యాప్స్ వరల్డ్ | Apps World | Sakshi
Sakshi News home page

యాప్స్ వరల్డ్

Published Thu, Dec 1 2016 12:41 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

యాప్స్  వరల్డ్ - Sakshi

యాప్స్ వరల్డ్

మనకు స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం గడవదు. సమయం చూసుకోవడం నుంచి రిమైండర్లు, ఫొటోలు, వీడియోలు అన్నీ ఫోన్లోనే. ఇవే కాకుండా కాంటాక్ట్ నెంబర్ల నుంచి డేటా వరకు ఎంతో విలువైన సమాచారాన్ని కూడా ఫోన్లోనే భద్రపరుస్తాం. అయితే ఈ డేటానుసంరక్షించుకోవడం, ఫోన్ పోతే డేటాను రికవరీ చేసుకోవడం, అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఎవరూచూడకుండా రహస్యంగా దాచుకోవడం, బ్యాకప్ తీసుకోవడం వంటివి కూడా అంతే ముఖ్యం. అయితే ఇవన్నీ మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేకుండా వీటి కోసం ప్రత్యేకమైన యాప్‌లున్నాయి. అవేంటో చూద్దాం..
 
 ఫోన్ నెంబర్స్ బ్యాకప్: నేటి సాంకేతిక యుగంలో తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు ఇలా కొన్ని వందల ఫోన్ నెంబర్లు మన ఫోన్‌లో సేవ్ చేసి ఉంటాం. అయితే పొరపాటున ఎప్పుడైనా ఫోన్ పోయినా, సాఫ్ట్‌వేర్ కరెప్ట్ అయినా అన్ని ఫోన్ నెంబర్లు పోతాయి. అయితే ప్రింట్ మై కాంటాక్ట్స్, కాంటాక్ట్స్ టు పీడీఎఫ్, కాంటాక్ట్స్ బ్యాకప్ అండ్ ఎక్స్‌పోర్ట్ వంటి కొన్ని యాప్‌ల సాయంతో ఫోన్ కాంటాక్ట్స్‌ను బ్యాకప్ తీసుకోవడం, పీడీఎఫ్, టెక్ట్స్‌ఫైల్స్‌గా మార్చుకొని మెయిల్‌కి పంపుకోవడం చాలా సులభం. ఇలా చేయడం వల్ల అందరి కాంటాక్ట్ నెంబర్లు భద్రంగా ఉంటాయి. 
 
 వైఫై రిమోట్ యాప్స్: ష్యూర్ యూనివర్సల్ రిమోట్, వైఫై టీవీ రిమోట్, ఎనీమోట్ యూనివర్సల్ రిమోట్ ప్లస్ వైఫై, ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ కంట్రోల్ వంటి యాప్‌ల సాయంతో వైఫై నెట్‌వర్క్ ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా వినియోగించుకోవచ్చు. అయితే వైఫై రిమోట్ యాప్స్ కేవలం నెట్‌వర్క్ ఆధారిత స్మార్ట్‌టీవీల వంటి పరికరాలకు మాత్రమే పనిచేస్తాయి. 
 
 జీపీఎస్ సిగ్నల్స్ కోసం..!: మనం ఎక్కడికి వెళ్లాలన్నా జీపీఎస్ ఎంతగానో సహకరిస్తుంది. ల్యాండ్‌మార్క్ తెలుసుంటే చాలు జీపీఎస్ సాయంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. కానీ కొన్నిసార్లు జీపీఎస్ సరిగా పనిచేయదు. అలాంటి సమయంలో ‘జీపీఎస్ స్టేటస్, జీపీఎస్ టెస్ట్’ వంటి యాప్‌ల సాయంతో జీపీఎస్ సిగ్నల్స్‌ను పొందొచ్చు. బయటి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ యాప్‌లను ఓపెన్ చేసి వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లో కాసేపు రన్ చేయడం వల్ల సిగ్నల్స్ మరింతగా మెరుగుపడతాయి.
 
 మెసేజ్ బ్యాకప్: రోజూ ఎన్నో టెక్ట్స్ మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా, ఫోన్ పాడైనా మెసేజ్‌లు పోకుండా ఉండాలన్నా.. ఎస్‌ఎంఎస్ బ్యాకప్ ప్లస్, ఎస్‌ఎంఎస్ బ్యాకప్ అండ్ రీస్టోర్, సీఎం ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్, సూపర్ బ్యాకప్, ఎస్‌ఎంఎస్ అండ్ కాల్ లాగ్ బ్యాకప్ వంటి సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగపడతాయి. వీటి సాయంతో ఎస్‌ఎంఎస్‌లను భద్రపరుచుకోవచ్చు. వీటితోపాటు ప్రైవేట్ ఎస్‌ఎంఎస్ బాక్స్‌లో ఎస్‌ఎంఎస్‌ల బ్యాకప్‌తోపాటు ఫోన్ నంబర్లను ప్రత్యేకంగా యాడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇలా యాడ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్ల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లు కనిపించవు. వీటిని ప్రైవేట్ ఎస్‌ఎంఎస్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోవాలి. దీనికి పాస్‌వర్డ్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది. ఎస్‌ఎంఎస్ టు టెక్ట్స్ యాప్ ద్వారా మన ఇన్‌బాక్స్‌లోని 
 ఎస్‌ఎంఎస్‌లను టెక్ట్స్ ఫైల్స్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. 
 
 లాకింగ్ యాప్‌లు: మన ఫోన్‌లోని రహస్యాలను ఇతరులు చూడకుండా ఉండేందుకు యాప్ లాక్, స్మార్ట్ లాక్ యాప్, ఈఎస్ యాప్ లాకర్, క్లీన్ మాస్టర్, యాప్స్ లాక్ అండ్ గ్యాలరీ హైడర్, యాప్ లాక్ ప్యాటర్న్, పర్‌ఫెక్ట్ యాప్ లాక్, లియో ప్రైవసీ గార్డ్ వంటి కొన్ని లాకింగ్ యాప్‌లు దోహదపడతాయి. వీటి సాయంతో ఫోన్ మొత్తాన్ని లాక్ చేయడం కాకుండా.. మనకు కావల్సిన వాటిని మాత్రమే లాక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లలో కొన్ని ఉచితంగా లభిస్తుండగా, మరికొన్నింటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
 స్కానింగ్ యాప్‌లు: ఇవి ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో తప్పక ఉండాల్సిన యాప్‌లు. సాధారణంగా మనం ఏదైనా డాక్యుమెంట్‌ను ఫొటో తీసి ప్రింట్ తీసుకుంటే నల్లగా, డల్‌గా వస్తాయి. కానీ టినీ స్కానర్, కామ్ స్కానర్, జీనియస్ స్కాన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్, స్కాన్ బోట్, మొబైల్ డాక్ స్కానర్, హ్యాండీ స్కానర్, టర్బో స్కాన్ వంటి స్కానింగ్ యాప్‌లను వినియోగించడం వల్ల మెరుగ్గా వస్తాయి. మనకు కావాల్సిన ఐడీ కార్డులు, ప్రూఫ్‌ల వంటి వాటిని నాణ్యతతో స్కానింగ్ చేసుకోవడానికి ఈ యాప్‌లు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యాప్‌ల సాయంతో అవసరాన్ని బట్టి లైట్‌గా, డార్క్‌గా మార్చుకోవచ్చు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement