పచ్చని కెరీర్‌కు స్వాగతం! | Career in Environmental Science | Sakshi
Sakshi News home page

పచ్చని కెరీర్‌కు స్వాగతం!

Published Thu, Nov 28 2013 1:14 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Career in Environmental Science

పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి.. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది.. ‘భూతాపం’ ఇప్పుడు పుడమి నెత్తిన పెనుభూతమై కూర్చొంది! రోజురోజుకూ పెరుగుతున్న కర్బన ఉద్గారాలు.. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం పర్యావరణ పరిరక్షణ. దీనికి సంబంధించిన అంశాలను శాస్త్రీయ కోణంలో విశ్లేషించే నైపుణ్యాలను అందించే కోర్సు పర్యావరణ శాస్త్రం (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్).

 

 నేడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న కారణంగా.. సంబంధిత రంగంలో నిపుణులైన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీంతో ‘పర్యావరణం’ పచ్చని కెరీర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

 

 శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణలతో పాటు పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీంతో పచ్చని పర్యావరణం మసకబారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నిపుణుల అవసరం ఏర్పడింది. దీన్ని గమనించిన ఉన్నత విద్యా సంస్థలు పర్యావరణ మానవ వనరులను తీర్చిదిద్దేందుకు పలు కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చిన కోర్సు.. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.

 

 పరిసరాల అధ్యయనం: చుట్టూ ఉన్న పరిసరాల గురించి అధ్యయనం చేయడమే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం). దీనికి మూలం జీవశాస్త్రమైనప్పటికీ.. అనేక శాస్త్రాలతో సంబంధం ఉన్న అంశంగా మారుతోంది. ఈ క్రమంలో నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్ వంటి అంశాల కలయికగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కరిక్యులం ఉంటుంది. ఇందులో బయలాజికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, జియాలజీ, జాగ్రఫీ, ఎకాలజీ, జియోగ్రఫీ, సాయిల్ సైన్స్.. సంబంధిత అంశాలను బోధిస్తారు. మనం తాగే నీటి నుంచి జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్ వరకు పర్యావరణ సంబంధిత అన్ని అంశాలను ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ చర్చిస్తుంది. ఇది గాలి, నీరు, ధ్వని, పారిశ్రామిక, వాహన, ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్య నివారణ మార్గాలపై అవగాహన పెంపొందిస్తుంది.

 

 

 అకడమిక్‌గా ఇలా: ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సుల రూపకల్పన భారత్‌లో 1980ల్లోనే జరిగినప్పటికీ.. ఇటీవల కాలంలోనే వీటి ప్రాశస్త్యం పెరుగుతోంది. ఈ విభాగంలో బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో ఎన్విరాన్‌మెంట్ సైన్స్ ఒక ప్రధాన సబ్జెక్ట్‌గా పలు యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. - ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌ను బీటెక్ స్థాయిలో అందిస్తున్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో ఒక ఐచ్ఛికాంశం (ఎలెక్టివ్ సబ్జెక్ట్)గా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

 బేసిక్ సైన్స్ కోర్సుగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులో థియరీ, లేబొరేటరీలకు ప్రాధాన్యమిస్తారు. అదే ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులో థియరీతోపాటు ఇంజనీరింగ్ టెక్నాలజీ అంశాల సమ్మిళితంగా బోధన సాగుతుంది.

 

 పీజీ స్థాయిలో: ఐఐటీ ఖరగ్‌పూర్ బీటెక్ స్థాయిలోనే సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ అనే డ్యూయల్ డిగ్రీ కోర్సుకు రూపకల్పన చేసింది. సాధారణంగా అకడమిక్ స్థాయిలో పర్యావరణ శాస్త్రంలో ఎనర్జీ కన్సర్వేషన్, బయో డైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, భూగర్భ జల వనరుల నిర్వహణ, భూ ఉపరితల పరిరక్షణ అంశాలపై శిక్షణ ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విషయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

 

ఐఐటీ-ముంబై, ఐఐటీ-ఢిల్లీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు సహా మరెన్నో ఇంజనీరింగ్ సంస్థలు ఎంటెక్‌లో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సును ఒక స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలోనూ ఎంటెక్ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. పీజీ తర్వాత చాలా యూనివర్సిటీలు పీహెచ్‌డీ కోర్సును కూడా అందిస్తున్నాయి. అంతేకాకుండా యూజీసీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ టెస్టింగ్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌సలో జేఆర్‌ఎఫ్‌ను అందిస్తోంది. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అకడమిక్ స్థాయిలో అవగాహన కల్పించి దీని నివారణ కోసం నిపుణులను తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం..

 

ఈ నైపుణ్యాలు అవసరం: పర్యావరణ పరిరక్షణ అనేది ప్రజల ఆరోగ్యంతోనూ ముడిపడిన అంశమైన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యే నేర్పు ఉండాలి.

 ఆఫీస్ రూంకే పరిమితమై విధులు నిర్వర్తిస్తామనే ధోరణి ఈ రంగంలో సరిపడదు. ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లగలిగే విధంగా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి.

 

 

 అవకాశాలు అపారం: పర్యావరణ రంగంలో నిష్ణాతులను ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. పీహెచ్‌డీ స్థాయి అభ్యర్థులు శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా స్థిరపడే అవకాశం ఉంది. పీజీ స్థాయి ఉత్తీర్ణులు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లుగా, కోఆర్డినేటర్లుగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులైన ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ / ఇంజనీరింగ్‌లో మానవ వనరుల పరంగా డిమాండ్-సప్లయ్ విషయంలో వేలల్లో వ్యత్యాసం ఉంది.

 

 

 ఏటా పదివేల ఉద్యోగావకాశాలు

 పర్యావరణ సుస్థిరాభివృద్ధి, కాలుష్య నివారణ దిశగా ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యల కారణంగా ఈ రంగంలో గత పదేళ్లలో ఏటా దాదాపు పదివేల ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్రీన్ బిల్డింగ్స్ (హరిత నిర్మాణాలు) కాన్సెప్ట్ పెరిగిన నేపథ్యంలో ఎన్విరాన్‌మెంటల్ స్పెషలిస్ట్‌ల ఆవశ్యకత క్రమేణా పెరుగుతోంది. ప్రభుత్వం కూడా సౌరశక్తి, పునరుత్పాదక ఇంధన వనరుల వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్ సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.

 ..................................................................

 కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) అంచనా ప్రకారం.. సౌరశక్తి విభాగంలో ప్రతి సోలార్ ప్రాజెక్ట్‌లో ఒకరికి ప్రత్యక్షంగా, మరో ముగ్గురికి పరోక్షంగా అవకాశాలు లభించనున్నాయి.

 ..................................................................

 బయోమాస్ ప్రొడక్షన్ విభాగంలోనూ ప్రతి యూనిట్‌లో ప్రత్యక్షంగా నలుగురికి, పరోక్షంగా పది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలోనే 2025 నాటికి లక్ష మంది ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడనుంది.

 ..................................................................

 రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో 2020 నాటికి దాదాపు పది లక్షల మంది నిపుణులు కావాలి. ఇక.. సిమెంట్, రసాయన ఉత్పత్తులు, ఫెర్టిలైజర్స్ తదితర పారిశ్రామిక సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రానున్న పదేళ్లలో వేల సంఖ్యలో ఎన్విరాన్‌మెంటల్ స్పెషలిస్ట్‌ల అవసరం ఏర్పడనుంది.

 

 పీజీ ఎన్విరాన్‌మెంటల్‌సైన్స్: ఇన్‌స్టిట్యూట్‌లు

 ఐఐటీ-బాంబే

 వెబ్‌సైట్: www.iitb.ac.in

 ఐఐటీ- ఢిల్లీ

 వెబ్‌సైట్: www.iitd.ac.in

 ఐఐటీ- గువాహటి

 వెబ్‌సైట్: www.iitg.ac.in

 ఐఐటీ-ఖరగ్‌పూర్

 వెబ్‌సైట్: www.iitkgp.ac.in

 జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ

 వెబ్‌సైట్: www.jnu.ac.in

 

 

 మన రాష్ట్రంలో:

 ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్

 వెబ్‌సైట్: www.osmania.ac.in

 ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 జేఎన్‌టీయూ-హైదరాబాద్

 వెబ్‌సైట్: www.jntuh.ac.in

 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

 వెబ్‌సైట్:www.nagarjunauniversity.ac.in

 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ

 వెబ్‌సైట్: www.svuniversity.in

 

 

 ఉపాధి వేదికలు:

 ప్రస్తుతం అంతటా ‘క్లీన్ ఎన్విరాన్‌మెంట్’ దిశగా ఆలోచనలు సాగుతున్న తరుణంలో ప్రభుత్వ,  ప్రైవేటు రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ విభాగంలో అర్బన్ ప్లానింగ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్సెస్, కాలుష్య నియంత్రణ మండళ్లు తదితర విభాగాలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.

 

 ప్రైవేటు రంగంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు పర్యావరణ కాలుష్య స్థాయిని పరిశీలించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి.

 

 ఇటీవల కాలంలో ప్రతి సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిబంధన కారణంగా.. పర్యావరణ పరిరక్షణ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎన్విరాన్‌మెంటల్ కోర్సు ఉత్తీర్ణులకు అవకాశాలు ఇస్తున్నాయి. స్వ చ్ఛంద సంస్థలు కూడా  అవకాశాలు కల్పిస్తున్నాయి.

 కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు.

 ఎన్విరాన్‌మెంటల్ జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.

 అంతర్జాతీయంగానూ యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీసీ), ఎర్త్ సిస్టమ్ గవర్నెన్‌‌స ప్రాజెక్ట్ వంటి సంస్థల్లో అడుగుపెట్టొచ్చు.

 

 వేతనాలు:

 కంపెనీని బట్టి ప్రారంభంలో కనీసం రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. పీజీ/పీహెచ్‌డీ ఉంటే నెలకు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు లభిస్తుంది. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా రెట్టింపు వేతనాన్ని అందుకోవచ్చు.

 

 ప్రభుత్వ నిబంధనలు.. మరిన్ని అవకాశాలు:

 రూ. 50 కోట్ల వ్యయాన్ని మించిన ప్రాజెక్టులను చేపట్టే సంస్థలు, పదివేల మందికిపైగా కార్మికులతో నిర్మాణం చేపట్టే యూనిట్లు, నిత్యం 50 వేలకుపైగా వ్యర్థాలను విడుదల చేసే ఉత్పత్తి సంస్థలు తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం సంబంధిత నిపుణులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉంటే ఎన్విరాన్‌మెంట్ కన్సల్టెంట్‌గానూ ప్రాక్టీస్ చేయవచ్చు.

 

 

 ఐదంకెల జీతం!

 ప్రస్తుతం అకడమిక్ పరంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ రెండో సంవత్సరంలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ఒక పేపర్‌గా ఉన్నప్పటికీ దీనిపై విద్యార్థులకు తగినంత అవగాహన లేదు. పీజీ స్థాయిలో మాత్రం ఎందరో ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. కోర్సు పూర్తి చేసిన నెల రోజుల్లోపే ఐదంకెల జీతంతో ఉద్యోగాలు పొందుతుండటమే ఈ కోర్సు ప్రాముఖ్యతకు నిదర్శనం. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఏర్పడనుంది.

 - డాక్టర్ ఎ.వి.వి.ఎస్.స్వామి, హెచ్‌ఓడీ,

 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement