ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
అంతర్జాతీయం
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జీ-20 సమావేశం
జీ-20 దేశాల సమావేశం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సెయింట్‌పీటర్స్‌బర్గ్ (రష్యా)లో జరిగింది. సమావేశానంతరం జీ-20 దేశాల నాయకులు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉద్యోగ కల్పన, పటిష్టమైన, సుస్థిర, సమతౌల్య వృద్ధిని తిరిగి తీసుకొచ్చేందుకు కచ్చితమైన చర్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఆర్థిక వృద్ధి, ప్రపంచ ఫైనాన్స్, పన్ను ఎగవేత, ఆర్థిక క్రమబద్ధీకరణ, అవినీతి వంటి అంశాలపై డిక్లరేషన్ దృష్టి సారించింది. వాతావరణ మార్పు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. సిరియా పరిస్థితిపై, సమస్యను ఎదుర్కోవడంపైన జీ-20 దేశాధినేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారత్ తరపున ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. వచ్చే సమావేశం 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు.
భూమిపై అతిపెద్ద అగ్ని పర్వతం గుర్తింపు
భూమిపై అతి పెద్ద అగ్ని పర్వతాన్ని పసిఫిక్ మహా సముద్ర గర్భంలో కనుగొన్నట్లు హోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు సెప్టెంబర్ 5న ప్రకటించారు. ఇది సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద అగ్ని పర్వతం. ఇది జపాన్‌కు 1609 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ‘తాము మాసిఫ్’గా భావిస్తున్నారు. ‘తాము మాసిఫ్’ సముద్ర గర్భంలో ఉన్న శిఖరం. 130 - 145 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది. దీని విస్తీర్ణం 3,10,798 చదరపు కిలోమీటర్లు. అయితే ఏర్పడిన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అది చురుకుదనం కోల్పోయింది. ప్రస్తుతం భూమిపై చురుకుగా ఉన్న ‘హవాయీ మౌనా లోయా’ అతిపెద్ద అగ్ని పర్వతం. దీని విస్తీర్ణం 5,179 చదరపు కిలోమీటర్లు. తాము మాసిఫ్ విస్తీర్ణంలో ఇది రెండు శాతం మాత్రమే. హోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఎర్త్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్ చేసిన ఈ అధ్యయనం ఈ అతిపెద్ద అగ్ని పర్వతానికి సంబంధించిన సమాచారం అందించింది.
పాక్ అధ్యక్షుడిగా ఐదేళ్లు కొనసాగిన జర్దారీ
పాకిస్థాన్ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ఐదేళ్ల పూర్తికాలం కొనసాగారు. సెప్టెంబర్ 8తో ఆయన పదవీకాలం పూర్తైది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎన్నికై పూర్తి పదవీకాలం కొనసాగిన తొలి అధ్యక్షుడిగా జర్దారీ నిలిచారు. జర్దారీ స్థానంలో తదుపరి అధ్యక్షుడిగా మమ్మూన్ హుస్సేన్ సెప్టెంబర్ 10న ప్రమాణ స్వీకారం చేశారు.
కంబోడియాలో పాలకపార్టీ సీపీపీ విజయం
ప్రధానమంత్రి హూన్‌సేన్‌కు చెందిన కంబోడియా పీపుల్స్ పార్టీ (సీపీపీ) విజయం సాధించినట్లు కంబోడియా ఎలక్షన్ కమిటీ సెప్టెంబర్ 8న ప్రకటించింది. జూలైలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు సామ్ రైన్స్‌సే ఆరోపిస్తూ రావడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. చివరికి ఎలక్షన్ కమిటీ సీపీపీకి 3.2 మిలియన్ల ఓట్లతో 68 స్థానాలు, ప్రతిపక్ష పార్టీ సీఎన్‌ఆర్‌పీ 2.9 మిలియన్ ఓట్లతో 55 స్థానాలు దక్కినట్లు నిర్ణయించింది.
ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ఎన్నిక
ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా టోనీ అబోట్ అధికారం చేపట్టనున్నారు. అబోట్ నాయకత్వంలోని లిబరల్/నేషనల్ సంకీర్ణం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో 150 స్థానాలకు గాను 90 స్థానాలు గెలుచుకున్నట్లు ఆస్ట్రేలియా ఎలక్టోరల్ కమిషన్ సెప్టెంబర్ 7న ప్రకటించింది. అధికారంలోని లేబర్ పార్టీకి 55 స్థానాలు లభించాయి. దీంతో ఆరేళ్లు ప్రధానిగా కొనసాగుతున్న కెవిన్‌రుడ్ పాలన ముగిసింది.
జాతీయం
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ సెప్టెంబర్ 4న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా రాజన్ నియమితులయ్యారు.
ప్రధాన సమాచార కమిషనర్‌గా దీపక్ సంధు
ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధు సెప్టెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంధు దేశ తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన మాజీ అధికారి అయిన సంధు 2009 నుంచి సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారిణి.
ఫించన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బిల్లు-2011ను లోక్‌సభ సెప్టెంబర్ 4న ఆమోదించింది. వృద్ధాప్య ఆదాయ భద్రతను ప్రోత్సహించే అథారిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పెన్షన్ ఫండ్‌ను ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు, పెన్షన్ రంగంలో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతినిచ్చేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. చందాదారులు తమ సొమ్మును కనీస హామీ మొత్తం పొందగలిగే పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు సౌలభ్యం ఉంటుంది. ‘ఆదాయంతోపాటు పొదుపు’ అనే సూత్రం ఆధారంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు పీఎఫ్‌ఆర్‌డీఏకి చట్టబద్ధమైన అధికారాలు కల్పిస్తుంది. ప్రస్తుతం 5.28 మిలియన్ల చందాదారులున్నారు. పీఎఫ్‌ఆర్‌డీఏ ఆగస్టు 14 నాటికి * 34,965 కోట్ల కార్పస్ ఫండ్ కలిగి ఉంది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ఉద్యోగులు (సాయుధ బలగాలు తప్ప) ఎన్‌పీఎస్‌లో కచ్చితంగా చేరాలని నిబంధన విధించారు. తర్వాత దేశంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎన్‌పీఎస్‌లో చేరేందుకు 2009 మేలో అవకాశం కల్పించారు.
లీగల్ సర్వీస్ అథారిటీ
ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి సెప్టెంబర్ 6న నియమితులయ్యారు. ఆమె రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి. రమణ స్థానంలో జస్టిస్ రోహిణి బాధ్యతలు చేపట్టారు.
జుబిన్ మెహతాకు టాగూర్ అవార్డు ప్రదానం
పాశ్చాత్య సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతాకు 2013 టాగూర్ సాంస్కృతిక సామరస్య అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 6న ప్రదానం చేశారు. ఆయన పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో పేరుగాంచిన భారతీయుడు. ముంబైలో జన్మించిన మెహతా 1954లో వియన్నాకు వెళ్లి అక్కడ హాన్స్ స్వరోస్కీలో పాశ్చాత్య సంప్రదాయ సంగీతాన్ని ఆలపిస్తూ వచ్చారు. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. తొలి అవార్డును 2012లో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు బహూకరించారు.
భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ హత్య
ప్రఖ్యాత భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ (43)ని అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు సెప్టెంబర్ 6న కాల్చి చంపారు. అఫ్గానిస్థాన్‌లో ఆరోగ్య కార్యకర్తగా ఆమె సేవలందిస్తుంది. సుస్మిత స్థానిక మహిళల జీవితాలను కెమెరాతో చిత్రీకరించినందుకు ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మతం మార్చుకోవాలని వేధించిన తాలిబన్లు ఆమెను 1989లో అపహరించారు. 1993లో ఆమె తాలిబన్ల చెర నుంచి తప్పించుకున్న వైనంపై ‘ఏ కాబులీవాలాస్ బెంగాలీ వైఫ్’ పుస్తకం రాశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ నవలపై 2003లో హిందీలో ‘ఎస్కేప్ ఫ్రం తాలిబాన్’ అనే చిత్రం కూడా రూపొందింది.
అక్షరాస్యతలో మొదటి స్థానంలో త్రిపుర
దేశ అక్షరాస్యతలో త్రిపుర మొదటి స్థానంలో నిలిచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు. 94.65 శాతం అక్షరాస్యతతో కేరళను అధిగమించి త్రిపుర మొదటి స్థానం సాధించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా సెప్టెంబర్ 8న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాణిక్ ఈ విషయాన్ని తెలిపారు. కేరళ 93.91 శాతం అక్షరాస్యత సాధించింది. 100 శాతం అక్షరాస్యత లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు.
వైమానిక దళానికి సీ-17 రవాణా విమానం
భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్-3ని రక్షణమంత్రి ఎ.కె ఆంటోనీ ఉత్తర ప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో సెప్టెంబర్ 2న వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఈ భారీ రవాణా విమానం సైనిక దళాలను, ట్యాంకర్లు వంటి ఆయుధాలను తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఈ విమానం విపత్తుల్లో సహాయ చర్యలు చేపట్టడంలో వైమానిక దళం సామర్థ్యాన్ని ఎంతో పెంచుతుంది. 75 టన్నుల బరువు, 150 మంది సైనికులతో, 4200 కి.మీ నిరాటంకంగా సీ-17 విమానం ప్రయాణించగలదు. ప్రస్తుతం భారత్ ఉపయోగిస్తున్న రష్యా నిర్మించిన ఐఎల్-76 రవాణా విమానం 40 టన్నుల బరువును మాత్రమే మోయగలదు. పది సీ-17 విమానాలు, సంబంధిత పరికరాలు అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది.
క్రీడలు
ఒలింపిక్స్‌లో స్థానం నిలుపుకున్న రెజ్లింగ్
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2020, 2024 ఒలింపిక్స్‌లో 26వ క్రీడగా రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సెప్టెంబర్ 8న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. పోటీలో నిలిచిన బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, స్క్వాష్‌లను ఓటింగ్‌లో వెనక్కి నెట్టి రెజ్లింగ్ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొత్తం 95 ఓట్లలో రెజ్లింగ్‌కు అనుకూలంగా 49 ఓట్లు వచ్చాయి. స్క్వాష్‌కు 22 ఓట్లు మాత్రమే రాగా, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు 24 ఓట్లు పడ్డాయి. రెజ్లింగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రీడల జాబితా నుంచి ఐఓసీ తొలగించింది. కొత్తగా చేరిన రగ్బీ సెవెన్, గోల్ఫ్‌లతో కలిసి 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.
2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యో ఖరారు
ఒలింపిక్స్ క్రీడలు-2020ను నిర్వహించే అవకాశం జ పాన్ రాజధాని టోక్యో నగరానికి దక్కింది. సెప్టెంబర్ 8న బ్యూనస్‌ఎయిర్స్‌లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో టోక్యో 24 ఓట్ల తేడాతో ఇస్తాంబుల్ (టర్కీ)పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఒలింపిక్స్-2020 నిర్వహణ కోసం మొత్తం మూడు నగరాలు.. ఇస్తాంబుల్ (టర్కీ), మాడ్రిడ్ (స్పెయిన్), టోక్యో (జపాన్) పోటీపడ్డాయి. రాబోయే తరానికి ఒలింపిక్ విలువలు, క్రీడల ఫలితాలు అందించే క్రమంలో అద్భుతమైన, సురక్షితమైన క్రీడలను నిర్వహిస్తామంటూ (డిస్కవర్ టుమారో) పేరుతో జపాన్ ఇచ్చిన పిలుపు టోక్యోకు అవకాశం కల్పించింది. కాగా 1964లో కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించింది. రెండోసారి అవకాశం దక్కించుకున్న తొలి ఆసియా నగరం కూడా టోక్యోనే కావడం విశేషం. ఈ క్రీడల నిర్వహణకు రూ.54,087 కోట్లు ఖర్చు కాగలవని అంచనా.
ఇటలీ గ్రాండ్ ప్రి విజేత వెటెల్
ఇటలీ గ్రాండ్ ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 8న జరిగిన ఈ రేసులో ఫెరారీ డ్రైవర్ ఆలోన్సో రెండో స్థానంలో, వెబెర్ మూడో స్థానంలో నిలిచారు.
నాదల్, సెరెనాలకు యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్
అమెరికాలో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్ విజేతల వివరాలు..
పురుషుల సింగిల్స్: సెప్టెంబర్ 9న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించి రఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో నాదల్‌కు 3.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ద క్కింది. ఇది నాదల్‌కు 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అదేవిధంగా రెండో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్.
మహిళల సింగిల్స్: ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించి సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఇది సెరెనాకు ఐదో యూఎస్ ఓపెన్ టైటిల్. దీనితో సెరెనా తన కెరీర్‌లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించింది.
పురుషుల డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రేలియా), బ్రూనో సోరెస్ (బ్రెజిల్)లను ఓడించి పేస్ జంట విజేతగా నిలిచింది. పేస్‌కు ఇది కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో ఎనిమిది డబుల్స్ టైటిళ్లు కాగా, ఆరు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లు.
మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను ఆండ్రియా హవకోవా, లూసీ రడెకా (చెక్)లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో ఆస్టీగ్ బార్టీ, కాస్ డెల్లాక్వా (ఆస్ట్రేలియా)లను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్: ఆండ్రియా హవకోవా, మాక్స్‌మిర్నీ (చెక్ రిపబ్లిక్/బెలారస్)లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో అబిగెయిల్ స్పియర్స్, సాంటియాగో గోంజాలెజ్ (అమెరికా/మెక్సికో)లను ఓడించారు.
ఈతలో రికార్డు నెలకొల్పిన దియానా నయర్
అమెరికాకు చెందిన స్విమ్మర్ దియానా నయర్ (64) ఫ్లోరిడా జలసంధిలో క్యూబా నుంచి ఫ్లోరిడా కీస్ వరకు 177 కి.మీ ఈది రికార్డు నెలకొల్పింది. 53 గంటలపాటు సాగిన ఆమె సాహస కృత్యం సెప్టెంబర్ 2న ముగిసింది. షార్క్ కేజ్ లేకుండా చాలా దూరం సముద్రంలో ఈదిన తొలి వ్యక్తిగా దియానా రికార్డులకెక్కింది.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జీ-20 సమావేశం
Published Thu, Sep 12 2013 1:52 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement