ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి?
-శ్రీకాంత్, జడ్చర్ల.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ). మాస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి బోధన, శిక్షణ, పరిశోధన అంశాల్లో దేశంలోనే ప్రధానమైన ఐఐఎంసీ. న్యూఢిల్లీలోని ప్రధాన క్యాంపస్‌తోపాటు ఐజ్వాల్ (మిజోరం), అమరావతి (మహారాష్ట్ర), దెంకనల్ (బడిశా), జమ్మూ-కాశ్మీర్, కొట్టాయం (కేరళ)లలో రీజనల్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో అందుబాటులో ఉన్న కోర్సులు..
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఇంగ్లిష్)
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (హిందీ)
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (రేడియో/టెలివిజన్)
పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఒడియా)
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.iimc.nic.in
ఎయిమ్స్ అందిస్తున్న ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) కోర్సు వివరాలను తెలపండి?
-రవి, కోదాడ.
దేశంలోని ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థల్లో ఒకటైనా.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)-న్యూఢిల్లీ, మెడిసిన్‌తోపాటు హెల్త్‌కేర్‌కు సంబంధించి వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. వాటిల్లో మాస్టర్ ఇన్ బయోటెక్నాలజీ (ఎం. బయోటెక్నాలజీ) ఒకటి. రికాంబినెట్ డీఎన్‌ఏ టెక్నాలజీ, ఇమ్యునాలజీకి సంబంధించిన అధునాతన బయోటెక్నాలజీ పద్ధతులను ఉపయోగించి మెరుగైన చికిత్స అందించే అంశాలపై ఈ కోర్సులో శిక్షణనిస్తారు. ఈ కోర్సులో రికాంబినెట్ డీఎన్‌ఏ టెక్నాలజీ, టి సెల్ క్లోనింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోమెడిసిన్ తదితర అంశాలు ఉంటాయి.
అర్హత: 60 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ/ బీఫార్మసీ/బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరిపీ/బీఎస్సీ.
ప్రవేశం: దేశ వ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ఏప్రిల్/మేలో వెలువడుతుంది. పరీక్షను జూన్/జూలైలో నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత సబ్జెక్ట్‌పై 90 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి.
వివరాలకు: www.aiimsexams.org
చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న కోర్సులేవి?
-చరణ్, గద్వాల్.
చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్‌ను 1989లో ప్రారంభించారు. దీనికి 1996 నుంచి స్వయంప్రతిపత్తి హోదా లభించింది. దేశంలో మ్యాథమెటికల్ సెన్సైస్‌కు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా దీని గుర్తింపు ఉంది. ఆఫర్ చేస్తున్న కోర్సులు..
బీఎస్సీ (ఆనర్స్-మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్- మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు)
బీఎస్సీ (ఆనర్స్-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్- మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు)
ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్)
పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్)
ప్రవేశం పొందిన విద్యార్థులకు కోర్సును బట్టి నెలవారీగా స్కాలర్‌షిప్ లభిస్తుంది. వివరాలు.. బీఎస్సీ (ఆనర్స్)- రూ. 4,000 (వీరికి ప్రైవేట్ డొనేషన్స్ ద్వారా నెలకు రూ. 1,000 అదనంగా లభిస్తుంది). ఎంఎస్సీ-రూ.6,000. పీహెచ్‌డీ-రూ. 16,000.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. పీహెచ్‌డీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి ఎన్‌బీహెచ్‌ఎం/సీఎస్‌ఐఆర్, జెస్ట్ స్కోర్ ఇంటర్వ్యూ ద్వారా. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014
వివరాలకు: www.cmi.ac.in
ఐఐటీ-రాజస్థాన్ ఆఫర్ చేసే బీటెక్ (బయాలాజికల్లీ ఇన్‌స్పైర్డ్ సిస్టమ్ సైన్స్) కోర్సు వివరాలను తెలపండి?
-కిరణ్, ఖమ్మం.
కాలక్రమేణా వస్తున్న మార్పులకనుగుణంగా ఐఐటీలు ఎన్నో నూతన కోర్సులను ప్రారంభిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో ఒకటి.. ఐఐటీ-రాజస్థాన్ ఆఫర్ చేస్తున్న బీటెక్ (బయాలాజికల్లీ ఇన్‌స్పైర్డ్ సిస్టమ్ సైన్స్). శాస్త్రం-దాని మూల భావనల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలనుకునే వారికి సరిపోయే కోర్సు ఇది. మానవ జీవితంలో కీలకమైన సమాజం, శాస్త్రం (సైన్స్), తత్వశాస్త్రం ఒకదానితోఒకటి ఎలా సంధానమై ఉన్నాయో విపులంగా వివరించడానికి ఈ కోర్సు దోహద పడుతుంది. కాలానుగుణంగా సైన్స్ పరిణామం, దాని స్వభావాన్ని వివరించేందుకు ఉద్దేశించిన ఈ కోర్సు నాలుగు మాడ్యుల్స్‌గా ఉంటుంది. మొదటి మాడ్యూల్లో సైన్స్ చారిత్రక నేపథ్యం, తాత్విక పునాదుల గురించి వివరిస్తారు.
రెండో మాడ్యూల్లో ప్రధాన భావనలపై విశ్లేషణ, మూడో మాడ్యూల్లో ఇప్పటి వరకు సైన్స్ గురించి చోటు చేసుకున్న ముఖ్యమైన చర్చలు వంటి అంశాలను చేర్చారు. నాలుగో మాడ్యూల్లో జీవ శాస్త్రాల్లోని తాత్విక సమస్యలను చర్చిస్తారు. ఈ కోర్సులో పొందిన అవగాహన ద్వారా విద్యార్థులు సిస్టమ్ సైన్స్, పర్యావరణ వ్యవస్థ, వ్యాపార, ఆర్థిక రంగాల్లోని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పొందుతారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హెల్త్ కేర్, డిజైన్, పునరుత్పాదక ఇంధన రంగం, మెటీరియల్ సైన్స్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిర పడొచ్చు.
వివరాలకు: www.iitj.ac.in
ఎయిమ్స్ నుంచి ఎంఎస్సీ బయోటెక్నాలజీ
Published Thu, Apr 3 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
Advertisement
Advertisement