
ఎంసెట్ కౌన్సెలింగ్.. తెలుసుకోవాల్సినవెన్నో..
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్..
మే 27న నోటిఫికేషన్..
జూన్ 27 నాటికి క్లాసుల ప్రారంభం
టీఎస్ ఎంసెట్.. మే 15న పరీక్ష..
జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్..
జూలై 1 నాటికి క్లాసుల ప్రారంభం..
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ సమాచారం
మొత్తం సీట్లు: 1,57,074
ప్రభుత్వ కళాశాలలు: 17
ప్రైవేటు కాలేజ్‌లు: 305
కౌన్సెలింగ్ తేదీలు
కౌన్సెలింగ్ ప్రకటన: మే 27, 2016
సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 6
వెబ్ ఆప్షన్స్ నమోదు: జూన్ 9 నుంచి 18 వరకు
సీట్ అలాట్‌మెంట్: జూన్ 22
క్లాసుల ప్రారంభం: జూన్ 27
టీఎస్ ఎంసెట్ ఇన్ఫో..
ఇంజనీరింగ్ దరఖాస్తులు: 1.43 లక్షలు
ఎంసెట్ తేదీ: మే 15
ఫలితాలు: మే 27లోపు
కౌన్సెలింగ్ నోటిఫికేషన్: జూన్ మొదటి వారం
వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ: జూన్ 20 నాటికి పూర్తి
క్లాసుల ప్రారంభం: జూలై 1 నుంచి
సీట్లు: గత ఏడాది గణాంకాల ప్రకారం మొత్తం సీట్లు 1,26,468.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కళాశాలల గుర్తింపు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం.. మొత్తం 1,26,468 సీట్లకుగాను 20 వేల సీట్లు తగ్గే అవకాశాలున్నాయి.
ఇంజనీరింగ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ తేదీలు కూడా వెల్లడించారు.. మరోవైపు.. తెలంగాణ ఎంసెట్‌కు సర్వం సిద్ధమైంది. మే 15న టీఎస్ ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను సైతం ప్రకటించారు. ఇప్పుడు విద్యార్థుల కర్తవ్యం సరైన బ్రాంచ్, కాలేజ్ ఎంపిక. మెచ్చిన కాలేజీ, నచ్చిన బ్రాంచ్‌లో సీటు రాకుంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఔత్సాహికులకు సలహాలు.. సూచనలు..
తొలి ప్రాధాన్యం బ్రాంచ్ ఎంపిక
విద్యార్థులు బ్రాంచ్ ఎంపికను తొలి ప్రాధాన్యంగా భావించాలి. తమ ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా వ్యవహరించాలి. క్రేజ్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోకూడదు. ఆ బ్రాంచ్‌తో నాలుగేళ్లు చదవాలి. కాబట్టి ఆ కాలంలోనూ, తర్వాత ఆ బ్రాంచ్‌కుండే ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇష్టం లేని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటే అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు.
కాలేజ్.. ఎంపికలో కీలక కసరత్తు
ఏఐసీటీఈ నిబంధనలు
కాలేజ్ ఎంపికలో ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకు అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? గుర్తించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ప్రత్యక్షంగా కళాశాలలను పరిశీలించి కూడా సమాచారం తెలుసుకోవాలి.
టీచింగ్ - లెర్నింగ్
కళాశాలలో బోధన పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలిస్తుంటాయి.
ఎన్‌బీఏ గుర్తింపు
ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు మొత్తం బ్రాంచ్‌లలో ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్ అని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటన లిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తత అవసరం.
విద్యార్థుల ఆదరణ
గతేడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీ విషయంలో ఓపెనింగ్- క్లోజింగ్ ర్యాంకుల వివరాలు సేకరించాలి. ఉదాహరణకు ఓయూసీఈ, ఏయూసీఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదే విధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే.. ఆయా కళాశాలల పనితీరు ఆధారంగా అవి విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.
నచ్చిన కాలేజ్
కోరుకున్న కళాశాలలో సీటు రాకపోవచ్చు. అలాంటి పరిస్థితికి కూడా ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. ఇష్టంలేని కాలేజ్‌లో చేరాల్సి వస్తే.. అకడమిక్‌గా రాణించేందుకు కృషిచేయాలి. సెల్ఫ్‌లెర్నింగ్ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా ఎంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ-లెర్నింగ్ పోర్టల్స్, ఆన్‌లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లేబొరేటరీ వంటి సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు, అమలవుతున్న కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే మెచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్‌లో సీటు వచ్చినా విద్యార్థులు క్లాస్ రూమ్‌లో నేర్చుకునేది 40 నుంచి 50 శాతం మధ్యలోనే. మిగతాదంతా వాస్తవ పరిస్థితుల ఆధారంగా స్వీయ లెర్నింగ్‌పై ఆధారపడి ఉంటోంది.
మెచ్చిన బ్రాంచ్
ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేదనిపిస్తే.. ప్రత్యామ్నాయంగా సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌లవైపై దృష్టిసారించాలి. వీటి ద్వారా లభించే అవకాశాల గురించి తెలుసుకోవాలి.
ప్లేస్‌మెంట్స్
ఇంజనీరింగ్‌లో చేరుతున్న ప్రతి విద్యార్థి ప్రధాన ఉద్దేశం భవిష్యత్‌లో మంచి అవకాశాలు అందుకోవడమే అనేది నిస్సందేహం. కాబట్టి కాలేజీని ఎంపిక చేసుకునే క్రమంలో.. సదరు కళాశాలలో గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్ గణాంకాలు పరిశీలించాలి. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.. వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో గమనించాలి.
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల సంఖ్య, అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య పరంగా మరో పది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటికే 58 కళాశాలలకు వాటి ప్రమాణాలలేమి కారణంగా నోటీసులు ఇచ్చాం. కొన్ని కళాశాలలు బ్రాంచ్‌ల వారీగా క్లోజర్ దరఖాస్తు చేసుకున్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే కొంత మేర సీట్లు తగ్గుతాయి.
- ప్రొఫెసర్.ఎన్.యాదయ్య, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ-హైదరాబాద్
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు వెల్లడయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌లు, ఆ బ్రాంచ్‌ల బోధనలో పేరు గడించిన ఇన్‌స్టిట్యూట్‌ల గురించి అన్వేషణ సాగించాలి. తమ ర్యాంకు పరిధికి సదరు బ్రాంచ్‌లో గత ఏడాది సీటు లభించిన కాలేజ్‌ల వివరాలు తెలుసుకుని వాటిలో బెస్ట్ కాలేజ్‌లతో జాబితా రూపొందించుకుని సిద్ధంగా ఉండాలి.
-ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబా, కన్వీనర్, ఏపీ ఎంసెట్
స్కిల్ డెవలప్‌మెంట్
ప్లేస్‌మెంట్స్ పరంగా కంపెనీలు కోరుకునే స్కిల్స్, విద్యార్థుల్లో వాటిని పెంపొందించేందుకు కొన్ని కళాశాలలు కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ల పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణనిస్తున్నాయి. అప్పుడే అకడమిక్ నైపుణ్యాలతోపాటు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా అలవడతాయి.
కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు
విద్యార్హతల సర్టిఫికెట్లు కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హులు) ఎంసెట్ హాల్‌టికెట్
ఎంసెట్ ర్యాంక్ కార్డ్ నివాస ధ్రువీకరణ పత్రం
ప్రత్యామ్నాయాలెన్నో
ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి లేకపోయినా.. బ్రాంచ్, కాలేజీ నచ్చినా నచ్చకున్నా ముందు బీటెక్‌లో చేరదాం.. ఆ తర్వాత ఆలోచిద్దాం..! అనే ధోరణి ఎంత మాత్రం సరికాదు అంటున్నారు నిపుణులు. మెచ్చిన బ్రాంచ్‌లో, నచ్చిన కాలేజ్‌లో సీటు రాకపోతే డిగ్రీ కోర్సులపై దృష్టిపెట్టొచ్చు. ఇవేకాకుండా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉండే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీనే కావాలనుకునే విద్యార్థులు ఇటు బీఎస్సీ చేస్తూనే ఏఎంఐఈ, ఏఎంఐఈటీఈ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో మెంబర్‌షిప్ ద్వారా బీటెక్ తత్సమాన అర్హత గల సర్టిఫికెట్ సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్‌ఈఆర్ వంటి జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.