
వృక్ష శాస్త్రము
ఆవృత బీజాల వర్గీకరణ
మొక్కల సిస్టమాటిక్స్‌లో ‘ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం’ అనే అధ్యాయాన్ని చేర్చారు. మొక్కల సిస్టమాటిక్స్ అంటే కేవలం ఆవృత బీజాల వర్గీకరణ మాత్రమే కాదు. వృక్షరాజ్యంలో ని మొక్కల వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం అని చెప్పొచ్చు. నాలుగో అధ్యాయంలో అల్పశ్రేణి మొక్కల వర్గీకరణను క్లుప్తంగా వివరిం చారు. సూక్ష్మజీవులకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో ప్రాచీన కాలం నుంచి ఆవృత బీజాల వర్గీకరణనే మొక్కల సిస్టమాటిక్స్‌గా భావిస్తున్నారు.
ఇంటర్మీడియట్ సిలబస్ మూడో అధ్యాయంలో ప్రాచీన కాలం నాటి వర్గీకరణ విధానాలను పేర్కొన్నారు. ఎంసెట్ పరీక్షకు ఈ సమాచారం చాలా ముఖ్యమైంది. పరాశరుడి వర్గీకరణ, గ్రీకు తత్వవేత్తల వర్గీకరణకు సంబంధించిన సమాచారాన్ని, వారు పరిగణనలోకి తీసుకొన్న లక్షణాలపై విద్యార్థులు పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
వర్గీకరణకు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను బట్టి కాలక్రమేణ వర్గీకరణలో మార్పులు సంభవిస్తాయి:
ఈ అధ్యాయం మొదటి భాగంలో వర్గీకరణకు సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలను ప్రస్తావించారు. ‘ఆల్ఫాటాక్సానమీ’, ‘ఒమేగా టాక్సానమీ’ పదాలకు స్పష్టమైన వివరణ ఇచ్చారు. కృత్రిమ, సహజ, వర్గవికాస వ్యవస్థల గురించి ఉదాహరణలతో వివరించారు. విద్యా ర్థులు ఈ వ్యవస్థల రకాల గురించి, వాటి మధ్య తేడాలను, పరిగణనలోకి తీసుకొన్న అంశాలను అధ్యయనం చేయాలి. ఆల్ఫాటాక్సానమీ, కృత్రిమ వర్గీకరణ వ్యవస్థల మధ్య తేడాను గుర్తించాలి. వర్గీకరణ శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాల పేర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వర్గీకరణనను పరిగణనలోకి తీసుకునే అంశాలు కాలక్రమేణా మారుతూ ఉండటం వల్ల వర్గీకరణ రకాలు కూడా మారుతూ ఉంటాయి. ముందు ప్రతిపాదించిన వర్గీకరణలోని లోపాలను తరువాత ప్రతిపాదించిన వర్గీకరణలతో పోల్చినప్పుడు మాత్రమే అవగాహనకు వస్తాయి. కానీ ఏ వర్గీకరణలు అయినా ఆయా కాలాల్లో బాగా ప్రాచుర్యం పొంది, ఉత్తమమైనవిగా గుర్తించినవే. పుష్ప లక్షణాలు ఎక్కువ స్థిరంగా ఉండడమే కాకుండా వాతావరణ ప్రభావంతో మార్పునకు లోను కాకపోవడం వల్ల ఈ పుష్ప లక్షణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ వాక్యం సహజ వర్గీకరణకు సంబంధం లేనిది. సహజ వర్గీకరణ సమయానికి ‘పరిణామ క్రమం’ అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియని దృగ్విషయం. ఇలాంటి ప్రశ్నల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. సహజ వ్యవస్థ వర్గీకరణకు ఉదాహరణగా బెంథామ్ అండ్ హుకర్ వర్గీకరణను క్లుప్లంగా వివరించారు. ఈ పాఠ్యాంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ వర్గీకరణలో పొందుపర్చిన సంఖ్యాపరమైన విషయాలను గుర్తుంచుకోవాలి. విద్యార్థులు తమకు వీలైన రీతిలో ఈ మొత్తం వర్గీకరణను చిత్రరూపంలో విడిగా రాసుకొంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తేలికగా గుర్తించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. వర్గ వికాస వ్యవస్థ వర్గీకరణ, సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం, కణాధార వర్గీకరణ శాస్త్రం, రసాయనిక వర్గీకరణ శాస్త్రం గురించి అతిక్లుప్తంగా చెప్పినప్పటికీ వీటిపై అవగాహన పెంచుకోవాలి.
పాక్షిక సాంకేతిక వర్ణనకు వర్గీకరణ శాస్త్రంలో తావులేదు:
ఈ పాఠ్యాంశంలో ఒక పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణన ఇచ్చారు. ఇంటర్మీడియట్ స్థాయిలో పాక్షిక వర్ణన అధ్యయనం విద్యార్థికి ఏ విధంగానూ ఉపయోగపడదు. పై తరగతుల్లో.. అంటే డిగ్రీ విద్యార్థి వృక్షశాస్త్రం అధ్యయనం చేయాలంటే పూర్తి వర్ణన మాత్రమే ఉపయోగ పడుతుంది. డిగ్రీ స్థాయిలో ఈ వర్ణనను తిరిగి అధ్యయనం చేసే అవకాశం ఉండదు. 20 కుటుంబాలకుపైగా మొక్కల వర్ణన చేయాల్సి ఉంటుంది. పూర్తి వర్ణన తెలిసినప్పటికీ చాలా సందర్భాల్లో మొక్కను గుర్తించడం కష్టతరమవుతుంది. మొక్కను గుర్తించడం అనేది వర్గీకరణలో ప్రాథమిక అంశం. ఈ విషయంలోనే విద్యార్థులు వెనుకంజ వేస్తారు. ఇంటర్మీడియట్ సిలబస్‌లో మూడు కుటుంబాల వర్ణనకు ముందుగా వర్ణనకు సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం ఇచ్చారు. పుష్ప భాగాలను కొన్ని సంకేతాల ద్వారా పుష్ప సమీకరణలో చూపించడం, పుష్పభాగాల సంఖ్య, వాటి అమరిక విధానం, ఒక భాగానికి, మరో భాగానికి మధ్య సంబంధాలను పుష్పచిత్రం ద్వారా వివరించారు. ఈ విషయాల నుంచి ఇంటర్ పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిపై సరైన అవగాహన లేకుంటే విద్యార్థులు కొంత అయోమయానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు పుష్పంలోని ఏ లక్షణాన్ని పుష్ప సమీకరణ లేదా పుష్పచిత్రం ద్వారా చూపించలేం. ఈ పాఠ్యాంశంలోనే పుష్ప చిత్రానికి ఉదాహరణగా బ్రాసికేసి కుటుంబ పుష్పచిత్రం, పుష్ప సంకేతం ఇచ్చారు. ఇంతకు ముందు పాఠ్యాంశాల్లో బ్రాసికేసి సమాచారానికి ఇది అదనం. కేసరాల సంఖ్య(6), రక్షక పత్రాల సంఖ్య(4), వాటి అమరిక సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
కుటుంబాల వర్ణన అధ్యయనం చేయడానికి అన్ని శాఖల అవగాహన అవసరం.
కుటుంబాల వర్ణనకు బాహ్య స్వరూప లక్షణాలను వర్ణించడం, వాటిని గుర్తించడం, నామీకరణ, పరాగ సంపర్క లక్షణాలు, ఆర్థిక ప్రాముఖ్యతలను చదవాల్సి ఉంటుంది. వీటితోపాటు మొక్కల ఆకృతి, ఆవాసాలు కూడా అవసరం. ముందు చదివిన అధ్యాయాల నుంచి సమాచారాన్ని ఇక్కడ చేర్చి అధ్యయనం చేస్తే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో చేర్చిన మూడు కుటుంబాల వర్గీకరణను, బెంథామ్ అండ్ హుకర్ వర్గీకరణలో వాటి స్థానాన్ని చేర్చలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ కుటుంబ వర్గణ అధ్యయన విషయంలో కొంత ఆందోళనకు లోనవుతూ ఉంటారు. దీనికి కారణం చాలా మొక్కల పేర్లను, వాటి సాధారణ నామాలు గుర్తుంచుకోవాల్సి రావడం. మొత్తం కుటుంబాల్లో దాదాపు 40 మొక్కల శాస్త్రీయ నామాలు, వాటి వాడుక నామాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సులభమైన పద్ధతి.. ప్రతి కుటుంబంలోని మొక్కల లాటిన్ పేర్లను ఆల్ఫాబెటికల్ క్రమంలో ఒకదాని కింద ఒకటి వరుసగా రాసుకొని మొత్తం మొక్కల సంఖ్యను గుర్తుంచుకుంటే మననం చేయడానికి సులభంగా ఉంటుంది. ప్రతి మొక్కకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకచోట చేర్చి అధ్యయనం చేస్తే బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయడం సులభంగా ఉంటుంది. కుటుంబాల వర్ణనను సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు చదివి పరీక్షలకు ముందుగా మననం చేస్తే పరీక్షా సమయానికి గుర్తుంటాయి. కుటుంబాల వర్ణన ప్రాక్టికల్ పరీక్షలకు సైతం ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్ పరీక్షల్లో సాధించే మార్కులు ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధనకు తోడ్పడతాయనే విషయం తెలిసిందే.