
యు ముంబాకు ప్రో కబడ్డీ ట్రోఫీ
అంతర్జాతీయం
ప్రధాని మోదీ యూఏఈ పర్యటన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 16 నుంచి రెండురోజుల పాటు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటించారు. అబుదాబిలో యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్‌నహియాన్‌తో చర్చలు జరిపారు. మధ్యప్రాచ్య, గల్ఫ్ దేశాల్లో కొన్ని చోట్ల హింస, అస్థిర పరిస్థితులు ఉండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని యువరాజు అల్ నహియాన్ ప్రధానికి హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా మోదీ... మూడో అతిపెద్ద చారిత్రక మసీదు షేక్ జాయేద్ గ్రాండ్‌ను సందర్శించారు. ఆగస్టు 17న దుబాయ్‌లో 50 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాటం జరపాలని ఆయన పిలుపునిచ్చారు. దుబాయ్‌లో వ్యాపారవేత్తల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు..
అవార్డులు
2015 ధ్యాన్‌చంద్ పురస్కారం 2015 ధ్యాన్‌చంద్ పురస్కారం ముగ్గురికి లభించింది. హైదరాబాద్‌కు చెందిన డేవిస్ కప్ మాజీ కెప్టెన్ ఎస్.పి.మిశ్రా, వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్ కీపర్ రోమియో జేమ్స్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు ధ్యాన్‌చంద్ పేరిట జీవిత సాఫల్య పురస్కారం ప్రభుత్వం అందజేస్తుంది.
ప్రొ.పురుషోత్తం రెడ్డికి కుల్దీప్‌సింగ్ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ టి.పురుషోత్తం రెడ్డికి జస్టిస్ కుల్దీప్ సింగ్ అవార్డును ఆగస్టు 21న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి పురుషోత్తం రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
రాష్ట్రీయం
తాడేపల్లిగూడెంలో నిట్‌కు శంకుస్థాపన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 20న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. రూ.300 కోట్లతో నిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సోలార్ నగరాలు
కేంద్ర కొత్త, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఎంపిక చేసిన సోలార్ నగరాల ాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తెలంగాణలోని మహబూబ్‌నగర్ పట్టణాలకు చోటుదక్కింది. ఆగస్టు 22న ప్రకటించిన జాబితాలో మొత్తం 50 నగరాలు/పట్టణాల్లో విజయవాడ, మహబూబ్‌నగర్ ఉన్నాయి. ఒక్కో నగరానికి అక్కడ నివసిస్తున్న జనాభా ఆధారంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తుంది.
ఏపీలోని గ్రామాలను టాటా గ్రూప్ దత్తత
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 264 గ్రామాలను టాటా ట్రస్టులు దత్తత తీసుకున్నాయి. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా గ్రూప్‌ల మధ్య విజయవాడలో ఆగస్టు 24న సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టాటా ట్‌స్ట్‌ల్ర చైర్మన్ రతన్ టాటా పాల్గొన్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు ట్రస్టులు కృషి చేస్తాయి.
వార్తల్లో వ్యక్తులు
శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే ఆగస్టు 21న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఆగస్టు 17న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) విజయం సాధించింది. పార్లమెంటులోని 225 స్థానాలకు యూఎన్‌పీ 106 స్థానాలు గెలుచుకుంది. ఈ పార్టీకి పార్లమెంటులో మెజార్టీకి మరో ఏడు స్థానాలు కావాల్సి ఉంది. సిరిసేన నేతృత్వంలోని ఫ్రీడం పార్టీతో కలిసి విక్రమ సింఘే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి సతీమణి సువ్రా ముఖర్జీ మృతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) న్యూఢిల్లీలో ఆగస్టు 18న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె 1940, సెప్టెంబరు 17న ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌లో జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలను పాటలు,నృత్యరూపకాలుగా ప్రపంచమంతటా ఆమె ప్రచారం చేశారు. ఇందుకోసం ఆమె 1982లో గీతాంజలి ట్రూప్‌ను స్థాపించారు. ఆమె పెయింటింగ్‌లతో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇందిరా గాంధీతో తన అనుబంధంపై ‘చోఖేర్ అలోయి’, చైనా పర్యటనల అనుభవాలపై ‘చెనా అచెనాయ్ చిన్’ అనే పుస్తకాలు రాశారు.
గ్రీసు ప్రధాని రాజీనామా
గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఆగస్టు 20న తన పదవికి రాజీనామా చేశారు. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతో ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు వచ్చే మూడేళ్లకు గ్రీసు 86 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ యూరోజోన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆర్థికం
బంధన్ బ్యాంకు ప్రారంభం దేశీయ బ్యాంకింగ్ రంగంలో కోల్‌కతాలో మరో పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకు ‘బంధన్’ ఆగస్టు 23న ప్రారంభమమైంది. దీన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో తొలివిడతగా 501 శాఖలు, 2,022 సర్వీస్ సెంటర్లు, 50 ఏటీఎంలతో కార్యకలాపాలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంకు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 27 రాష్ట్రాల్లో మొత్తం 632 శాఖలు, 250 ఏటీఎంలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా తమ సేవలను కొనసాగిస్తామని తెలిపింది. ‘కస్టమర్ ఫస్ట్’ తమ వ్యాపార సిద్ధాంతమని బ్యాంకు చీఫ్ చంద్రశేఖర ఘోష్ తెలిపారు.
నల్లధనంపై సెబీ యుద్ధం
పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకుంటున్న 59 సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా/పరోక్షంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు/అమ్మకం వంటి కార్యకలాపాలు నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిలో హెచ్‌ఎన్‌ఐ, శ్రీకమోడిటీస్, మహాకాళేశ్వర్ మైన్స్ తదితర సంస్థలు ఉన్నాయి.
పతనమైన రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్ల పతనం కారణంగా ఆగస్టు 24న రూపాయి విలువ తగ్గింది. డాలర్‌తో పోల్చితే దేశీ కరెన్సీ మారకం విలువ 66 స్థాయి కంటే కిందకు పడిపోయింది. 82 పైసలు క్షీణించి 66.65 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే రూపాయి విలువ ఇంతగా పడిపోవడం ఈ ఏడాదిలోనే ఇది తొలిసారి. ఇది రెండేళ్ల కనిష్టం కూడా. చైనా తమ కరెన్సీని డీవాల్యూ చేయడంతో గత రెండు వారాల్లో ఏకంగా 202 పైసలు పడిపోయింది.
జాతీయం
బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని అరాలో ఆగస్టు 18న జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటికే బీహార్‌లో కేంద్ర నిధులతో కొనసాగుతున్న రూ.40 వేల కోట్ల విలువైన కార్యక్రమాలకు ప్రస్తుత ప్యాకేజీ అదనం. బీహార్‌లోని 21 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 18న వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించింది. దీనివల్ల నూతన తయారీ పరిశ్రమలు, భవనాల ఏర్పాటుకు 15 శాతం ఆదాయపన్ను రాయితీ లభిస్తుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆగస్టు 27న జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆగస్టు 27న సాయంత్రం 4.52 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు అన్ని పరీక్షలు జరిపి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా బోర్డు నిర్వహించింది. ఆగస్టు 26 మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి, 29 గంటల తర్వాత ఆగస్టు 27 సాయంత్రం 4.52కు ప్రయోగం నిర్వహించాలని నిర్ణయించారు.
క్రీడలు
యు ముంబాకు ప్రో కబడ్డీ ట్రోఫీ
ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను యు ముంబా గెలుచుకుంది. ముంబైలో ఆగస్టు 23న జరిగిన ఫైనల్లో బెంగళూరు బుల్స్‌ను యు ముంబా ఓడించింది. టైటిల్ గెలిచిన యు ముంబా జట్టుకు రూ.కోటి, బెంగళూరుకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీగా సందీప్ (టైటన్స్), రైడర్ ఆఫ్ ది టోర్నీగా కషిలింగ్ (ఢిల్లీ), డిఫెండర్ ఆఫ్ ది టోర్నీగా రవీందర్ (ఢిల్లీ), ఆల్‌రౌండర్ ఆఫ్ ది టోర్నీగా మంజీత్ చిల్లర్ (బెంగళూరు) నిలిచారు.
హామిల్టన్‌కు బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 23న జరిగిన రేసులో హామిల్టన్ టైటిల్ సాధించగా, రోస్‌బర్గ్, గ్రోస్యెన్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.
ఉసేన్ బోల్ట్‌కు 100 మీటర్ల టైటిల్
2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచాడు. బీజింగ్‌లో ఆగస్టు 23న జరిగిన 100 మీటర్ల పరుగులో బోల్ట్ 9.79 సెకన్లలో రేసును ముగించి మొదటి స్థానం సాధించాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ 9.80 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు. బోల్ట్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకు చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ రేసులో డాఫ్నీ చిపర్స్(నెదర్లాండ్స్) రజతం, టోరీ (అమెరికా) కాంస్యం సాధించారు.
ఫెదరర్‌కు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్
సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. సిన్సినాటి (అమెరికా)లో ఆగస్టు 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఫెదరర్ ఓడించాడు. ఈ టైటిల్ ఫెదరర్ గెలుచుకోవడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో సిమోనా హాలెప్‌ను సెరెనా ఓడించింది.
క్రికెట్ నుంచి విరమించుకున్న సంగక్కర
శ్రీలంక క్రికెట్‌కు 15 ఏళ్లుగా సేవలందించిన సీనియర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర(37) ఆట నుంచి విరమించుకున్నాడు. ఆగస్టు 24న కొలంబోలో భారత్‌తో ముగిసిన రెండో టెస్టు నుంచి ఆయన తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆయనకు తోటి ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తదితరులు పాల్గొన్నారు. 134 టెస్టులు ఆడిన సంగక్కర 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. 404 వన్డేల్లో 14,234 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి.