విద్యార్థులకు అవే తప్పులను కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీంతోపాటు ఇతర సబ్జెక్టుల్లోనూ అనేక తప్పులు దొర్లినట్లు వెల్లడించారు. వెంటనే అధికారులు స్పందించి పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిదిద్దాలని కోరారు.