అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్ | Current Affairs for Competitive Guidance | Sakshi
Sakshi News home page

అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్

Published Thu, Feb 6 2014 2:38 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Current Affairs for Competitive Guidance

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు

 
 
 జాతీయం
 
 జపాన్ ప్రధాని భారత పర్యటన
 జపాన్ ప్రధానమంత్రి షింజో అబే జనవరి 25-27 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. భారత్ 65వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. భద్రత, రాజకీయ, రక్షణ సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో సగం జపాన్ సహాయానికి సంబంధించినవి ఉన్నాయి.
 
 
 భారత్-ఫిజిల మధ్య ద్వంద్వ పన్నుల ఒప్పందం
 ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై (డిటిఎఎ) భారత్- ఫిజిలు జనవరి 30న సంతకాలు చేశాయి. భారత్ తరపున ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఫిజి తరపున ఆ దేశ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి అయియజ్ ఖయూమ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద డివిడెండ్లు, వడ్డీ, రాయల్టీ, నిపుణుల సేవలందించినందుకు వసూలు చేసే రుసుములపై ఇరుదేశాల్లో పన్ను విధిస్తారు.
 
 
 అఖిల భారత సర్వీసులకు రెండేళ్ల తర్వాతే బదిలీ
 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు కనీసం రెండేళ్లు ఒకచోట పనిచేసేటట్లు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వశాఖ జనవరి 31న విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగోన్నతి, డెప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు బదిలీ, పదవీ విరమణ, రెండు నెలలకు మించి శిక్షణ లాంటి పరిస్థితులలో తప్ప వారిని బదిలీ చేసేందుకు వీలులేదు.
 
 ఒకవేళ రెండేళ్లలోపు బదిలీ చేయాల్సి వస్తే రాష్ట్ర పరిధిలో ఏర్పాటయ్యే సివిల్ సర్వీసెస్ బోర్డు ద్వారా చేయాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం సివిల్ సర్వెంట్ల కనీస ఉద్యోగ కాలం రెండేళ్లు ఉండాలని, రాజకీయ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్డు సూచించడంతో కొత్త మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది.
 
 
 రాజస్థాన్‌లో అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రం
 ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రాన్ని రాజస్థాన్‌లో ఏర్పాటు చేయడానికి భెల్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగసంస్థలు సంకల్పించాయి. 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ కేంద్రం ఏర్పాటుకు మొదటి దశలో రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు భెల్ సంస్థ తెలిపింది.
 
 
 న్యూఢిల్లీలో జాతీయ వక్ఫ్ అభివృద్ధి సంస్థ
 కొత్త ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ (జాతీయ వక్ఫ్ అభివద్ధి కార్పోరేషన్ -నవాడ్కో)ను ప్రధాని మన్మోహన్‌సింగ్ జనవరి 29న న్యూఢిల్లీలో ప్రారంభించారు. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి, వనరుల సమీకరణకు రూ. 500 కోట్ల మూలధనంతో 2013, డిసెంబర్ 31న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 4.9 లక్షల రిజిస్టర్‌‌డ ఆస్తులతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ తెలిపారు. వీటిని సక్రమంగా అభివృద్ధి చేస్తే ఏటా రూ.1,200 కోట్ల ఆదాయం వస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు.
 
 
 భారత్‌లోనే నిరక్షరాస్యత: ఐరాస
 భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. 28.7 కోట్ల మందికి అక్షరం పట్ల అవగాహన లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని పేర్కొంది. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 శాతం మంది భారతీయులే ఉన్నారని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ -2013-14’ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
 
 
 బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం
 బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ మద్రాస్ సహకారంతో రూ. 225 కోట్లతో ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ జనవరి 30న ప్రకటించారు.
 
 
 అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్
ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళా సర్పంచ్ ఆరతీదేవీ (28) కి అమెరికాలో జరిగే ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇల్లినాయీ రాష్ట్రం స్ప్రింగ్‌ఫీల్డ్‌లో ఫిబ్రవరిలో మూడు వారాల పాటు నిర్వహించే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగ్రాం (ఐవీఎల్‌పీ)కి భారత్ నుంచి ఆరతీదేవి ఒక్కరే ఎంపికవడం విశేషం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు.
 
 గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచ్ అయిన ఆరతి, ఎంబీఏలో పట్టభద్రురాలు. సర్పంచ్‌గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని వదులుకోవడం విశేషం. ఇప్పటిదాకా ఈ సదస్సుకు మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్‌బీహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభాపాటిల్ మాత్రమే గతంలో పాల్గొన్నారు.
 
 
 ముంబైలో మోనోరైలు సేవలు
 దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటిదశను  ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాలా-చెంబూర్‌ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ముంబైలో మొత్తం 19.17 కి.మీ మోనోకారిడార్ నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద మోనోకారిడార్. జపాన్‌లోని ఒసాకా నగరంలోని 23.8 కి.మీ. పొడవైన  మోనోరైలు మార్గం ప్రపంచంలో అతి పొడవైనది.
 
 దక్షిణ ముంబైలోని జాకోబ్ సర్కిల్ నుంచి తూర్పు ముంబైలోని చెంబూర్‌కు మోనోరైలు రవాణామార్గం అనుసంధానమవుతుంది. ఈ 19.17 కి.మీ మోనోరైలు మార్గాన్ని రూ. 3వేల కోట్లతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మిస్తోంది.
 
 
 101వ సైన్‌‌స కాంగ్రెస్
 జమ్మూలో 101వ సైన్‌‌స కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. ‘ఇన్నోవేషన్‌‌స ఇన్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్’ ఇతివృత్తంతో ఈ సైన్‌‌స కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.
 
 
 ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్‌రావత్
 ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హరీష్‌రావత్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక రావత్‌ఎనిమిదో ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ బహుగుణ జనవరి 30న తన పదవికీ రాజీనామా చేశారు. గతేడాది ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చినప్పుడు బహుగుణ పనితీరుపై సొంతపార్టీలోనే విమర్శలు తలెత్తడంతో బహుగుణ రాజీనామా చేశారు.
 
 
 వృద్ధి రేటును తగ్గించిన కేంద్రం
 2012-13లో జీడీపీ వృద్ధి 4.5 శాతంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇది దశాబ్దంలో అతి తక్కువ. గతంలో దీన్ని 5 శాతంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన అంచనాలను సీఎస్‌ఓ జనవరి 31న విడుదల చేసింది. వీటి మేరకు 2011-12లో జీడీపీ వృద్ధిని 6.7 శాతంగా సవరించింది. 2012-13లో జీడీపీ విలువ రూ.54.80 లక్ష కోట్లు కాగా 2011-12లో రూ. 52.50 కోట్లుగా తెలిపింది.
 
 
 అంతర్జాతీయం
 
 టునీషియా కొత్త ప్రధాని మెహ్‌దీ జోమా
 టునీషియాలో మెహ్‌దీజోమా ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం జనవరి 29న కొలువు దీరింది. రాజకీయ అనిశ్చితి తొలగించేందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఇస్లామిస్టుల నాయకత్వాన గల ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2014 చివరి నాటికి పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
 


 పర్యావరణ జాబితాలో భారత్‌కు 155వ స్థానం
 అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితా (గ్లోబల్ గ్రీన్ లిస్)లో భారత్‌కు 155వ స్థానం దక్కింది. ‘2014 పర్యావరణ పనితీరు సూచి’లో 178 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. ఈ సూచిలో 31.23 పాయింట్లతో భారత్ 155 వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ మొదటి స్థానం, తరువాత స్థానాల్లో లగ్జమ్‌బర్గ్, ఆస్ట్రేలియా, సింగపూర్, చెక్ రిపబ్లిక్‌లు ఉన్నాయి. ఈ సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌తో కలిసి యేల్,కొలంబియా విశ్వవిద్యాలయాలు రూపొందించాయి.


 
 ఫేస్‌బుక్‌కు పది వసంతాలు
 సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌కు 2014, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇంటర్నెట్ తెచ్చిన సమాచార విప్లవంలో సోషల్ మీడియా మరింత విప్లవాత్మక మార్పులు తెచ్చింది. హార్వర్డ్ వర్సిటీ విద్యార్థిగా మార్క్ జుకర్‌బర్గ్ రూపొందించిన ప్రాజెక్టు ఫేస్‌బుక్‌గా రూపుదిద్దుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మందిని అనుసంధానిస్తోంది.


 
 నాసా డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్
 అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ (నాసా) డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 30న నియమించారు. వైస్ అడ్మిరల్ రోజర్స్ నౌకారంగం సైబర్-వార్‌ఫేర్ నిపుణుడు. మార్చిలో పదవీవిరమణ చేస్తున్న ప్రస్తుత డెరైక్టర్ కీత్ అలెగ్జాండర్ స్థానంలో రోజర్స్ నాసా బాధ్యతలు చేపడతారు.


 
 ఐరాసలో ప్రత్యేక సలహాదారుగా వివేక్‌లాల్
 ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సలహాదారుడిగా ప్రముఖ ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వివేక్‌లాల్ జనవరి 30న నియమితులయ్యారు. ఈయన ఐక్యరాజ్యసమితికి బ్రాడ్ బాండ్, ఇతర సైబర్ భద్రత అంశాలకు సంబంధించి విధాన రూపక ల్పన, అమలులో తోడ్పడతారు.


 
 జింబాబ్వేలో చలామణిలోకి రుపాయి
 జింబాబ్వేలో చలామణి అవుతున్న కరెన్సీ జాబితాలో భారత రూపాయికి చోటు దక్కింది. ఈ మేరకు రిజర్‌‌వ బ్యాంక్ ఆఫ్ జింబాంబ్వే జనవరి 29న ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే బొట్సవానా పౌలా, బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్, యూరో, సౌత్ ఆఫ్రికన్ రాండ్, యూఎస్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, చైనీస్ యూవాన్, జపాన్ యెన్ చలామణిలో ఉన్నాయి.
 
 
 
 క్రీడలు


 వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన ధోనీ
 ఎంఎస్ ధోనీ వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన ఏడో భారత ఆటగాడుగా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్‌తో  జనవరి 31న ముగిసిన ఐదో వన్డేలో ధోనీ 8,046 పరుగులకు చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగంగా 8వేల పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా కూడా ధోనీ గుర్తింపు పొందాడు.


 
 ఐసీసీ ప్యానల్‌లో తొలి మహిళా అంపైర్
 న్యూజిలాండ్‌కు చెందిన కేథీక్రాస్ ఐసీసీ అంపైర్ ప్యానల్‌కు ఎంపికైన తొలిమహిళగా చరిత్ర పుటలకెక్కింది. 2014 సంవత్సరానికి అసోసియేట్, అఫిలియేట్ ఇంటర్నేషనల్ అధికారిణిగా ఆమెను ఐసీసీ ప్యానల్‌లోకి తీసుకోనున్నారు. కింగ్‌కౌంటీలోని టౌమరునీలో పుట్టిన 56 ఏళ్ల క్రాస్ ఇప్పుడు ఐసీసీ ప్రపంచ లీగ్ డివిజన్స్‌లో నియామకానికి అర్హత సాధించింది.


 
 రంజీ విజేత కర్ణాటక
 రంజీ ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. ఈ టైటిల్ నెగ్గడం కర్ణాటకకు ఇది ఏడోసారి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న ముగిసిన ైఫైనల్లో మహారాష్ట్రను ఓడించి 1998-99 తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గింది. విజేతకు రూ. 2 కోట్లు, రన్నరప్‌కు రూ. కోటి ప్రైజ్‌మనీ లభించింది.


 
 సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ విజేత సింధు
 ఆంధ్రప్రదేశ్ స్టార్‌షట్లర్ పి.వి. సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో పి.సి.తులసి (కేరళ)పై సింధు విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ నెగ్గింది. అపర్ణ బాలన్‌తో జతగా బరిలోకి దిగిన సిక్కిరెడ్డి జోడి ప్రజక్తా సావన్, ఆరతి సారా జంటను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్. ఎస్. ప్రణయ్ కైవసం చేసుకున్నాడు.
 


 అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ అవార్డు
 భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ కమిట్‌మెంట్ అవార్డు లభించింది. ఈ పురస్కారం గతంలో రామనాథన్ కృష్ణన్, జైదీప్ ముఖర్జీ, ఆనంద్ అమృత్‌రాజ్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్ , మహేశ్ భూపతిలకు దక్కింది.
 
 
 
 రాష్ట్రీయం


 జీవ వైవిధ్యమండలి చైర్మన్‌గా హంపయ్య
 రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్‌గా డాక్టర్ హంపయ్య మరో ఏడాది కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ జనవరి 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 
 రాష్ట్రంలో ఓటర్లు... 6.23 కోట్లు
 రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.23 కోట్లకు చేరిందని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 1న ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఓటర్లున్నారని తెలిపింది. 2013 జనవరి 15న సవరించిన జాబితా ప్రకారం 5.81 కోట్ల మంది ఓటర్లు కాగా తాజాగా ఈ సంఖ్య 6.23 కోట్లకు పెరిగింది.


 
 చక్రపాణికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పురస్కారం
 శాసనమండలి ైచైర్మన్ ఎ.చక్రపాణిని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ (జీజీఎఫ్) గౌరవ మెడల్‌తో సత్కరించింది. ఫిబ్రవరి 2న శాసనమండలి ఆవరణలోని కమిటీ హాల్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పీ వర్మ చేతులమీదుగా చక్రపాణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement