క్యాట్-2014 విశ్లేషణ | Cat -2014 Analysis | Sakshi
Sakshi News home page

క్యాట్-2014 విశ్లేషణ

Published Thu, Nov 20 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

Cat -2014 Analysis

ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) తొలి దశ నవంబర్ 16న ముగిసింది. దేశ వ్యాప్తంగా దాదాపు వంద కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. నవంబర్ 22న రెండో దశ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో కొత్త మార్పులతో నూతన విధానంలో తొలివిడత జరిగిన క్యాట్- 2014పై విశ్లేషణ...
 
గతంకంటే ఎక్కువ ప్రశ్నలు, పరీక్ష కాల వ్యవధితో క్యాట్-2014 అభ్యర్థుల ముందుకొచ్చింది. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న క్యాట్‌తో పోల్చితే ఈ ఏడాది మార్పులు అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. గతేడాది 20 రోజుల్లో 40 స్లాట్స్‌లో పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం రోజుకు రెండు సెషన్ల చొప్పున రెండు రోజులు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 
స్వరూపంలో మార్పులివే!
ముందుగా ప్రకటించినట్లుగానే క్యాట్ -2014 పేపర్‌ను రెండు విభాగాల్లో ఇచ్చారు. 1) క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; 2) వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ప్రతి విభాగంలో 50 ప్రశ్నలున్నాయి. పరీక్ష వ్యవధి 170 నిమిషాలు. గతేడాది ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు ఇచ్చి, 140 నిమిషాల్లో పరీక్షను పూర్తి చేయమన్నారు. ఈసారి ప్రశ్నల సంఖ్యలో, పరీక్ష వ్యవధిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే పరీక్ష ప్రారంభంలో ఉండే 15 నిమిషాల ట్యుటోరియల్‌ను కూడా ఈ ఏడాది తొలగించారు. దానికి బదులుగా తగిన సూచనలతో, ఎఫ్‌ఏక్యూస్‌తో కూడిన సమగ్రమైన డెమో పరీక్షను ముందుగానే విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. దాంతో పరీక్ష విధానంపై ముందస్తు అవగాహనకు వీలుపడింది.
 
ప్రశ్నల క్లిష్టతలో వ్యత్యాసాలు
దేశ వ్యాప్తంగా తొలి స్లాట్‌లో పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం కంటెంట్‌లో నాణ్యత, క్లిష్టత స్థాయిలో గత క్యాట్‌లకు ప్రస్తుత పరీక్షకు స్థూలంగా పెద్ద తేడా లేదు. అయితే విభాగాల వారీగా క్లిష్టతలో వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. సెక్షన్-1లోని క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగంలో గత పరీక్షలతో పోల్చితే కఠినమైన కాన్సెప్ట్స్, క్లిష్టమైన ప్రశ్నల స్థానంలో కొంచెం సరళమైన ప్రశ్నలు అడిగారు. డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో మాత్రం గతం కంటే కష్టమైన ప్రశ్నలు వచ్చాయి.
 
సెక్షన్-2లోని వెర్బల్ ఎబిలిటీ విభాగంలో గత పరీక్షల మాదిరి ప్రశ్నల కాఠిన్యత స్థాయి ఉందని చెప్పొచ్చు. అయితే లాజికల్ రీజనింగ్ మాత్రం మరింత కష్టంగా ఉంది. కోర్ కాన్సెప్టులను పక్కాగా ప్రిపేరైన అభ్యర్థులు సులువుగానే క్యాట్ పరీక్షను ఎదుర్కొన్నారు. మాక్ పరీక్షలు రాసిన విద్యార్థులు సైతం సమర్థంగా రాణించేందుకు అవకాశం లభించింది.
 
సదుపాయాల కొరత- మానసిక ఒత్తిడి:
పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించేందుకు క్యాట్ వెబ్‌సైట్లో పేర్కొన్న విధంగా వివిధ స్థాయిల్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ కొన్ని కేంద్రాల్లో ఎలాంటి తనిఖీలు లేవని విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేవని తెలిపారు. ఏసీ, కంప్యూటర్ సిస్టమ్స్ విషయంలో పరీక్ష కేంద్రాల సమన్వయకర్తలు సరిగా దృష్టి కేంద్రీకరించలేదని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సదుపాయాల కొరత విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.
 
 ఒత్తిడిని దరిచేరనీయొద్దు..

 నవంబర్ 22న జరిగే క్యాట్-2014కు హాజరయ్యే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. తొలి దశ, మలి దశ పరీక్షల్లో ప్రశ్నల కాఠిన్యత ఒకే విధంగా ఉండకపోవచ్చు. పరీక్ష విధానం, పర్సైంటైల్ తదితర అంశాలపై ఊహాగానాలను నమ్మి అనవసరంగా ఒత్తిడికి గురికాకూడదు. పటిష్ట ప్రిపరేషన్‌ను నమ్ముకుంటే పరీక్షను సమర్థంగా ఎదుర్కోవచ్చు.
 
 - రామ్‌నాథ్ కనకదండి,  కోర్సు డెరైక్టర్, క్యాట్, టైమ్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement