కరెంట్‌ అఫైర్స్‌ | Current Affairs | Sakshi
Sakshi News home page

కరెంట్‌ అఫైర్స్‌

Published Mon, Feb 13 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

కరెంట్‌ అఫైర్స్‌

కరెంట్‌ అఫైర్స్‌

రౌండప్‌
ఏప్రిల్‌  2016
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

(ఏపీపీఎస్సీ).. గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఈనెల 26న జరగనుంది. అదే విధంగా గ్రూప్‌–1, పంచాయతీ సెక్రటరీ తదితర పోస్టుల ఔత్సాహికులు ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వీటితోపాటు బ్యాంక్స్, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాసే లక్షల మంది అభ్యర్థులకు ఉపయోగపడేలా 2016, ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు కరెంట్‌ అఫైర్స్‌ (అంతర్జాతీయం) అందిస్తున్నాం. మిగతా కరెంట్‌ అఫైర్స్‌ (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, క్రీడలు) తదుపరి సంచికల్లో అందిస్తాం.

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్‌ 22న భారత్‌ సంతకం చేసింది. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 171 దేశాలు సంతకాలు చేశాయి. ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి.

టిబెట్‌ ప్రధానిగా న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త లోబ్సంగ్‌ సాంగే ఏప్రిల్‌ 27న తిరిగి ఎన్నికయ్యారు. ధర్మశాల నుంచి పాలన సాగుతున్న టిబెట్‌కు సాంగే తొలిసారి 2011 ఆగస్టులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఏడో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ (ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌)–1జి ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్‌ 28న విజయవంతంగా ప్రయోగించింది. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ–సీ33 ద్వారా భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కిలోమీటర్లు, దూరంగా (అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు.

భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏప్రిల్‌ 28 నుంచి 2 రోజుల పాటు పపువా న్యూగినియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి పీటెర్‌ ఓ నీల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.

మే 2016
బ్రిటన్‌ రాజధాని లండన్‌ మేయర్‌గా సాదిక్‌ ఖాన్‌ మే 7న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బ్రిటన్‌లో మేయర్‌ పదవి చేపట్టిన తొలి ముస్లింగా రికార్డులకెక్కారు. పాకిస్తాన్‌ సంతతికి చెందిన సాదిక్‌ ఖాన్‌ లేబర్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి కన్సర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి జాక్‌ గోల్డ్‌స్మిత్‌పై 57 శాతం ఓట్లతో విజయం సాధించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇరాన్‌ పర్యటనలో భాగంగా మే 23న ఆ దేశాధ్యక్షుడు హసన్‌ రౌహానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో చబహర్‌ ఓడరేవు అభివృద్ధితో పాటు అల్యూమినియం ప్లాంటు స్థాపన, ఆఫ్గానిస్తాన్, మధ్యాసియాలను అనుసంధానించే రైల్వేలైన్‌ ఏర్పాటు కోసం 150 మిలియన్‌ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్‌ సెంట్రల్‌ బ్యాంకుతో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందాలున్నాయి.

2000–15 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్ధాయం 5 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మే 18న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆఫ్రికా ప్రాంతంలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 9.4 ఏళ్లు పెరిగి 60 ఏళ్లకు చేరింది. అత్యధికంగా జపాన్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 86.8 ఏళ్లు ఉండగా, పురుషుల సగటు ఆయుర్దాయం స్విట్జర్లాండ్‌లో అధికంగా 81.3 ఏళ్లని నివేదిక పేర్కొంది. అత్యల్పంగా సియెర్ర లియోన్‌లో పురుషుల సగటు ఆయుర్దాయం 49.3 ఏళ్లు, మహిళల సగటు ఆయుర్దాయం 50.8 ఏళ్లుగా ఉంది.

లండన్‌లో మే 12న ప్రపంచ అవినీతి వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందిస్తామని వివిధ దేశాధినేతలు ప్రతినబూనారు. ఈ సదస్సులో 40 దేశాల అధినేతలు, ఆర్థిక, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను ఆ దేశ సెనెట్‌ మే 12న సస్పెండ్‌ చేసింది. బడ్జెట్‌ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. ఈ తీర్మానానికి సెనెట్‌ ఆమోదం లభించింది. దీంతో ఉపాధ్యక్షుడు మిచెల్‌ టెమర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా రోడ్రిగో డుటెర్టే ఎన్నికయ్యారు. మే 9న జరిగిన ఎన్నికల్లో పీడీపీ–లబాన్‌ పార్టీ నాయకుడు డుటెర్టే భారీ మెజారిటీతో విజయం సాధించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మే 23, 24 తేదీల్లో తొలి ప్రపంచ మానవతా సదస్సు (వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ సమ్మిట్‌) జరిగింది. ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితిలోని 173 దేశాలు, ప్రైవేటు రంగాలకు చెందిన 350 మంది ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నుంచి 2,000 మంది పాల్గొన్నారు.

జి–7 దేశాల 42వ సదస్సు జపాన్‌లోని షిమాలో మే 26, 27 తేదీల్లో జరిగింది. సదస్సు అనంతరం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థికాభివృద్ధిని అత్యవసర ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుని ఎదుర్కొనేందుకు ఉమ్మడి చర్యలు
తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో మే 26న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విద్యారంగంలో సహకారం కోసం భారత్‌కు చెందిన 10 విశ్వవిద్యాలయాలు చైనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నాయి.

జూన్‌ 2016
అణు సరఫరాదారుల బృంద (ఎన్‌ఎస్‌జీ) వార్షిక సదస్సు దక్షిణ కొరియా
రాజధాని సియోల్‌లో జూన్‌ 23, 24 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)ని సమర్థంగా అమలు చేయాలని ఎన్‌ఎస్‌జీ సభ్య దేశాలు నిర్ణయించాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కల్పించే అంశంపై చర్చలు కొనసాగుతాయని సమావేశానంతరం విడుదల చేసిన ప్రకటనలో సభ్యదేశాలు పేర్కొన్నాయి.

ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా జూన్‌ 7న ఆ దేశ
అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో
భారత సభ్యత్వానికి ఒబామా మద్దతు ప్రకటించారు.

ప్రధాని మోదీ మెక్సికో పర్యటనలో భాగంగా జూన్‌ 9న
ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటోతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార, సాంకేతిక
పరిజ్ఞానం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకార విస్తరణపై ఇరు దేశాల నేతలు చర్చించారు. అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి మద్దతిస్తున్నట్లు మెక్సికో ప్రకటించింది.

మలబార్‌ ఎక్సర్‌సైజ్‌ పేరుతో భారత్, అమెరికా, జపాన్‌లు జూన్‌ 10న నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించాయి. సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తూర్పు చైనా సముద్రంలోని వివాదాస్పద జలాలకు చేరువలో ఈ యుద్ధ విన్యాసాలు జరిగాయి.

హ్యూమన్‌ క్యాపిటల్‌ ఇండెక్స్‌లో భారత్‌ 105వ స్థానంలో నిలిచింది. మొత్తం 130 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశం సందర్భంగా ఆయా దేశాలు.. ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రతిభను గుర్తించడం, అభివృద్ధి చేయడం వంటి అంశాల ఆధారంగా జూన్‌ 27న  ర్యాంకులను ప్రకటించారు. ఈ జాబితాలో ఫిన్లాండ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌లు నిలిచాయి.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఐవరీ కోస్ట్‌ పర్యటనలో భాగంగా జూన్‌ 15న ఆ దేశ అధ్యక్షుడు అలాసనే యుటారాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోకో ఉత్పత్తి కేంద్రమైన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రణబ్‌ ముఖర్జీని అలాసనే కోరారు. పర్యటన సందర్భంగా ఐవరీ కోస్టు అత్యున్నత పురస్కారం గ్రాండ్‌ క్రాస్‌ నేషనల్‌ ఆర్డర్‌ను రాష్ట్రపతి పణబ్‌కు అలాసనే  ప్రదానం చేశారు.

శ్రీలంకలోని జాఫ్నా పట్టణంలో పునరుద్ధరించిన స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు సంయుక్తంగా జూన్‌ 18న ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సిరిసేన హాజరవగా, ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ స్టేడియం మరమ్మతులకు భారత్‌ రూ.7 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

ప్రపంచంలో శరణార్థులు, నివాసాలను వదిలి వెళ్లిన వారి సంఖ్య 2015 నాటికి 65.3 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్‌ 20న ఐక్యరాజ్య సమితి ఈ వివరాలు వెల్లడించింది. శరణార్థుల్లో పాలస్తీనియన్లు అత్యధికంగా (5 మిలియన్లకు పైగా) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సిరియా (4.9 మిలియన్లు), అఫ్గానిస్తాన్‌ (2.7 మిలియన్లు) ఉన్నాయి.

జూలై  2016
భారత ప్రధాని నరేంద్రమోదీ మొజాంబిక్‌ పర్యటనలో భాగంగా జూలై 7న ఆ దేశాధ్యక్షుడు ఫిలిప్‌ న్యూసీతో సమావేశమయ్యారు. దేశంలో పప్పు ధాన్యాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో మొజాంబిక్‌తో దీర్ఘకాలిక పప్పు ధాన్యాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు.

దక్షిణ చైనా సముద్రంలో తనకు 90 శాతానికి పైగా చారిత్రక హక్కులు ఉన్నాయనే చైనా వాదన ను హేగ్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ జూలై 12న కొట్టివేసింది. 1940 నాటి చైనా మ్యాప్‌ ఆధారంగా నైన్‌–డాష్‌ లైన్‌ పరిధిలోని సముద్ర ప్రాంతం, అందులోని వనరులపై తనకు హక్కులున్నాయని చైనా వాదిస్తోంది. ఒకవేళ అలాంటి చారిత్రక హక్కులేమైనా ఉంటే సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒడంబడికతో వాటికి కాలం చెల్లిందని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది.

మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో పదకొండో ఆసియా–యూరప్‌ సదస్సు (ఏఎస్‌ఈఎం) జూలై 15, 16 తేదీల్లో జరిగింది. భారత్‌ తరఫున సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ.. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం కఠినంగా అణిచివేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత్‌ సహా 51 దేశాలు పాల్గొన్నాయి. ఆసియా, యూరప్‌ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ జూలై 19న ఖరారయ్యారు. అభ్యర్థిత్వం కోసం 13 నెలలుగా పార్టీలోని అనేకమందితో పోటీపడి ట్రంప్‌ విజయం సాధించారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్లను ఆయన సాధించారు.lఅమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ జూలై 27న ఖరారయ్యారు.

నేపాల్‌ ప్రధాని కేపీ ఓలి జూలై 24న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించుకోగా, అధికార కూటమిలోని మధేసి పీపుల్స్‌ రైట్స్‌ ఫోరమ్, డెమోక్రాటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు సైతం హామీలను నెరవేర్చడంలో ఓలి విఫలమయ్యారంటూ అవిశ్వాసానికి మద్దతిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓలి తన పదవికి రాజీనామా చేశారు.

ఆగస్టు  2016
నేపాల్‌ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్‌ పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ) ఆగస్టు 4న ప్రమాణస్వీకారం చేశారు. ఆగస్టు 3న పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్‌–మావోయిస్టు సెంటర్‌ చీఫ్‌ ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి.

సార్క్‌ దేశాల హోంమంత్రుల 7వ సదస్సు ఆగస్టు 4న పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకొని, వాటిని ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సార్క్‌ సభ్యదేశమైన బంగ్లాదేశ్‌ మినహా అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మాల్దీవుల హోం మంత్రులు పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం‘ఎయిర్‌ ల్యాండర్‌–10’ ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 302 అడుగుల పొడవైన ఈ విమానాన్ని అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్‌ సంస్థ హైబ్రిడ్‌ ఎయిర్‌ వెహికల్స్‌ (హెచ్‌ఏవీ) రూపొందించింది.

2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్‌ రిఫరెన్స్‌ బ్యూరో (పీఆర్‌బీ) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్‌ పాపులేషన్‌ డేటాషీట్‌లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటా షీట్‌ను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది.

వామపక్ష తీవ్రవాద సంస్థ.. కొలంబియా విప్లవ సాయుధ బలగాల (ఎఫ్‌ఏఆర్‌సీ–ఫార్క్‌)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు పక్షాలు క్యూబా రాజధాని హవానాలో ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్ధానికి తెరపడింది.

సెప్టెంబర్‌   2016
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌–ఆసియాన్‌) సదస్సు సెప్టెంబర్‌ 6–8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్‌లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్‌ విజన్‌ ఇన్‌టూ రియాలిటీ ఫర్‌ ఎ డైనమిక్‌ ఆసియాన్‌ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్‌ కమ్యూనిటీ విజన్‌ 2025 అమలుపై ఆసియాన్‌ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు.

తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్‌ 8న లావోస్‌లోని వియంటైన్‌లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్‌ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి.

పారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్‌ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌కు అందించాయి. పారిస్‌ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీనికోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది శరణార్థులు, వలసదారుల జీవితాలను కాపాడేందుకు ఉద్దేశించిన తీర్మానానికి సెప్టెంబర్‌ 19న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా 193 దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదు.

ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిమోన్‌∙పెరెస్‌ (93) జెరూసలెంలో సెప్టెంబర్‌ 28న మరణించారు. ఆయన..1959లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు ప్రధాన మంత్రిగా, 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగారు.

జీ–20 దేశాల 11వ సదస్సు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సందర్భంగా సదస్సు ప్రధానంగా దార్శనికత, సమగ్రత, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, సమ్మిళితం వంటి అంశాలపై దృష్టి సారించింది. కొత్త ఆవిష్కరణలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొంది. 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం కార్యక్రమాల రూపకల్పన– అమలుపై సదస్సులో చర్చించారు.

అక్టోబర్‌  2016
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ప్రపంచంలో అత్యధిక దూరం సముద్ర గర్భంలో నుంచి కేబుల్‌ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్, ఫేస్‌బుక్‌ సంస్థలు
ప్రకటించాయి. పసిఫిక్‌ మహాసముద్రం ద్వారా అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నుంచి హాంగ్‌కాంగ్‌కు 12,800 కి.మీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అమెరికా,
ఆసియాలను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అమెరికా, జపాన్‌ల మధ్య ప్రపంచంలోనే
తొలి హై కెపాసిటీ ఇంటర్నెట్‌ కేబుల్‌ సముద్ర గర్భం నుంచి ఏర్పాటై ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సంరక్షణ కేంద్రం (మెరైన్‌ రిజర్వ్‌) ఏర్పాటుకు అక్టోబర్‌ 28న ఒప్పందం కుదిరింది. అంటార్కిటికాలోని ప్రకృతి సిద్ధ నిర్జన ప్రదేశాలను పరిరక్షించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటార్కిటికా సముద్ర జీవ వనరుల పరిరక్షణ సంస్థ– హోబర్డ్‌ వార్షిక సమావేశంలో ఈ ఒప్పందం ఖరారైంది.

కామన్‌వెల్త్‌ దేశాల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు అక్టోబర్‌ 13న ప్రకటించింది. 2012 నాటి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ను పదవీచుత్యుణ్ని చేయడానికి దారితీసిన పరిస్థితులను, రాజకీయ అశాంతిని అరికట్ట లేకపోయినందువల్ల ఆ దేశంపై ఆంక్షలు వి«ధించాలని కామన్‌వెల్త్‌ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కామన్‌వెల్త్‌ నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు పేర్కొంది. 53 దేశాలున్న కామన్‌వెల్త్‌ దేశాల కూటమి నుంచి 2013లో జాంబియా వైదొలగగా, తర్వాత తప్పుకున్న దేశం మాల్దీవులు.

నవంబర్‌  2016
క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్‌ 25న కన్నుమూశారు. ఫిడెల్‌ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్‌ (హŸల్లూయిన్‌ ప్రావిన్స్‌)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.

హైబ్రిడ్‌ వరి పితామహుడిగా పేరుగాంచిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్‌ లాంగ్‌పింగ్‌ భారీ స్థాయిలో వరి పండించి సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారని చైనా అధికారులు నవంబర్‌ 25న ప్రకటించారు. గ్యాంగ్‌డాంగ్‌లో ఆయన పండించిన వరి 0.07 హెక్టార్‌కు 1,533.78 కిలోల వార్షిక దిగుబడి ఇచ్చిందని తెలిపారు.

కొలంబియాలో గతంలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రజలు తిరస్కరించడంతో.. ప్రభుత్వం, తిరుగుబాటు సంస్థ (ఎఫ్‌ఏఆర్‌సీ) నవంబర్‌ 12న కొత్త ఒప్పందాన్ని ప్రకటించాయి. వివిధ సంస్థలు, ప్రజల సూచనల మేరకు పాత ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడంతోపాటు అదనపు అంశాలను చేర్చారు. ఈ మేరకు శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన క్యూబా, నార్వే, దౌత్యవేత్తలు సంయుక్త ప్రకటన చేశారు.

అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా 2016 రికార్డుకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నవంబర్‌ 14న మొరాకోలోని మారకేష్‌లో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2015తో పోల్చితే 2016లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.

డిసెంబర్‌ 2016
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్‌ అయిన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ డిసెంబర్‌ 12న అత్యవసర డి్రMీ  జారీ చేశారు.

దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గియోన్‌ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్‌పై విపక్షాలు డిసెంబర్‌ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్‌.

2016 ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్యూర్టొరికోకు చెందిన 19 ఏళ్ల స్టీఫెనీ డీ వాలే కైవసం చేసుకుంది. వాషింగ్టన్‌లో డిసెంబర్‌ 19న నిర్వహించిన పోటీల్లో 116 మందిలో స్టీఫెనీ అగ్రస్థానంలో నిలిచింది. యరిట్జా మిగులేనా రేయిస్‌ రమిరెజ్‌ (డొమినికన్‌ రిపబ్లిక్‌), నటాషా మాన్యుయెల్లా (ఇండోనేసియా) రన్నరప్‌లుగా నిలిచారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా తొలి ముద్రణ పుస్తకం వేలంలో రూ.21.1 కోట్లకు అమ్ముడైంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన శాస్త్ర సాంకేతిక ప్రచురణగా  రికార్డు సృష్టించింది. క్రిస్టీ సంస్థ న్యూయార్క్‌లో డిసెంబర్‌ 18న నిర్వహించిన ఈ–వేలంలో అజ్ఞాత వ్యక్తి పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు.

చైనాలో ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన వంతెనపై రాకపోకలు డిసెంబర్‌ 29న ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున, 1341 మీటర్ల పొడవున నిర్మించారు. దీనికోసం సుమారు రూ.1005 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని పర్వతమయమైన నైరుతి చైనాలోని యున్నన్, గిఝౌ ప్రావిన్స్‌లను అనుసంధానం చేస్తూ నిర్మించారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్‌ రైలు మార్గంలో రాకపోకలను చైనా ప్రారంభించింది. షాంఘై నుంచి కున్‌మింగ్‌ వరకు ఉన్న ఈ మార్గం పొడవు 2,252 కిలోమీటర్లు. ఈ మార్గంలో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైలు దూసుకెళ్లనున్నట్లు చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ జిన్హువా డిసెంబర్‌ 28న వెల్లడించింది.

అమెరికా నుంచి 2008–15 మధ్యకాలంలో భారీగా ఆయుధాలు కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెసెనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008–15 పేరిట డిసెంబర్‌ 26న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే (83) డిసెంబర్‌ 27న కన్నుమూశారు. ఆయన రెండు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు.

ప్రపంచ జనాభా 2016లో 740 కోట్లకు
చేరిందని ఐరాస జనాభా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జోర్డాన్‌లోని అమ్మాన్‌లో డిసెంబర్‌ 1న ప్రపంచ జనాభా నివేదిక–2016ను
విడుదల చేసింది. జనాభాలో పదేళ్లలోపు
చిన్నారులు 12.5 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో 89 శాతం మంది అభివృద్ధి చెందుతున్న
దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement