షుగర్ కంట్రోల్కు స్మార్ట్ ఫోన్లు
లండన్: స్మార్ట్ ఫోన్లు స్మార్ట్గా పనిచేస్తూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఏ విషయంపై అవగాహనకైనా స్మార్ట్ ఫోన్ యాప్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ యాప్లు రకరకాల వ్యాధులపై అవగాహన కల్పించడంలో సైతం యూజర్లకు ఉపయుక్తంగా ఉన్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు స్మార్ట్ ఫోన్ యాప్లు మేలు చేస్తాయని ఓ సర్వేలో పరిశోధకులు గుర్తించారు.
డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ను బ్యాలెన్స్ చేసుకోవడంకోసం వారు తీసుకునే అహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే అన్నిసార్లు వారు తీసుకునే అహారం ఏ మోతాదులో బ్లడ్ షుగర్ లెవల్స్ను ప్రభావితం చేస్తుందో రోగులకు అవగాహన ఉండటం లేదు. దీంతో స్మార్ట్ ఫోన్లలో డయాబెటిస్కు సంబంధించిన యాప్లు యూజర్లు అందించిన సమాచారం ఆధారంగా వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి అహారం తీసుకోవాలి అనే విషయాలను తెలుపుతాయి. అంతేకాదు అవసరమైతే డాక్టర్ల అపాయింట్మెంట్లను సైతం ఫిక్స్ చేసే యాప్లు ఉన్నాయి.
మిగిలిన వారితో పోల్చితే స్మార్ట్ ఫోన్ యాప్ల ద్వారా డయాబెటిస్ను మేనేజ్ చేసే వారు ప్రభావవంతమైన చర్యలు చేపడుతున్నారని కార్డఫ్ యూనివర్సిటీ పరిశోధకుడు బెన్ కార్టర్ వెల్లడించారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా డయాబెటిస్ రోగులు ఉంటారని అంచనా వేస్తున్న స్థితిలో స్మార్ట్ ఫోన్ల ద్వారా డయాబెటిస్పై పెరుగుతున్న అవగాహన ఉపయోగకరమని ఆయన వెల్లడించారు.